Share News

HyderabadP: హెచ్‌సీయూలో లాఠీచార్జి!

ABN , Publish Date - Apr 03 , 2025 | 04:53 AM

బుధవారం ఉదయం వర్సిటీలోని అంబేడ్కర్‌ ఆడిటోరియం నుంచి ప్రభుత్వం చదును చేస్తున్న 400 ఎకరాల కంచ భూముల వైపు విద్యార్థులు, ప్రొఫెసర్లు ర్యాలీ తీస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.

HyderabadP: హెచ్‌సీయూలో లాఠీచార్జి!

  • విద్యార్థులు, ప్రొఫెసర్లపై లాఠీ ఝుళిపించిన పోలీసులు

  • 30 మందికి గాయాలు

  • వేలం నిర్ణయాన్ని రద్దు చేయాలి

  • లేకుంటే ఆందోళన ఉధృతం

  • విద్యార్థి సంఘాల హెచ్చరిక

హైదరాబాద్‌ సిటీ/ఖైరతాబాద్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ)లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వర్సిటీ భూములను కాపాడుకునేందుకు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఐదు రోజులుగా చేస్తున్న ఆందోళనలకు ప్రొఫెసర్లు కూడా మద్దతు తెలపడంతో ఉద్యమం ఉధృతరూపం దాల్చింది. బుధవారం ఉదయం వర్సిటీలోని అంబేడ్కర్‌ ఆడిటోరియం నుంచి ప్రభుత్వం చదును చేస్తున్న 400 ఎకరాల కంచ భూముల వైపు విద్యార్థులు, ప్రొఫెసర్లు ర్యాలీ తీస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. వందల సంఖ్యలో చేరుకున్న విద్యార్థులు ఒక్కసారిగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా, నిలువరించలేకపోయిన పోలీసులు లాఠీచార్జి చేశారు. సుమారు 30 మంది గాయపడగా, వారిని వర్సిటీ ఆస్పత్రికి తరలించారు. పోలీసుల నిర్బంధం, లాఠీచార్జిని డ్రోన్లతో చిత్రీకరించిన ఆరుగురు విద్యార్థులను అరెస్టు చేశారు. విద్యార్థులపై లాఠీచార్జిని ఎస్‌ఎ్‌ఫఐ, ఏఐఎ్‌సఎఫ్‌, బీజేవైఎం, బీఎ్‌సఎ్‌ఫఐ తదితర విద్యార్థి సంఘాలతోపాటు హెచ్‌సీయూ అచార్యుల సంఘం కూడా తీవ్రంగా ఖండించింది. మరోవైపు సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థులు చేస్తున్న ఉద్యమానికి ప్రముఖ సినీనటులు, రాజకీయ ప్రముఖులు మద్దతు తెలిపారు.


వర్సిటీ లోపల, వెలుపల సుమారు 300 మందికి పైగా పోలీసులను మోహరించారు. లోపల ఉన్న పోలీసులు విద్యార్థులను బయటకు రాకుండా అడ్డుకోగా, గేటు బయట పోలీసులు బారికేడ్లతో మీడియా, రాజకీయ పార్టీల నేతలను లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. విద్యార్థుల సంఖ్య భారీగా ఉండడంతో పోలీసులు వాటర్‌ క్యానన్‌లను కూడా ఏర్పాటు చేసుకున్నారు. శాంతియుతంగా ఉద్యమిస్తున్న విద్యార్థులను అడ్డుకునేందుకు పోలీసులను మోహరించడం దారుణమని విద్యార్థి సంఘాలు ఆక్షేపిస్తున్నాయి. అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని పణంగా పెట్టడం సరికాదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు భూమి ఎంత ముఖ్యమో విద్యా సంస్థలకు కూడా అంతే ముఖ్యమని చెప్పారు. అభివృద్ధికి, విద్యకు, ప్రకృతికి మధ్య వైరుధ్యం ఏర్పడినపుడు కచ్చితంగా ప్రకృతి ముందు అభివృద్ధి తలవ ంచాల్సిందేనని తెలిపారు. హెచ్‌సీయూ విద్యా సంస్థ మాత్రమే కాదని, జీవ వైవిధ్యానికి ప్రతీక అని పలువురు విద్యార్థులు పేర్కొన్నారు. భూములు అమ్ముతామంటూ ప్రభుత్వ విద్యాసంస్థను నాశనం చేస్తున్న సర్కారు.. ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వాళ్ల నుంచి ఎందుకు వాటిని వెనక్కి తీసుకోవడం లేదని ప్రశ్నించారు. భూముల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. వర్సిటీ క్యాంపస్‌ నుంచి పోలీసు బలగాలను తక్షణం ఉపసంహరించుకోవాలని హెచ్‌సీయూ ఆచార్యుల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది.


గ్యారెంటీలు విస్మరించి భూఅమ్మకాలా?

విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకోవడంతోపాటు పర్యావరణాన్ని ధ్వంసం చేస్తూ వన్యప్రాణులకు హాని తలపెడుతున్న ప్రభుత్వం వెంటనే హెచ్‌సీయూ భూముల ఆక్రమణను నిలిపివేయాలని బీజేపీ మహిళామోర్చా డిమాండ్‌ చేసింది. హెచ్‌సీయూ భూముల వేలం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ సచివాలయ ముట్టడికి యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. మహిళామోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు సచివాలయం వద్దకు చేరుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శిల్పారెడ్డి మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీలను విస్మరించిన సర్కారు, భూముల అమ్మకాలకు కుట్రలు చేస్తోందని మండిపడ్డారు.


పర్యావరణ విధ్వంసం ఆపండి: రేణూదేశాయ్‌

హెచ్‌సీయూలో విద్యార్థుల ఉద్యమానికి పలువురు టాలీవుడ్‌ సెలబ్రిటీలు మద్దతు పలికారు. నటి రేణుదేశాయ్‌ స్పందిస్తూ.. ‘‘ఒక తల్లిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గారికి విన్నవిస్తున్నా. నా పిల్లలకు, మనందరి పిల్లలకు ఆక్సిజన్‌ కావాలి. అలాగే మాకు అభివృద్ధి కావాలి. కానీ, ప్రకృతిని, పర్యావరణాన్ని ధ్వంసం చేయొద్దు. మీరు పరిపాలిస్తున్న రాష్ట్ర పౌరురాలిగా అడుగుతున్నా. ఆ 400 ఎకరాలను వదిలేయండి ప్లీజ్‌’’ అని ఆమె విడుదల చేసిన వీడియోలో అభ్యర్థించారు.


ఈ చర్యలు ఉనికికే ప్రమాదం: సమంత

హెచ్‌సీయూలో తాజా పరిణామాలపై సోషల్‌ మీడియా వేదికగా సమంత స్పందిస్తూ ‘‘అటవీ నిర్మూలన చర్యలతో ఉష్ణోగ్రతలు మరో 4 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. ