Share News

ధాన్యం కొనుగోళ్లకు సర్వం సిద్ధం

ABN , Publish Date - Apr 12 , 2025 | 02:18 AM

ధాన్యం కొనుగోళ్లకు జిల్లా అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. యాసంగిలో 3.60 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోళ్లు లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా 342 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది.

ధాన్యం కొనుగోళ్లకు సర్వం సిద్ధం

- నేడు చొప్పదండి నియోజకవర్గంలో లాంఛనంగా ప్రారంభం

- 342 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు

- 5.86 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి అంచనా

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

ధాన్యం కొనుగోళ్లకు జిల్లా అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. యాసంగిలో 3.60 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోళ్లు లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా 342 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. చొప్పదండి శాసనసభ్యుడు మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి శనివారం చొప్పదండి నియోజకవర్గంలో లాంఛనంగా కొనుగోళ్లకు శ్రీకారం చుట్టనున్నారు. జిల్లాలో ప్రతి గ్రామంలోనూ, పెద్ద గ్రామాల్లో అవసరమైతే రెండేసి కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో 180, ఐకేపీ ఆధ్వర్యంలో 120, డీసీఎంఎస్‌ ఆధ్వ ర్యంలో 38, హాకా ఆధ్వర్యంలో 4 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ధాన్యం కోతలు పూర్తవుతుండడంతో రైతులకు అందుబాటులో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 342 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 3.60 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ కొనుగోలు కేంద్రాలలో సన్న,దొడ్డు రకం వరి విత్తనాలను కొనుగోలు చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఫ యాసంగిలో 2,66,896 ఎకరాల్లో వరిసాగు

జిల్లాలో యాసంగిలో 2,66,896 ఎకరాల్లో వరిసాగు జరిగింది. ఇందులో 1,99,051 ఎకరాల్లో దొడ్డు రకాలు, 67,845 ఎకరాల్లో సన్న రకం సాగుచేశారు. వీటిలో సుమారు 40వేల ఎకరాల్లో విత్తనపంట ప్రధానంగా హుజురాబాద్‌ రెవెన్యూ డివిజన్‌లో సాగైంది. వాతావరణం అనుకూ లంగా ఉండడంతో ఈసారి 5,86,723 మెట్రిక్‌ టన్నుల వరి దిగుబడి వస్తుందని అంచనా వేశారు. దిగుబడిలో 4,57,817 మెట్రిక్‌ టన్నులు దొడ్డు రకం, 1,28,906 మెట్రిక్‌ టన్నుల సన్నరకం ధాన్యం వస్తుందని అంచనా వేశారు. రైతుల స్వంత అవసరాలు, సీడ్‌ దిగుబడి కింద 2,26,713 మెట్రిక్‌ టన్నులు మినహాయిస్తే 3,60,000 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని భావించి ఏర్పాట్లు చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలకు 2,74,946 మెట్రిక్‌ ్డటన్నుల దొడ్డు వరి ధాన్యం, 85,054 మెట్రిక్‌ టన్నుల సన్న రకం వరి ధాన్యం వస్తుందని భావిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తూకం వేసేందుకు యంత్రాలు, గన్నీ బ్యాగులు, టార్పాలిన్లను అవసరమైన మేరకు అందుబాటులో ఉంచాలని కలెక్టర్‌ ఆదేశించారు. 7,472 టార్పాలిన్ల అవసరం కాగా 4,955 ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. మిగతా వాటిని తెప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని కొనుగోలు కేంద్రాలలో ప్రస్తుతం అందు బాటులో ఉన్న ప్యాడీ క్లీనర్లకు మరో 15 ప్యాడీ క్లీనర్లను కొనుగోలు చేసి తెప్పిస్తున్నారు. ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో కొనుగోలు కేంద్రాల్లో రైతులకు నీడ కోసం టెంట్లు, తాగునీటి వసతి ఏర్పాట్లు చేస్తున్నారు. సన్న ధాన్యం గుర్తించేందుకు ప్రతి నాలుగైదు కేంద్రా లకు ఒక వ్యవసాయాధికారిని ఇన్‌చార్జిగా నియమించారు. ఆ అధికారి గ్రెయిన్‌ కాలిఫర్‌తో వరి ధాన్యాన్ని కొలిచి సన్న రకంను నిర్ధారిస్తారు. వరి గింజ 6 మి.మీ.పొడవు, 2 మి.మీ. వెడల్పు ఉంటేనే సన్నరకంగా గుర్తిస్తారు. గతంలో జిల్లాలో 336 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా ఈసారి అదనంగా మరో 6 కేంద్రాలతో మొత్తం 342 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం వెంటవెంటనే కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు చెబుతున్నారు. అంతే కాకుండా కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటవెంటనే రైసుమిల్లులకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - Apr 12 , 2025 | 02:18 AM