Share News

Telangana Drinking Water Crisis: తాగునీటి కోసం కర్ణాటకకు అధికారులు

ABN , Publish Date - Apr 16 , 2025 | 04:24 AM

జూరాల ప్రాజెక్టు నుంచి తాగునీటి కోసం కర్ణాటకను కోరేందుకు తెలంగాణ అధికారులు త్వరలో వెళ్లనున్నారు.జూన్‌లో తాగునీటి అవసరాల నిమిత్తం ముందుగానే నీటి విడుదలకు చర్యలు తీసుకుంటున్నారు.

Telangana Drinking Water Crisis: తాగునీటి కోసం కర్ణాటకకు అధికారులు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): జూరాల ప్రాజెక్టు కింద జూన్‌ నెలలో తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేయాలని కోరేందుకు త్వరలో నీటిపారుదలశాఖ అధికారులు కర్ణాటకకు వెళ్లనున్నారు. జూరాల ప్రాజెక్టుకు నీటి విషయమై కర్ణాటక యంత్రాంగాన్ని కలవాలన్న సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో ఆ రాష్ట్ర పర్యటన కోసం నీటిపారుదలశాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో ఒక్క జూరాలలోనే నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం రిజర్వాయర్‌లో 2.88 టీఎంసీల నీటి నిల్వ ఉంది. అయితే ప్రతినెలా ఈ ప్రాజెక్టు కింద తాగునీటి అవసరాల కోసం 0.11 టీఎంసీల నీరు అవసరం. దాంతో రానున్న 50 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నప్పటికీ ముందు జాగ్రత్తగా మరికొన్ని నీళ్లను అడగాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆల్మట్టిలో 29.90 టీఎంసీల నీటి నిల్వ ఉండగా, నారాయణపూర్‌లో 23.25 టీఎంసీల నీటి నిల్వ ఉంది. అయితే నారాయణపూర్‌ రిజర్వాయర్‌ నుంచి తాగునీటి అవసరాల కోసం ఒక టీఎంసీ నీటిని విడుదల చేస్తే జూరాలకు చేరేసరికి 0.70 టీఎంసీలు మిగలనున్నాయి. దాంతో ఒక టీఎంసీ దాకా నీటిని కర్ణాటక నుంచి కోరడానికి వీలుగా అధికారులు త్వరలోనే వెళ్లే అవకాశాలున్నాయి.



For AndhraPradesh News And Telugu News

Updated Date - Apr 16 , 2025 | 04:25 AM