Share News

రైతు కష్టం దళారుల పాలు

ABN , Publish Date - Apr 15 , 2025 | 11:44 PM

రైతుల కష్టం దళారుల పాలవుతోంది. ఆరుగాలం శ్రమించి వరి దాన్యం పండించిన రైతులు ఓ వైపు పంటలను రక్షించుకోవడానికి మరో వైపు ఆకాల వర్షం నుంచి కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. ఆకాల వర్షం కారణంగా రైతులు ఈ యాసంగిలో ముందస్తుగా కోతలు నిర్వహించారు.

రైతు కష్టం దళారుల పాలు
దుర్శేడ్‌ కొనుగోలు కేంద్రంలో పేరుకు పోయిన వరి దాన్యం

కరీనంగర్‌ రూరల్‌, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): రైతుల కష్టం దళారుల పాలవుతోంది. ఆరుగాలం శ్రమించి వరి దాన్యం పండించిన రైతులు ఓ వైపు పంటలను రక్షించుకోవడానికి మరో వైపు ఆకాల వర్షం నుంచి కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. ఆకాల వర్షం కారణంగా రైతులు ఈ యాసంగిలో ముందస్తుగా కోతలు నిర్వహించారు. దీంతో కరీంనగర్‌ మండలంలో పలు కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ధాన్యం కుప్పలు పోసి కాంటాల కోసం ఎదురు చూస్తున్నారు. మరి కొందరు దళారులను ఆశ్రయించి తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు. వ్యాపారులు నేరుగా రైతుల వద్దకే వచ్చి మద్దతు ధర కంటే తక్కువ కొనుగోలు చేస్తున్నారు. కొందరు కోతలు కోయగానే నేరుగా ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. క్వింటాల్‌కు 1900 రూపాయలకే అమ్ముకుని నష్టపోతున్నారు. పగలంతా నిప్పుల కొలిమిలా ఎండలు కొడుతుంటే రాత్రి వేళ వాతవారణం చల్లబడుతోంది, ఎప్పుడు వర్షం పడుతుందోననే భయం రైతులను వెంటాడుతోంది. కరీంనగర్‌ మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల చిరుజల్లులు కురవడంతో ఆందోళన చెందారు. ప్రస్తుతం మొగ్డుంపూర్‌, చెర్లబూత్కూర్‌, చేగుర్తి, చామనపల్లి, ఇరుక్లు, నగునూర్‌, ఎలబోతారం, గ్రామాల్లో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే పలు గ్రామాల్లోని కేంద్రాలన్ని దాన్యం కుప్పలతో నిండిపోయాయి. ఆకాల వర్షాల భయంతో పలువురు రైతులు పగలంతా ధాన్యాన్ని అరబెట్టి సాయంత్రం కాగానే టార్పాలిన్లు కప్పుకుంటున్నారు. కరీంనగర్‌ మండలంలో దుర్శేడ్‌ సింగిల్‌ విండో ఆధ్వర్యంలో ఐదు, కరీంనగర్‌ సింగిల్‌ విండో ఆధ్వర్యంలో ఎనిమిది, ఐకేపీ ఆధ్వర్యంలో ఏడు కేంద్రాలను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటి వరకు ఆయా కేంద్రాలకు సివిల్‌ సప్లయిస్‌ అధికారులు రైస్‌ మిల్లులు కేటాయించలేదు. దీంతో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడంలో నిర్వహకులు జాప్యం చేస్తున్నారు. వెంటనే కొనుగోలు కేద్రాలను ప్రారంభించాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు.

Updated Date - Apr 15 , 2025 | 11:44 PM