ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - Apr 05 , 2025 | 11:34 PM
ఇసుక అక్రమ రవాణా విషయంలో రెవెన్యూ అధికారులపై పరుషపదజాలంతో దూషించిన ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధికారులు కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ జానకికి ఫిర్యాదు చేశారు.

- కలెక్టర్, ఎస్సీలకు రెవెన్యూ అసోసియేషన్ ఫిర్యాదు
మహబూబ్‌నగర్, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి) : ఇసుక అక్రమ రవాణా విషయంలో రెవెన్యూ అధికారులపై పరుషపదజాలంతో దూషించిన ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధికారులు కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ జానకికి ఫిర్యాదు చేశారు. మూసాపేట మండలం నిజాలపూర్‌లో ఉపాధి హామీ సీసీ రోడ్లకు అనుమతులకు మించి ఇసుక తరలిస్తుండటంతో అక్కడికెళ్లిన రికార్డ్ అసిస్టెంట్‌పై కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శెట్టి చంద్రశేఖర్ ఫోన్‌లో అతని దూషించడమే కాకుండా తహసీల్దార్‌పైనా అనుచిత వ్యాఖ్యలు చేశారు. నౌకరి చేయాలంటే చూసీ చూడనట్లు ఉండాలని, లేదంటే నీతోపాటు ఎమ్మార్వోను తంతానని బూతుపురాణం చేయడం, ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో రెవెన్యూ అసోసియేషన్ నాయకులు స్పందించారు. శనివారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌కు, ఎస్పీతోపాటు భూత్పూర్ సర్కిల్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. సీసీ రోడ్ల కోసం 10 ట్రాక్టర్ ట్రిప్పులను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు తరలించాలని తహసీల్దార్ అనుమతి ఇవ్వగా.. లెక్కకు మించి ఇసుక తరలిస్తుండటంతో అడిగిన అధికారులపై ఇష్టానుసారంగా నోరు పారేసుకోవడంతో అధికారులు స్పందించారు. రెవెన్యూ అసోసియేషన్ నాయకులు ఘాన్షీరాం, రాజీవ్‌రెడ్డి, చంద్రనాయక్, దేవేందర్, చంద్రాయుడు పాల్గొన్నారు.