ఉపాధిహామీలో పూడికతీత పనులు వద్దు
ABN , Publish Date - Feb 15 , 2025 | 12:05 AM
ఈ ఆర్థిక సంవత్సరానికి గాను ఉపాధి హామీ పథకం ద్వారా ఇచ్చిన పని దినాల లక్ష్యాన్ని పూర్తి చేసే దిశగా సంబంధిత అధికారులు కసరత్తు చేస్తున్నారు. వచ్చే మార్చి నెలాఖరు లోగా కూలీలకు ఇంకా 2 లక్షల 56 వేల పని దినాలను కల్పించాల్సి ఉంది. చెరువులు, కుంటల్లో, కాలువల్లో పూడికతీత పనులు గాకుండా రైతులకు ఉపయోగపడే పనులపై దృష్టి సారించాలని ఉన్నతాధికారులు జిల్లా అధికారులను ఆదేశించారు.

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
ఈ ఆర్థిక సంవత్సరానికి గాను ఉపాధి హామీ పథకం ద్వారా ఇచ్చిన పని దినాల లక్ష్యాన్ని పూర్తి చేసే దిశగా సంబంధిత అధికారులు కసరత్తు చేస్తున్నారు. వచ్చే మార్చి నెలాఖరు లోగా కూలీలకు ఇంకా 2 లక్షల 56 వేల పని దినాలను కల్పించాల్సి ఉంది. చెరువులు, కుంటల్లో, కాలువల్లో పూడికతీత పనులు గాకుండా రైతులకు ఉపయోగపడే పనులపై దృష్టి సారించాలని ఉన్నతాధికారులు జిల్లా అధికారులను ఆదేశించారు. పూడికతీత పనుల వల్ల పెద్దగా ఉపయోగం లేదని, యేటా పూడికతీత పనులు చేపడుతున్నా మళ్లీ మళ్లీ అవే పనులు చేయడం వల్ల ఇతరత్రా పనులు ముందుకు సాగడం లేదని ఉన్నతాధికారులు అభిప్రాయ పడుతున్నారు. ఇటీవల పంచాయతీ రాజ్ శాఖాధికారులు జిల్లా అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు సూచనలు చేశారు.
జిల్లాలో 1,19,000 కుటుంబాలకు ఉపాధి హామీ పథకం ద్వారా జాబ్ కార్డులను జారీ చేశారు. ఈ కార్డులపై 2,48,000 మంది కూలీలు ఉన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి జిల్లాకు ప్రభుత్వం 25 లక్షల 55 వేల పని దినాలను కేటాయించింది. యేటా అక్టోబర్, నవంబర్ నెలల్లో గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి ఉపాధిహామీ కూలీలకు పనులను గుర్తిస్తారు. ఆ మేరకు షెల్‌లో ఉంచి ఆ పనులను ఏప్రిల్ 1వ తేదీ నుంచి కల్పిస్తారు. జిల్లాలో ఇప్పటి వరకు ఉపాధి కూలీలకు 22 లక్షల 99 వేల పని దినాలను కల్పించారు. ఇంకా 2 లక్షల 56 పని దినాలను మార్చి నెలాఖరు వరకు పూర్తి చేయాలి. ఇప్పటి వరకు 81 కోట్ల 53 లక్షల 41 వేల రూపాయలను ప్రభుత్వం వెచ్చించింది. ఇం దులో కూలీలకు వేతనాల రూపేణా 52 కోట్ల 38 లక్షల 14 వేల రూపాయల విలువైన పనులు కల్పించారు. మెటేరియల్ కంపొనెంట్ కింద 24 కోట్ల 39 లక్షల 21 వేల రూపాయలు వెచ్చించారు. నిర్వహణ కింద 4 కోట్ల 76 లక్షల 6 రూపాయలు వెచ్చించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి ఇంకా 2 లక్షల 56 వేల పని దినాలు మిగిలి ఉన్నాయి. ఈ పని దినాలలో ఫామ్ ఫాండ్స్ తవ్వకాలు, పర్కొలేషన్ ట్యాంకుల నిర్మాణం, రైతులకు పొలం బాటలు, నర్సరీల్లో మొక్కల పెంపకానికి, ఎస్సీ, ఎస్టీలకు చెందిన భూముల అభివృద్ధి పనులు చేపట్టాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. మెటీరియల్ కంపొనెంట్ కింద క్యాటిల్ షెడ్లు, పౌలీ్ట్ర షెడ్లు, వర్మీ కంపొస్టు పిట్లు, చెక్ డ్యామ్‌లు, బోర్‌వెల్స్ రీచార్జ్ స్ట్రక్చర్లు, సోక్ పిట్లు, ఓపెన్ వెల్స్ బావుల తవ్వకాల పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. ప్రతి మండలానికి రెండు పశువుల దాణా యూనిట్స్‌ను ఆదర్శ రైతులచే ఏర్పాటు చేసేందుకు మండల వ్యవసాయ విస్తీర్ణాధికారులచే అవగాహన కల్పించాలని, మండలానికి ఒక ఒక పౌలీ్ట్ర షెడ్ నిర్మించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. ఉన్నతాధికారులు సూచించిన మేరకు ఉపాధి పనులు చేపట్టేందుకు అధికారులు దృష్టి సారించారు.