Telangana Police: మన పోలీస్ దేశంలోనే నెంబర్ 1
ABN , Publish Date - Apr 16 , 2025 | 05:22 AM
తెలంగాణ రాష్ట్రం దేశంలో అత్యుత్తమ పోలీస్ వ్యవస్థగా నిలిచింది. న్యాయవ్యవస్థలో రెండో స్థానం, మొత్తం న్యాయ సంబంధిత సేవలలో దేశంలో మూడో స్థానం సాధించింది

ఉత్తమ న్యాయవ్యవస్థల్లో రెండో స్థానం రాష్ట్రానిదే
మొత్తంగా దక్షిణాది రాష్ట్రాల్లోనే..సమర్థవంతమైన పోలీసు, న్యాయవ్యవస్థలు
తొలి ఐదు స్థానాలు ఈ రాష్ట్రాలకే..
కర్ణాటక నెంబర్ వన్.. తర్వాతి ర్యాంకుల్లో ఏపీ, తెలంగాణ, కేరళ, తమిళనాడు
18 రాష్ట్రాలలో అట్టడుగున బెంగాల్
‘ఇండియా జస్టిస్ రిపోర్ట్- 2025’ వెల్లడి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): దేశంలోనే సమర్థవంతమైన పోలీస్ వ్యవస్థగా తెలంగాణ పోలీస్ విభాగం నిలిచింది. అదే సమయంలో సమర్థవంతమైన న్యాయవ్యవస్థలకు సంబంధించి దేశంలోనే రెండో స్థానం సాధించింది. ఈ రెండింటితోపాటు న్యాయ సహాయం, జైళ్ల నిర్వహణ కూడా కలిపి చూస్తే జాతీయ స్థాయిలో తెలంగాణ మూడో స్థానంలో నిలవడం గమనార్హం. పోలీస్ వ్యవస్థ సామర్థ్యం అంశంలో ఏపీ, కర్ణాటక రెండో, మూడో స్థానాల్లో నిలిచాయి. మొత్తంగా పోలీసు, న్యాయవ్యవస్థలు దక్షిణాది రాష్ట్రాల్లోనే మెరుగ్గా ఉన్నాయని వెల్లడైంది. కర్ణాటక అగ్రస్థానంలో నిలవగా తర్వాతి స్థానాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు ఉన్నాయి. ‘ఇండియా జస్టిస్ రిపోర్ట్-2025’ నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. పోలీసు, న్యాయవ్యవస్థ, న్యాయ సహాయం, జైళ్ల నిర్వహణ అనే నాలుగు అంశాల పరంగా దేశంలోని 18 పెద్ద, మధ్యస్థాయి రాష్ట్రాల పరిస్థితిని అధ్యయనం చేసి ఈ నివేదికను రూపొందించారు. మొత్తం 10 పాయింట్లకుగాను 6.78 స్కోరుతో కర్ణాటక టాప్‌లో నిలవగా, 3.63 స్కోరుతో పశ్చిమ బెంగాల్ అట్టడుగున నిలిచింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, రాజస్థాన్ రాష్ట్రాలు బెంగాల్ కంటే కాస్త ముందు నిలిచాయి. గతేడాది 11వ స్థానంలో నిలిచిన తెలంగాణ ఈసారి మూడోస్థానానికి.. ఐదో స్థానంలో ఉన్న ఏపీ రెండో స్థానానికి చేరుకోవటం విశేషం.
లక్ష జనాభాకు 155 మంది పోలీసులు
దేశవ్యాప్తంగా ప్రతి లక్ష జనాభాకు సగటున 197.5 మంది పోలీసులు ఉండాల్సి ఉండగా.. ప్రస్తుతం 155 మంది మాత్రమే ఉన్నారు. లక్ష జనాభాకు కేవలం 81 మంది పోలీసులతో బిహార్ ఆఖరు స్థానంలో ఉంది. అయితే, గతంతో పోలిస్తే 2022-25 మధ్యకాలంలో ఆ రాష్ట్రం పరిస్థితి మెరుగుపడటం గమనార్హం. ఇదే మూడేళ్ల కాలవ్యవధిలో న్యాయవ్యవస్థ పరంగా రాజస్థాన్, కేరళ, మధ్యప్రదేశ్ అత్యంత మెరుగైన ఫలితాలు సాధించాయి. జైళ్ల నిర్వహణలో ఒడిశా, జార్ఖండ్ ఇతర రాష్ట్రాలకన్నా ముందున్నాయి. గత పదేళ్లలో జైళ్లలో ఖైదీల సంఖ్య దాదాపు 50 శాతం పెరిగింది. వీరిలో అత్యధికులు అండర్ ట్రయల్సే (దర్యాప్తు లేదా విచారణ పూర్తికాని కేసులకు సంబంధించిన నిందితులు). పదేళ్లలో జైళ్లలో వీరి వాటా 66 నుంచి 78 శాతానికి పెరిగింది. ప్రజలకు న్యాయ సహాయం పరంగా హరియాణా అన్ని రాష్ట్రాల్లోకి మెరుగైన పనితీరు చూపింది. పోలీసు, న్యాయవ్యవస్థకు బడ్జెట్‌లో కేటాయిస్తున్న నిధుల్లో అత్యధికభాగం సిబ్బంది జీతభత్యాలకే వెళ్తోంది. మౌలిక సదుపాయాల కల్పన, సిబ్బందికి శిక్షణ వంటి కార్యకలాపాలకు అరకొర నిధులు మాత్రమే మిగులుతున్నాయి. దీనివల్ల పోలీసు, న్యాయసేవలపై ప్రతికూల ప్రభావం పడుతోందని నివేదిక పేర్కొంది.
రాష్ట్రంలో న్యాయ, పోలీసు వ్యవస్థల తీరిదీ..
తెలంగాణలోని కింది కోర్టులలో 81 మంది ఎస్సీ, 119 మంది ఎస్టీ, 123 ఓబీసీ న్యాయమూర్తులు ఉన్నారని నివేదిక పేర్కొంది. తెలంగాణలో హైకోర్టులో 28.6శాతం, కింది కోర్టుల్లో 20.5ు ఖాళీలు ఉన్నట్టు తెలిపింది.
తెలంగాణలో 20 ఏళ్లకుపైగా పెండింగ్‌లో ఉన్న కేసులు 17.7 శాతం, 10-20 ఏళ్ల మధ్యవి 32.6శాతం ఉన్నాయని పేర్కొంది.
తెలంగాణలో పోలీస్ సిబ్బందిలో 8.7 శాతం, జైలు సిబ్బందిలో 6.6 శాతం మహిళలు ఉన్నారని నివేదిక తెలిపింది. మహిళా న్యాయమూర్తులు కింది కోర్టులలో 55.3 శాతం, హైకోర్టులో 33.3 శాతం ఉన్నారని పేర్కొంది.
తెలంగాణలో పట్టణాలలో 51,974 మందికి, గ్రామాలలో 50,373 మందికి ఒక పోలీ్‌సస్టేషన్ ఉన్నాయని వెల్లడించింది.