Share News

ఓటరు నమోదుకు మరో ఛాన్స్‌..

ABN , Publish Date - Apr 02 , 2025 | 01:01 AM

ఓటర్ల నమోదు నిరంతర పక్రియగా మారింది. ఇందుకోసం ఏడాదిలో నాలుగు సార్లు ఓటరు నమోదుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పిస్తోంది. తాజాగా మంగళవారం నుంచి ఓటరు నమోదు చేపట్టారు.

ఓటరు నమోదుకు మరో ఛాన్స్‌..

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

ఓటర్ల నమోదు నిరంతర పక్రియగా మారింది. ఇందుకోసం ఏడాదిలో నాలుగు సార్లు ఓటరు నమోదుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పిస్తోంది. తాజాగా మంగళవారం నుంచి ఓటరు నమోదు చేపట్టారు. ఇందుకోసం రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గతంలో ఓటరు నమోదు ఏడాదికి ఒక్కసారి మాత్రమే అవకాశంగా ఉండేది. తాజాగా కొత్త ఓటర్ల నమోదును జనవరి, ఏప్రిల్‌, జూలై, అక్టోబరు నెలల్లో నమోదుకు అవకాశం కల్పించింది. తాజాగా ఏప్రిల్‌ నాటికి 18 సంవత్సరాలు నిండే ప్రతి ఒక్కరూ బీఎల్‌వోల వద్ద లభించే దరఖాస్తుల ద్వారా లేదా ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లోనైనా ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. ఇందుకోసం ఓటరు నమోదుకు సంబంధించి, ఓటరు జాబితా సవరణపై కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా, రాజకీయ పార్టీలతో సమావేశం కూడా నిర్వహించారు. ఓటరు జాబితాలో డబుల్‌ ఎంట్రీలను తొలగించనున్నారు. ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు ఓటర్ల బదిలీ, ఓటరు గుర్తింపు కార్డుల్లో మార్పులు, కుటుంబ సభ్యులందరూ వేర్వేరు పోలింగ్‌ కేంద్రాల్లో నమోదై ఉంటే అందరూ ఒకే పొలింగ్‌ కేంద్రంలో ఉండే విధంగా జాబితాను సవరించనున్నారు.

ఫ స్థానిక ఎన్నికల్లో పెరగనున్న ఓటర్లు..

ఓటరు నమోదు పక్రియతో త్వరలో రాబోయే స్థానిక ఎన్నికల్లోనూ ఓటర్ల సంఖ్య పెరగనుంది. బోగస్‌ ఓటర్లు కూడా తొలగిపోనున్నారు. మున్సిపల్‌, గ్రామ పంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సమయంలో గ్రామీణ ప్రాంతాలకు ఓటర్లు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం నిర్ణయింది. దీంతో పకడ్బందీగా ఓటరు జాబితా సవరణ అవుతుందని భావిస్తున్నారు. ఇదే సమయంలో ప్రస్తుత ఓటర్ల నమోదుతో గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక ఎన్నికల ఓటరు జాబితా పెరుగుతుందని భావిస్తున్నారు.

ఫ జిల్లాలో ఇదీ ఓటర్ల లెక్క..

జిల్లాలో ప్రధానంగా ఉన్న సిరిసిల్ల, వేములవాడ రెండు సెగ్మెంట్లలో 4,76,345 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 2,29,352 మంది, మహిళలు 2,47,046 మంది ఉన్నారు. 37 మంది జెండర్లు, 169 మంది సర్వీస్‌ ఓటర్లు ఉన్నారు. రెండు నియోజకవర్గాలో 17,694 మంది మహిళ ఓటర్లే అధికంగా ఉన్నారు. సిరిసిల్ల సెగ్మెంట్‌లో 2,48,334 మంది ఓటర్లు ఉండగా పురుషులు 1,20,498 మంది, మహిళలు 1,27,829 మంది ఉన్నారు. 7 మంది జెండర్లు, 106 మంది సర్వీస్‌ ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళలు 7,331 మంది అధికంగా ఉన్నారు. వేములవాడ సెగ్మెంట్‌లో 2,28,101 మంది ఓటర్లు ఉండగా పురుషులు 1,08,854 మంది, మహిళలు 1,19,217 మంది ఉన్నారు. 30 మంది జెండర్లు, 63 మంది సర్వీస్‌ ఓటర్లు ఉన్నారు. మహిళలు 10,363 మంది అధికంగా ఉన్నారు.

ఓటరు నమోదుగా కావాలంటే...

ఫ 18సంవత్సరాలు పూర్తయిన వారు ఓటరు నమోదు, చేర్పులు, తొలగింపులు, సవరింపులు చేసుకోవచ్చు.

