Meenakshi Natarajan: పదవుల కోసం పైరవీలు వద్దు
ABN , Publish Date - Mar 05 , 2025 | 04:24 AM
కచ్చితంగా న్యాయం చేస్తాను’’ అని.. మెదక్, మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని కాంగ్రెస్ నేతలకు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ భరోసా ఇచ్చారు.

పని చేసేవారి వివరాలు తెప్పించుకుంటా
కష్టపడే వారికి న్యాయం జరుగుతుంది
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
పార్టీ అంశాలు బయట మాట్లాడితే వేటు
రాహుల్‌ను పీఎం చేసేందుకు కృషిచేయండి: మీనాక్షి నటరాజన్
హైదరాబాద్, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): ‘‘మీరు పదవుల కోసం పైరవీలు చేయాల్సిన అవసరం లేదు. పార్టీ కోసం కష్టపడుతున్న వారి వివరాలను నేనే స్వయంగా తెప్పించుకుంటాను. కచ్చితంగా న్యాయం చేస్తాను’’ అని.. మెదక్, మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని కాంగ్రెస్ నేతలకు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ భరోసా ఇచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. ముఖ్యంగా.. కులగణన ద్వారా అణగారిన కులాలకు జరిగే ప్రయోజనం, వర్గీకరణ అంశాలకు క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం కల్పించాలని పేర్కొన్నారు. పార్టీలో క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇస్తామని, పార్టీ అంతర్గత విషయాలను బయట మాట్లాడితే వేటు పడటం ఖాయమని హెచ్చరించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌గాంధీని ప్రధానిని చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గాంధీభవన్‌లో.. మెదక్, మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గ నేతలతో మంగళవారం ఆమె వేర్వేరుగా సమావేశమయ్యారు. మెదక్ నియోజకవర్గ సమీక్షలో మంత్రి దామోదర రాజనర్సింహ, ఇన్‌చార్జి మంత్రి కొండా సురేఖ, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి, పార్టీ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, ఇతర నాయకులు పాల్గొన్నారు. మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గ సమావేశంలో ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ రెండు సమావేశాల్లోనూ పార్టీ నేతలకు మీనాక్షి దిశానిర్దేశం చేశారు. సోషల్ మీడియా వేదికగా బీజేపీ, బీఆర్‌ఎస్‌ను విమర్శించాల్సిన నేతలు..
సొంతపార్టీ నేతలపైనే ఎక్కువగా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్టీలో ఏదైనా అన్యాయం జరిగినా, అంతర్గతంగా సమస్యలున్నా నేరుగా తనకు చెప్పాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లు ఎందుకు తగ్గాయంటూ పార్టీ నేతలను ఆమె ఆరా తీయగా.. బీఆర్‌ఎస్ ఓట్లు బీజేపీకి భారీగా బదిలీ అయ్యాయని, ఈ నేపథ్యంలోనే ఓట్లు తగ్గాయని రెండు నియోజకవర్గాల నేతలూ వివరించారు. కాగా.. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలు అందుతున్నా సరిగా అందట్లేదంటూ బీఆర్‌ఎస్ విష ప్రచారం చేస్తోందనే విషయాన్ని నేతలు ఆమె దృష్టికి తీసుకువచ్చారు. దీంతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా పని చేస్తూ బీజేపీ, బీఆర్‌ఎస్ విమర్శలను తిప్పి కొట్టాలని మీనాక్షిసూచించారు. నియోజకవర్గాల ఇన్‌చార్జులు బాధ్యతతో పని చేయాలని.. వారి వల్ల సమస్యలు వస్తే వారిని తొలగిస్తామని స్పష్టంచేశారు. పటాన్‌చెరు నియోజకవర్గ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తమను ఇబ్బంది పెడుతున్నారంటూ స్థానిక నేత కాట శ్రీనివా్‌సగౌడ్ ఫిర్యాదు చేశారు. సమస్య పరిష్కారం కోసం వేసిక కమిటీ ఇంతవరకూ నివేదిక ఇవ్వలేదని తెలిపి.. వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. దీనికి ఆమె.. పాత, కొత్త నేతల సమస్యలు ఉన్న చోట్ల సమన్వయ కమిటీలు వేసుకుని పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ సమావేశాల్లో పాల్గొన్న మహేశ్‌కుమార్ గౌడ్.. పార్టీలో కొత్త, పాత నేతలు ఐక్యతతో ముందుకు సాగాలని, అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచన చేశారు. పార్టీ ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండాలని.. మండల కమిటీల పనితీరుపైన పునః సమీక్ష చేసుకోవాలని సూచించారు. కాగా.. మీనాక్షి నటరాజన్ బుధవారం గాంధీభవన్‌లో పార్టీ అనుబంధ సంఘాల చైర్మన్లతో భేటీ కానున్నారు. అనంతరం ఆదిలాబాద్, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గాల నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.