KCR: వర్సిటీలకు వందల ఎకరాలెందుకు?
ABN , Publish Date - Apr 03 , 2025 | 04:57 AM
భూవివాదంతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అట్టుడుకుతున్న వేళ.. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ గతంలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇదేం మహారాజుల కాలం కాదు
గతంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు
సోషల్ మీడియాలో వైరల్
హైదరాబాద్, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): భూవివాదంతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అట్టుడుకుతున్న వేళ.. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ గతంలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ వీడియోలో వర్సిటీలకు వందల ఎకరాలు ఎందుకంటూ ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘అవేమైనా రాజదర్బార్‌లా.. యూనివర్సిటీలకు వందల ఎకరాలు అవసరం లేదు. ఇదేం మహరాజుల కాలం కాదు. పట్టణప్రాంతాల్లో ఉన్న భూములను మరింత సమర్థవంతంగా వినియోగించుకోవాలి. పేదలకు ఇళ్లు, ఆస్పత్రులు కట్టించాల్సిన అవసరం ఉంది.
నేను గట్టి మనిషిని. అనుకున్నది సాధించే దాకా పోరాడి తీరుతా. నేనెవరికీ భయపడను. ఇటీవల హార్టికల్చర్ యూనివర్సిటీకి 500 ఎకరాలు కావాలని అడిగితే.. 50ఎకరాలు సరిపోతుంది అని ప్రధాని మోదీకే చెప్పా’’ అని ఆయన వ్యాఖ్యానించినట్టుగా ఆ వీడియోలో ఉంది. సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల పోరాటానికి బీఆర్‌ఎస్ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ఇటీవల కేటీఆర్ ప్రకటించిన రెండు రోజుల్లోనే సోషల్ మీడియాలో కేసీఆర్ వ్యాఖ్యలతో కూడిన వీడియో వైరల్ కావడం చర్చనీయాంశంగా మారింది.