Share News

Ponguleti: భూ భారతి.. క్షేత్ర స్థాయి సమస్యలపై మేధోమథనం

ABN , Publish Date - Feb 20 , 2025 | 03:50 AM

భూ భారతి నిబంధనల రూపకల్పనలో భాగంగా మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ కార్యాలయంలో జరిగిన వర్క్‌షా్‌పలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అధికారులకు దిశానిర్ధేశం చేశారు.

Ponguleti: భూ భారతి.. క్షేత్ర స్థాయి సమస్యలపై మేధోమథనం

  • సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారంపై సుదీర్ఘ చర్చ

  • క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులపై ఆరా

  • త్వరగా చట్టాన్ని అమల్లోకి తేవాలన్న మంత్రి పొంగులేటి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): భూ భారతి నిబంధనల రూపకల్పనలో భాగంగా మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ కార్యాలయంలో జరిగిన వర్క్‌షా్‌పలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అధికారులకు దిశానిర్ధేశం చేశారు. కొత్త చట్టం విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని నిబంధనలు రూపొందించాలని సూచించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయి సిబ్బందితోపాటు కలెక్టర్లు పలు సందేహాలను లేవనెత్తారు. సాదాబైనామా, భూధార్‌ కార్డుల జారీ, సర్వే మ్యాపింగ్‌, గ్రామ స్థాయి రికార్డులు, హక్కుల రికార్డులో తప్పులు, చేరికలు వంటి సవరణలకు ఎవరిని బాధ్యులను చేయాలనే అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.


వీలైనంత త్వరగా అమల్లోకి

వీలైనంత త్వరగా భూభారతి చట్టాన్ని అమల్లోకి తెస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. తెలంగాణలో భూమికి సంబంధించి అనేక సమస్యలు ఉన్నా గత ప్రభుత్వ నిర్వాకం వల్ల సరైన పరిష్కారం దొరకలేదన్నారు. ధరణి వల్ల రైతులు తమ భూములు కోల్పోయే పరిస్థితి తలెత్తిందన్నారు. తొందరపాటు నిర్ణయాలతో రెవెన్యూ వ్యవస్థ భ్రష్టుపట్టిపోయిందని, సామాన్యులకు రెవెన్యూ సేవలు దూరమయ్యాయని చెప్పారు. ఈ సమస్యలన్నింటికీ భూ భారతి పరిష్కారం చూపుతుందన్నారు. సమావేశంలో రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్‌ మిత్తల్‌, భూ చట్టాల నిపుణుడు భూమి సునిల్‌, సీఎంఆర్‌వో మకరంద్‌, పలు జిల్లాల కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Feb 20 , 2025 | 03:50 AM