Piyush Goyal : పసుపు బోర్డుతో కలిగే లాభాలు చెప్పిన కేంద్రమంత్రి
ABN, Publish Date - Jan 14 , 2025 | 12:19 PM
Union Minister Piyush Goyal: ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణకు పసుపు బోర్డు ఇస్తానని చెప్పారని.. ఆహామీని నిలబెట్టుకున్నారని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. మోదీ ఏదైనా చెప్పారంటే అది నెరవేరి తీరుతుందని చెప్పారు.ఎంపీ ధర్మపురి అరవింద్, కేంద్రమంత్రి బండి సంజయ్ కోరిక మేరకు సంక్రాంతి రోజున ప్రారంభిస్తున్నామని అన్నారు. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, మేఘాలయ సహా 20 రాష్ట్రాల్లో పసుపు పంట పండించే రైతుల కోసం ప్రధాని మోదీ ఒక బహుమతిగా ఈ నిర్ణయం తీసుకున్నారని ఉద్ఘాటించారు.
నిజామాబాద్: నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డును ఇవాళ(మంగళవారం) కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్, ఎంపీ అర్వింద్ పాల్గొన్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను శాలువా, పసుపు కొమ్ముల దండతో ఎంపీ అరవింద్ సత్కరించారు. సంక్రాంతి రోజు పసుపు రైతుల కలను నెరవేర్చిన నరేంద్ర మోదీకి పాదాభివందనం చేస్తున్నానని ఎంపీ అరవింద్ అన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. నిన్న(సోమవారం) పసుపు బోర్డు చైర్మన్‌గా పల్లె గంగారెడ్డిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. మూడేళ్ల పాటు పసుపు బోర్డు చైర్మన్‌గా పల్లె గంగారెడ్డి ఉండనున్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ ఎమ్మెల్యేలు రాకేష్‌రెడ్డి, ధన్‌పాల్ సూర్యనారాయణ, పసుపు రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర సహా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వివిధ పేర్లతో సంక్రాంతి జరుపుకుంటున్నప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
పసుపును బంగారంతో పోల్చుతాం..
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఎంపీ ధర్మపురి అరవింద్, కేంద్రమంత్రి బండి సంజయ్ కోరిక మేరకు సంక్రాంతి రోజున పసుపు బోర్డు ప్రారంభిస్తున్నామని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, మేఘాలయ సహా 20 రాష్ట్రాల్లో పసుపు పంట పండించే రైతుల కోసం ప్రధాని మోదీ ఒక బహుమతిగా ఈ నిర్ణయం తీసుకున్నారని ఉద్ఘాటించారు. మోదీ ఏదైనా చెప్పారంటే అది నెరవేరితీరుతుందని అన్నారు. కాశ్మీర్‌లో టన్నెల్ అయినా, రైతులకు ఇచ్చే సంక్షేమ, అభివృద్ధి పథకాలైనా, స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సహకలైనా ఏదైనా సరే.. మాట ఇచ్చారంటే అమలు చేసి తీరుతారని ప్రశంసించారు. ప్రపంచంలోని 19 దేశాలు ప్రధాని మోదీని సర్వోన్నత పౌరపురస్కారాలతో సత్కరించాయని.. ఇది మామూలు విషయం కాదని గుర్తుచేశారు.పసుపు పంటను వ్యవసాయంలో బంగారంతో పోల్చుతామని... అలాంటి పంట సాగు కోసం ఈ బోర్డు ఎంతో ఉపయోగరంగా ఉంటుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.
తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో వెరైటీ పసుపు పంట
గత ఏడాది 3 లక్షల హెక్టార్లలో పంట సాగు చేసి 11 లక్షల టన్నుల పసుపు పంట ఉత్పత్తి చేశారని అన్నారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో వెరైటీ పసుపు పంట సాగు చేస్తున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా 30 వెరైటీలు సాగు చేస్తున్నారని.. వాటికి GI Tag కూడా ఉందని తెలిపారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ముఖ్యమైన వెరైటీ పంట పెద్ద మొత్తంలో సాగు అవుతుందని... అందుకే బోర్డు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. అరవింద్, బండి సంజయ్ ఈ బోర్డు కోసం తీవ్రంగా ప్రయత్నం చేసి సాధించారని అన్నారు.కొత్త వంగడాలపై పరిశోధనలు, పసుపు పంటకు వాల్యూ ఎడిషన్ చేసి ఎగుమతులు చేస్తామని తెలిపారు. అలాగే పసుపు ఉపయోగాలపై కూడా ప్రచారం చేయడం జరుగుతుందని అన్నారు. పంట దిగుబడి పెంచడం, సప్లై చైన్, మౌలిక వసతులు పెంపొందించడం, ఔషధ గుణాల నేపథ్యంలో ఫార్మా రంగంలో దీన్ని ఉపయోగించడం సహా అనేక అంశాల్లో రైతులకు బోర్డు నుంచి మద్దతు లభిస్తుందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు.