ఫ నిర్ణత నమూనాలో ఉన్న ఫారాలను ముందుగా నింపాల్సి ఉంటుంది.

ఫ ఫారం 6 : కొత్తగా ఓటర్ల జాబితాలో పేరు చేర్చుటకు క్లయిమ్‌ దరఖాస్తు.

ఫ ఫారం 7 : ఓటరు జాబితాలో పేరు చేర్చుటకు సంబంధించి అభ్యంతరం తెలపడానికి, జాబితాలోంచి పేరు తొలగించడానికి దరఖాస్తు.

ఫ ఫారం 8 : ఓటరు జాబితాలో సవరణలు చేయడానికి దరఖాస్తు.

ఫ ఫారం 8 ఎ : ఓటరు జాబితాలో పేరును మరో చోటికి బదిలీ చేయటానికి దరఖాస్తు.

ఫ ఈ ఫారాల్లో నింపి సంబంధిత తహసీల్‌ కార్యాలయంలో లేదా బీఎల్‌ఓలకు ఇవ్వాల్సి ఉంటుంది.

ఈ-రిజిస్ట్రేషన్‌ చేయడం ఎలా..

ఫ ఎన్నికల కమిషన్‌ సూచించిన అన్ని ఫారాలను ఎన్నికల కమిషన్‌ వెబ్‌సైట్‌లో ఈ-రిజిస్ట్రేషన్‌కు అందుబాటులో ఉంచారు.

ఫ అర్హత కలిగిన యువతీయువకులు ఎన్నికల కమిషన్‌ సైట్‌లో లాగిన్‌ కావాలి.

ఫ ఛీఫ్‌ ఎలక్షన్‌ ఆఫీసర్‌ పేరుతో ఉన్న వెబ్‌సైట్‌ వస్తుంది. దీంట్లో పైన ఈ-రిజిస్ట్రేషన్‌ కనిపిస్తుంది. దాన్ని క్లిక్‌ చేస్తే కొత్తగా చేరే వారి కోసం, చేర్పులు, మార్పులు, అభ్యంతరాలకు సంబంధించిన ఫారాలు కనిపిస్తాయి.

ఫ కొత్తగా చేరే వారు ఫాం 6పైన క్లిక్‌ చేస్తే ఫాం వస్తుంది. అందులో తమ వివరాలను పొందపరుచాలి.

ఫ వివరాలను పొందపర్చిన తరువాత తెలుగులో ట్రాన్స్‌లేట్‌కు ఆప్షన్‌ కూడా ఉంటుంది.

ఫ ఫారం పూర్తి చేసిన తరువాత ఫొటోను అప్‌లోడ్‌ చేయాలి. 100కేబీలకు మించకుండా ఉండాలి.

ఫ ఫారం 6 నింపడం పూర్తయిన తరువాత సేవ్‌ చేసి ట్రాన్‌ఫర్‌ బటన్‌ క్లిక్‌ చేయాలి. ఆ తరువాత యునిక్యూ ఆప్లికేషన్‌ ఐడి నంబర్‌ వస్తుంది. దానిద్వారా మీరు అప్‌లోడ్‌ చేసిన దరఖాస్తు స్టేటస్‌ను చూసుకోవచ్చు.

ఫ ఓటరుగా ఈ-రిజిస్ట్రేషన్‌ చేసిన దరఖాస్తును సంబంధిత తహసీల్దార్‌, డౌన్‌లోడ్‌ చేసుకొని సమర్పించిన వివరాలపై విచారణ జరుపుతారు.

అధికారుల వివరాల సేకరణ ఇలా...

ఫ ఈ-రిజిస్ట్రేషన్‌ లేదా స్వయంగా దరఖాస్తులను అందించిన వాటిని అధికారులు వివరాలు సేకరిస్తారు. దరఖాస్తు దారుల నుంచి వచ్చిన వివరాలను స్వయంగా బీఎల్‌వోల ద్వారా సేకరిస్తారు.

ఫ సేకరించిన వివరాలను ఫారం 9 ద్వారా చేర్పులు, ఫారం 10 ద్వారా అభ్యంతరాలు, ఫారం 11ద్వారా సవరణలు, ఫారం 11ఎ ద్వారా బదిలీలు తహసీల్దార్‌ కార్యాలయంలో అందజేస్తారు.

ఫ ఫారం 6 ద్వారా వచ్చిన దరఖాస్తుల వారి అర్హతను పరిశీలించి రెండు కలర్‌ పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలను స్వీకరిస్తారు.

ఫ పూర్తయిన దరఖాస్తును మళ్లీ ఆర్డీవో కార్యాలయానికి పంపిస్తారు. అక్కడ పూర్తిస్థాయిలో ఎన్‌రోల్‌ చేస్తారు.

Updated Date - Apr 02 , 2025 | 01:01 AM