Nagarkurnool : మంచినీళ్లు అడిగితే మూత్రం పోశాడు!
ABN, Publish Date - Apr 03 , 2025 | 04:09 AM
నాగర్‌కర్నూలు జిల్లా ఊర్కొండపేటలో ఓ వివాహిత(27)పై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఏడుగురు నిందితులు.. తర్వాత కూడా అతి దారుణంగా వ్యవహరించారు.

గ్యాంగ్ రేప్ బాధితురాలిపై నిందితుల మరో అకృత్యం
పోలీసుల విచారణలో వెల్లడి.. నిందితులకు రిమాండ్
కల్వకుర్తి, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): నాగర్‌కర్నూలు జిల్లా ఊర్కొండపేటలో ఓ వివాహిత(27)పై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఏడుగురు నిందితులు.. తర్వాత కూడా అతి దారుణంగా వ్యవహరించారు. బాధితురాలు తాగునీరు అడగ్గా నిందితుల్లో ఒకడైన కార్తీక్ ఆమెపై మూత్రవిసర్జన చేశాడు. ఈ విషయం నిందితుల విచారణలో తేలిందని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. ఏడుగురు నిందితులు ఊర్కొండపేటకు చెందిన మారుపాకుల ఆంజనేయులు, ఎండీ సాధిక్ బాబా, వాగుల్‌దాస్ మణికంఠ, కార్తీక్, మట్ట మహేష్ గౌడ్, హరీశ్ గౌడ్, ఊర్కొండకు చెందిన మట్ట ఆంజనేయులు గౌడ్‌ను అరెస్టు చేసి బుధవారం కొల్లాపూర్ కోర్టులో హాజరుపరచగా జడ్జి రిమాండ్ విధించారని చెప్పారు. ఎస్పీ రఘునాథ్ కేసు వివరాలను మీడియాకు తెలిపారు.
బాధితురాలు గత నెల 29న కుటుంబ సభ్యులతో కలిసి ఆంజనేయస్వామి గుడికి వచ్చింది. దర్శనం అనంతరం గుడి ఆవరణలోనే నిద్రించారు. మూత్ర విసర్జనకు తన బంధువుతో కలిసి ఖాళీ ప్రదేశంలోని చింతచెట్టు వద్దకు వెళ్లింది. దీన్ని నిందితులు గమనించారు. మొదట నలుగురు, తర్వాత ముగ్గురు వారి వద్దకు వచ్చారు. రాత్రి 11 నుంచి 12 గంటల మధ్యలో గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. రేప్ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తామని నిందితులు బాధితురాలిని బెదిరించారు. నిందితులు 20 నుంచి 28 ఏళ్ల మధ్య వయస్కులని, ఇద్దరికి పెళ్లిళ్లు కాగా.. ఐదుగురు అవివాహితులని ఎస్పీ తెలిపారు.
Updated Date - Apr 03 , 2025 | 04:09 AM