Share News

Group-1 : గ్రూప్‌-1కు మార్గం సుగమం!

ABN , Publish Date - Feb 04 , 2025 | 04:44 AM

తెలంగాణ గ్రూప్‌-1 ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త! తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 29ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జీవో 29ని రద్దు చేయాలని కోరుతూ బి.శృతి, పి.రాంబాబుతోపాటు మరికొందరు గత నెల 22న సుప్రీంకోర్టులో రెండు వేర్వేరు స్పెషల్‌ లీవ్‌

Group-1 : గ్రూప్‌-1కు మార్గం సుగమం!

జీవో 29 రద్దు చేయాలన్న పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీం

గతంలోనూ రిట్‌ పిటిషన్‌ను తిరస్కరించిన న్యాయస్థానం

తెలంగాణలో గ్రూప్‌-1 ఫలితాలకు లైన్‌ క్లియర్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ గ్రూప్‌-1 ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త! తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 29ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జీవో 29ని రద్దు చేయాలని కోరుతూ బి.శృతి, పి.రాంబాబుతోపాటు మరికొందరు గత నెల 22న సుప్రీంకోర్టులో రెండు వేర్వేరు స్పెషల్‌ లీవ్‌ పిటిషన్లు దాఖలు చేశారు. ఆ పిటిషన్లు సోమవారం జస్టిస్‌ పమిడిఘంటం శ్రీనరసింహ, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చాయి. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది ఆదిత్య సోంది, మోహిత్‌ రావు వాదనలు వినిపిస్తూ.. జీవో 29తో వేలాది మంది విద్యార్థులకు నష్టం వాటిల్లే ప్రమాదముందని, దాన్ని రద్దు చేసి.. గ్రూప్‌-1 పరీక్షలను మరోసారి నిర్వహించాలని కోరారు. అయితే, గ్రూప్‌-1 పరీక్షలు పూర్తయ్యాయని, ఫలితాలు ప్రకటించేందుకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినందున ఆ విషయంలో కలగజేసుకోవడం సరికాదన్న ధర్మాసనం.. పిటిషన్‌ను కొట్టివేసింది. అయితే, గ్రూప్‌-1 పరీక్షలను వాయిదా వేయాలని, జీవో 29ని రద్దు చేయాలంటూ గతంలోనూ రాంబాబు సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. గ్రూప్‌-1 పరీక్షలో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అనుసరించడం లేదని ఆరోపించారు. ఆ పిటిషన్‌ను అప్పటి సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించింది. స్వయంప్రతిపత్తి కలిగిన పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను పరీక్షలు వాయిదా వేయాలని ఎలా ఆదేశించగలమని అప్పటి సీజీఐ ప్రశ్నించారు. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం కుదరదని చెబుతూ రిట్‌ పిటిషన్‌ను కొట్టేశారు. మొత్తం మీద సుప్రీంకోర్టులో దాఖలైన రెండు పిటిషన్లను కొట్టివేయడంతో తెలంగాణలో గ్రూప్‌-1 ఫలితాలకు మార్గం సుగమమైంది.


ఇవీ చదవండి:

కెరీర్‌లో కొట్టిన సిక్సులు.. ఒకే మ్యాచ్‌లో బాదేశాడు

ఒక్క ఇన్నింగ్స్‌తో 8 క్రేజీ రికార్డులు.. అభిషేక్ అన్నింటా అసాధ్యుడే

అతడి కోసమే ఈ ఊచకోత.. సీక్రెట్ బయటపెట్టిన అభిషేక్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 04 , 2025 | 04:44 AM