Pawan Kalyan: అకీరా పుట్టిన రోజు నాడే.. ఇలా జరగడం బాధాకరం: పవన్
ABN , Publish Date - Apr 09 , 2025 | 05:30 AM
తన పెద్ద కుమారుడు అకీరా పుట్టినరోజు నాడే.. చిన్న కుమారుడు అగ్నిప్రమాదంలో గాయపడడం చాలా బాధాకరమని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.

హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): తన పెద్ద కుమారుడు అకీరా పుట్టినరోజు నాడే.. చిన్న కుమారుడు అగ్నిప్రమాదంలో గాయపడడం చాలా బాధాకరమని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. అగ్నిప్రమాదంలో తన చిన్న కుమారుడు మార్క్ శంకర్‌కు గాయాలైన ఘటనపై మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లోని తన నివాసం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రమాద విషయం తెలిసినప్పుడు ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నానని, వెంటనే సింగపూర్‌లోని భారత హైకమిషన్‌తో మాట్లాడానని, వారు అక్కడ ఏం జరిగిందో తెలుసుకుని చెప్పడంతోపాటు, అవసరమైన సహకారం అందిస్తామని చెప్పారని తెలిపారు. ‘అరకు గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణ కార్యక్రమంలో ఉండగా.. ఉదయం మార్క్ శంకర్‌కు అగ్నిప్రమాదంలో కాళ్లు, చేతులకు గాయాలయ్యాయని ఫోన్ వచ్చింది. బాబును ఆసుపత్రిలో చేర్పించి బ్రాంకోస్కోపి చేస్తున్నారు. ఈ సమ్మర్ క్యాంప్‌లో సుమారు 30 మంది చిన్నారులు ఉన్నారు.
ఈ ప్రమాదంలో ఒక చిన్నారి మృతిచెందడం బాధించింది. మార్క్ శంకర్ పక్కనే కూర్చున్న చిన్నారి శరీరం కాలిపోయింది. మా బాబు చేతికి, కాలికి గాయాలయ్యాయి. ఊపిరితిత్తులోకి బాగా పొగవెళ్లింది. ఆరోగ్యానికి పెద్ద ప్రమాదమేమి లేకపోయినా.. ఊపిరితిత్తుల్లో పొగ నిండుకోవడం వల్ల దీర్ఘకాలంలో ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశముందని డాక్టర్లు అంటున్నారు. మా బాబు వయసు ఏడేళ్లు. ఈ ఘటనపై ప్రధాని మోదీ ఫోన్ చేసి పరిస్థితి గురించి వాకాబు చేశారు. సింగపూర్, భారత హై కమిషనర్లతో మాట్లాడి వివరాలు తెలియజేసినందుకు ప్రధానికి ధన్యవాదాలు. మీటింగ్‌లో ఉండగానే సీఎం చంద్రబాబు ఫోన్ చేసి వివరాలు అడిగారు. మంత్రులు నారా లోకేశ్, అనితలు కూడా ఫోన్ చేసి అడిగారు’ అని చెప్పారు. మార్క్ శంకర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని పవన్ కల్యాణ్ తెలిపారు. తన కుమారుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్న ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.