Jupally Krishna Rao: బీజేపీ, బీఆర్‌ఎస్‌ మాటలకు బోల్తా పడొద్దు

ABN, Publish Date - Apr 03 , 2025 | 05:04 AM

బీజేపీ, బీఆర్‌ఎస్‌ నేతల మాటలకు బోల్తా పడొద్దని విద్యార్థులకు మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. వారు రాజకీయ లబ్ధి కోసం విద్యార్థులను పావులుగా వాడుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Jupally Krishna Rao: బీజేపీ, బీఆర్‌ఎస్‌ మాటలకు బోల్తా పడొద్దు
  • వారు మిమ్మల్ని పావులా వాడుకుంటున్నారు: జూపల్లి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): బీజేపీ, బీఆర్‌ఎస్‌ నేతల మాటలకు బోల్తా పడొద్దని విద్యార్థులకు మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. వారు రాజకీయ లబ్ధి కోసం విద్యార్థులను పావులుగా వాడుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్‌సీయూ నుంచి ప్రభుత్వం ఒక్క ఇంచు భూమిని కూడా తీసుకోవట్లేదని, కంచ గచ్చిబౌలిలోని ఆ 400 ఎకరాల భూమి హెచ్‌సీయూకి సంబంధినది కానే కాదని చెప్పారు. ఈ 400 ఎకరాల భూమి గత 20 ఏళ్లుగా వివాదంలో ఉందని, పదేళ్ల పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎ్‌సలు దానిని కాపాడే ప్రయత్నాలు ఎందుకు చేయలేదని మంత్రి నిలదీశారు. రేవంత్‌రెడ్డి సీఎం అయిన తర్వాత హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో సరైన న్యాయవాదులను పెట్టి ఆ భూమి అన్యాక్రాంతం కాకుండా కాపాడారన్నారు.


అప్పటి చంద్రబాబు ప్రభుత్వం హెచ్‌సీయూ నుంచి 534 ఎకరాలు తీసుకుని బదులుగా గోపన్‌పల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని 397 ఎకరాల ప్రభుత్వ భూమిని వర్శిటీకి స్వాధీనం చేసిందని, ఆ 534 ఎకరాల్లోనే ఈ 400 ఎకరాలున్నందున వర్శిటీ నుంచి ప్రభుత్వం ఈ భూమిని గుంజుకుందన్న అంశం ఉత్పన్నం కాదన్నారు. ఇప్పుడు పెడ బొబ్బలు పెడుతున్న బీఆర్‌ఎస్‌, పదేళ్ల పాలనలో 31 వేల కోట్ల విలువైన 453 ఎకరాల ప్రభుత్వ భూమిని అమ్మిందన్నారు. దేశంలో గత పదేళల్లో 16 లక్షల ఎకరాల అడవిని నాశనం చేసిన అధికార బీజేపీకి కంచ గచ్చిబౌలి భూమిపై మాట్లాడే నైతిక హక్కు ఉందా అని ప్రశ్నించారు.

Updated Date - Apr 03 , 2025 | 05:05 AM