Share News

Viral Video:గ్రద్ద ఎంత పని చేసింది.. పబ్లిక్ సర్వీస్ కమిషన్ హాల్ టికెట్ ఎత్తుకెళ్లిపోయింది..

ABN , Publish Date - Apr 11 , 2025 | 07:38 AM

Eagle Snatches Hall Ticket: ఎక్కడినుంచి వచ్చిందో తెలీదు కానీ, ఓ గ్రద్ద అతడి దగ్గరకు వచ్చింది. టక్కున హాల్ టికెట్ ఎత్తుకుపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై పెద్ద సంఖ్యలో నెటిజన్లు స్పందిస్తున్నారు.

Viral Video:గ్రద్ద ఎంత పని చేసింది.. పబ్లిక్ సర్వీస్ కమిషన్ హాల్ టికెట్ ఎత్తుకెళ్లిపోయింది..
Eagle Snatches Hall Ticket

విధి వైపరిత్యం.. విధి ఆడిన వింత నాటకం అంటే ఇదేనేమో.. ఎక్కడో వందల మీటర్ల ఎత్తులో తిరుగుతూ వేట కోసం చూసే గ్రద్ద.. ఓ స్కూల్లోకి వచ్చింది. వచ్చింది ఊరికే ఉండొచ్చు కదా.. ఓ నిరుద్యోగి కలల్ని నాశనం చేయడానికి ప్రయత్నించింది. ఎంతో కాలంగా కష్టపడి ప్రిపేర్ అయిన కాంపిటీటివ్ పరీక్ష హాల్ టికెట్ దొంగలించింది. దీంతో అతడితో పాటు అక్కడి వారందరూ షాక్ అయ్యారు. ఈ సంఘటన కేరళలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. ఇంతకీ ఆ వ్యక్తి ఏ పరీక్ష కోసం అక్కడ ఉన్నాడు? ఆ గ్రద్ద హాల్ టికెట్‌ను వదిలేసిందా లేదా? అని తెలుసుకోవాలంటే ఈ మొత్తం స్టోరీ చదవాల్సిందే. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


కేరళలోని కాసర్‌గడ్‌కు చెందిన ఓ యువకుడు కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాయడానికి గవర్నమెంట్ యూపీ స్కూలుకు వచ్చాడు. పరీక్ష మొదలవ్వడానికంటే ఓ అరగంట ముందే అక్కడ ఉన్నాడు. చదువుకున్న వాటిని రివిజన్ చేస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఎక్కడినుంచి వచ్చిందో తెలీదు కానీ, ఓ గ్రద్ద అతడి దగ్గరకు వచ్చింది. టక్కున హాల్ టికెట్ ఎత్తుకుపోయింది. ఈ పరిణామంతో ఆ యువకుడితో పాటు అక్కడ పరీక్ష రాయడానికి వచ్చిన దాదాపు 300 మంది కూడా షాక్ అయ్యారు. హాల్ టికెట్ ఎత్తుకెళ్లిన గ్రద్ద .. పరీక్ష హాలు కిటికీపై కూర్చుంది. మరి కొన్ని నిమిషాల్లో పరీక్ష మొదలవుతుంది. హాల్ టికెట్ లేకపోతే పరీక్ష హాలులోకి పంపేది లేదని అధికారులు తేల్చి చెప్పారు.


దీంతో యువకుడికి భయంతో చెమటలు మొదలయ్యాయి. కొద్ది సేపటి తర్వాత ఆ గ్రద్ద అక్కడినుంచి పైకి ఎగిరింది. కాళ్లతో పట్టుకున్న హాల్ టికెట్‌ను వదిలేసింది. ఆ యువకుడు ఊపిరి పీల్చుకున్నాడు. హాల్ టికెట్ కింద పడగానే పరిగెత్తుకెళ్లి తీసుకున్నాడు. పరీక్ష హాలులోకి వెళ్ళాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ‘ నీ అదృష్టం బాగుంది బ్రదరూ.. లేదంటే సంవత్సరాల కష్టం వృధా అయ్యేది’.. ‘ నిజంగా చెప్పాలంటే అదో అద్భుతమైన విషయం. ఎక్కడో గాల్లో తిరిగే గ్రద్ద నేలపైకి రావటం ఏంటి? హాల్ టికెట్ ఎత్తుకెళ్లం ఏంటి? అంతా దేవుడి లీల ’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

Kangana Ranaut: కరెంట్ బిల్ వివాదంలో హీరోయిన్ కంగనా రనౌత్

Today Horoscope: ఈ రాశి వారికి పెట్టుబడుల విషయంలో తొందరపాటు తగదు

Updated Date - Apr 11 , 2025 | 07:39 AM