Ponguleti: అర కిలో కోత పెట్టినా మిల్లర్లు జైలుకే..

ABN, Publish Date - Apr 05 , 2025 | 04:26 AM

రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యంలో తరుగు పేరుతో అర కిలో తీసినా ఆ మిల్లర్లను నేరుగా జైలుకు పంపిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు.

Ponguleti: అర కిలో కోత పెట్టినా మిల్లర్లు జైలుకే..
  • ధాన్యంలో తరుగు పేరిట రైతులను ఇబ్బంది పెడితే చర్యలు

  • శ్రీరామనవమి తర్వాత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం: పొంగులేటి

నేలకొండపల్లి, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యంలో తరుగు పేరుతో అర కిలో తీసినా ఆ మిల్లర్లను నేరుగా జైలుకు పంపిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. రైతుల పట్ల అలసత్వం, నిర్లక్ష్యం వహించే అధికారులను ఉపేక్షించబోమన్నారు. ఖమ్మం జిల్లాలోని బోదులబండలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం అక్కడ సభలో ఆయన మాట్లాడుతూ.. రైతులను తరుగు పేరిట ఇబ్బందులు పెట్టే మిల్లర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.


రైతును రాజును చేయాలన్న లక్ష్యంతో రేవంత్‌రెడ్డి సర్కారు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. గత ప్రభుత్వాన్ని నడిపిన పెద్ద మనిషి రూ.7.19లక్షల కోట్ల అప్పులు చేసి పోయాడని, ఆయన చేసిన అప్పులు తీర్చుకుంటూ ఎన్నికల హామీలను అమలు చేస్తూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. శ్రీరామనవమి తర్వాత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తామని తెలిపారు. అనంతరం కట్టుకాచారంలో రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు, అనంతనగర్‌లో రూ.2 కోట్లతో నిర్మిస్తున్న 33/11కేవీ విద్యుత్తు సబ్‌-స్టేషన్‌ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు.

Updated Date - Apr 05 , 2025 | 04:26 AM