పసుపు బోర్డు ఏర్పాటుతో రైతులకు మెరుగైన ధర: ఎంపీ ధర్మపురి అరవింద్
పసుపు బోర్డు ఏర్పాటుతో తన హామీ ఇంకా పూర్తి కాలేదని.. నిజామాబాద్ జిల్లాకు చాలా వస్తాయని... ఎన్నో పనులు చేస్తామని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. సంక్రాంతి రోజున లక్షలాది మంది పసుపు రైతుల కల నెరవేర్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి పాదాభివందనాలు తెలిపారు. పసుపు బోర్డు ఏర్పాటు కేవలం రైతులకు మాత్రమే కాదు, జిల్లా మొత్తానికి పర్యాటకంగా కూడా ఉపయోగపడుతుందని తెలిపారు. పసుపు బోర్డు ఏర్పాటు వల్ల రైతులకు మెరుగైన ధర లభిస్తుందని అన్నారు. ఎగుమతులకు, స్టోరేజ్, మార్కెటింగ్, ప్రాసెసింగ్, రీసెర్చ్ సహా అనేక రకాలుగా ఉపయోగపడుతుందని ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు.
పసుపు బోర్డు కోసం ఎంపీ అరవింద్ ఎంతో కష్టపడ్డారు: కేంద్రమంత్రి బండి సంజయ్
తెలుగు ప్రజలకు కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. నిజామాబాద్, కరీంనగర్ ప్రజలకు గొప్ప శుభవార్త అందించిన ప్రధాని మోదీకి శుభాకాంక్షలు చెప్పారు. పసుపు బోర్డు ఏర్పాటుకు సహకరించిన పీయూష్ గోయల్, ఎంపీ అరవింద్‌కి శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీ ధర్మపురి అరవింద్ మొండివారు ...అనుక్షణం పసుపు బోర్డు గురించి మాట్లాడేవారని అన్నారు. ఎన్నికల ముందు ధర్మపురి అరవింద్ పసుపు బోర్డు ఏర్పాటుపై హామీ ఇచ్చారని గుర్తుచేశారు. పసుపు బోర్డు కోసం ఎంపీ అరవింద్ ఎంతో కష్టపడ్డారని అన్నారు. ధర్మపురి అరవింద్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి మోదీ కట్టుబడి ఉన్నారనే దానికి నిదర్శనం పసుపు బోర్డు అనికేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ఉద్ఘాటించారు.
పసుపు రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటా: పల్లె గంగారెడ్డి
పసుపు బోర్డు విషయంలో రైతాంగాన్ని చాలా రకాలుగా గత ప్రభుత్వాలు మోసం చేశాయని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి అన్నారు. 2019లో పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అరవింద్ ఇచ్చిన మాట ప్రకారం పసుపు బోర్డు సాధించారని గుర్తుచేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన మాట ప్రకారం పసుపు బోర్డు ప్రకటించారని అన్నారు. పసుపు బోర్డు విషయంలో ఎన్నో రాష్ట్రాలు పోటీ పడ్డాయని చెప్పారు. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటుకు ఎంపీ అరవింద్ కృషి మరువలేనిదని ప్రశంసించారు. జాతీయ పసుపు బోర్డు చైర్మన్‌గా తనను నియమించడల్లో ఎంపీ అరవింద్ కృషి ప్రత్యేకమైనదని చెప్పారు. చైర్మన్‌గా తాను జిల్లా పసుపు రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని పల్లె గంగారెడ్డి హామీ ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి
Kaushik Reddy: కౌశిక్ రెడ్డికి బెయిల్
Harish Rao: కేటీఆర్, హరీష్‌రావును చుట్టుముట్టిన పోలీసులు.. అసలు కారణమిదే
Karimnagar: కౌశిక్‌రెడ్డి అరెస్ట్!
Harish Rao: రైతులు, కూలీలకు కాంగ్రెస్ కుచ్చుటోపీ!
Read Latest Telangana News and Telugu News
Updated Date - Jan 14 , 2025 | 02:14 PM