jagityaala : రుణ ప్రణాళిక ఖరారు
ABN , Publish Date - Mar 31 , 2025 | 01:01 AM
జగిత్యాల, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): జిల్లా వార్షిక రుణ ప్రణాళిక ఖరారైంది. ప్రతీ సంవత్సరం బ్యాంకుల ద్వారా రైతులు, ఇతర వర్గాల వారికి అందించేందుకు గాను నాబార్డు రుణ లక్ష్యాన్ని ఖరారు చేస్తుంది. దీన్ని బట్టి జిల్లాలోని వివిధ బ్యాంకులకు నిర్ధేశించి రుణాలను అందిస్తుంటారు.

-జిల్లాకు రూ.6,615 కోట్ల నిధులు కేటాయింపు
-అత్యధికంగా పంట యాజమాన్యం, మార్కెటింగ్‌కు..
ఫసూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగానికి రూ.996 కోట్లు
జగిత్యాల, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): జిల్లా వార్షిక రుణ ప్రణాళిక ఖరారైంది. ప్రతీ సంవత్సరం బ్యాంకుల ద్వారా రైతులు, ఇతర వర్గాల వారికి అందించేందుకు గాను నాబార్డు రుణ లక్ష్యాన్ని ఖరారు చేస్తుంది. దీన్ని బట్టి జిల్లాలోని వివిధ బ్యాంకులకు నిర్ధేశించి రుణాలను అందిస్తుంటారు. జిల్లా వ్యాప్తంగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.6,615 కోట్ల రుణాలను ఇవ్వాలని నాబార్డు ప్రకటించింది. దీనికి సంబంధించి కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా స్థాయి బ్యాంక్లర్ల కమిటీ సమావేశంలో బ్యాంకుల వారీగా నిర్దేశించారు.
ఫజిల్లాలో తగ్గిన రుణ లక్ష్యం
జిల్లా వ్యాప్తంగా వివిధ రంగాల్లో 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.6,615 కోట్లు రుణాలను అందించాలన్న లక్ష్యంతో అధికారులు ఉన్నారు. ఇందులో వివిధ విభాగాలకు అందించే లక్ష్యాన్ని నాబార్డు నిర్దేశించింది. వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలైన ఫుడ్ ప్రాసెసింగ్, ఇతర వ్యవసాయ అనుబంధ రుణాల కోసం లక్ష్యాన్ని నిర్దేశించారు. గత యేడాది కంటే ప్రస్తుతం రూ.732 కోట్లు తక్కువగా రుణ లక్ష్యాన్ని నాబార్డు నిర్ధేశించింది. ఈ రుణాల్లో కొత్త వాటితో పాటు రెన్యూవల్ రుణాలు కూడా ఉంటాయి. జిల్లా వ్యాప్తంగా ప్రాధాన్యత రంగాలకు అధిక మొత్తంలో రుణాలు, ప్రాధాన్యత లేని రంగాలకు తక్కువ మొత్తంలో కోట్లు రుణాలను ఇవ్వాలని నిర్ణయించారు. 2024-25 ఆర్థిక సంవత్సంరలో 7,347 కోట్లు రుణ లక్ష్యంగా ఉండగా 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ. 6,615 కోట్లు రుణ లక్ష్యంగా నిర్ణయించారు. జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్య తరమా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) రంగానికి ఈ యేడాది రూ. 996 కోట్లు రుణాలను ఇవ్వాలని నిర్ణయించారు. జిల్లాలో చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించేందుకు ఈ రుణాలను అందిస్తారు. గత యేడాది కంటే తక్కువగా ఎంఎస్‌ఎంఈ రుణాల కోసం సుమారు వంద కోట్లు తగ్గించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ రుణాలతో పాటు స్వయం సహాయక సంఘాల సభ్యులకు గ్రామీణ జీవనోపాధి పథకం కింద అందించే రుణాలు ఈ విభాగంలోకి వస్తాయి.
ఫ2025-26 ఆర్థిక సంవత్సరం ప్రణాళిక
2025-26 వార్షిక సంవత్సరానికి సంబంధించి వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలకు అత్యధికంగా రుణాలను ఇవ్వాలని నాబార్డు నిర్ణయించింది. ఇందులో పంట యాజమాన్యం, మార్కెటింగ్ రుణాల కోసం రూ.2,654.66 కోట్లు, నీటి వనరుల కల్పనకు రూ.78.77 కోట్లు, యాంత్రీకరణకు రూ.241.31 కోట్లు, ఉద్యాన శాఖకు రూ.143.31 కోట్లు, పాడి పరిశ్రమకు రూ.290.01 కోట్లు, కోళ్ల పెంపకానికి రూ.150.13 కోట్లు, జీవాలు, పందుల పెంపకానికి రూ.42.81 కోట్లు, చేపల పెంపకానికి రూ.48.20 కోట్లు, గోదాములు, కోల్డ్ స్టోరేజీలకు రూ.171.92 కోట్లు, భూముల అభివృద్ధికి రూ.19.20 కోట్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు రూ.75.22 కోట్లు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. వ్యవసాయ అభివృద్ధి, గోదాములు, కోల్డ్ స్టోరేజీ నిర్మాణం, విత్తనోత్పత్తి తదితర ప్లాంట్ల నిర్మాణాల కోసం ఈ యేడాది అధిక మొత్తంలో రుణాలను ఇవ్వాలని నిర్ణయించారు. ఇతర ప్రాధాన్యత రంగాల కింద విద్యకు రూ.40.62 కోట్లు, గృహాలకు రూ.144.77 కోట్లు, పునరుద్దరణీయ శక్తి, సామాజిక సదుపాయాల కల్పన కింద రూ. 52.81 కోట్లు, సంప్రదాయేత ఇందన వనరులకు రూ.33.08 కోట్లు రుణాలను అందిస్తారు. ఇతర వాటి కోసం రూ. 94.84 కోట్లు రుణాలను ఇవ్వాలని నాబార్డు నిర్ణయించింది.
పకడ్బందీగా రుణాల పంపిణీకి చర్యలు
-బీఎస్ లత, అదనపు కలెక్టర్
జిల్లా వ్యాప్తంగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ నిర్ధేశించిన వార్షిక రుణ ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. రుణాలను అందించడంలో నిర్లక్ష్యం చేయవద్దని బ్యాంకర్లను ఆదేశించాం. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ రుణ ప్రణాళికను లక్ష్యం మేరకు అమలు చేస్తాం.
బ్యాంకుల వారీగా లక్ష్యాన్ని నిర్దేశించాం
-రాము కుమార్, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్
జిల్లాలో బ్యాంకుల వారీగా రుణ లక్ష్యాన్ని నిర్దేశించాము. సంబంధిత బ్యాంకులకు కేటాయించిన రుణ లక్ష్యాన్ని సాధించేలా అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇప్పటికే బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేసి దిశా నిర్దేశం చేశాం. నాబార్డు నిర్ణయించిన లక్ష్యం మేరకు బ్యాంకులు రుణాలు ఇవ్వాల్సి ఉంటుంది.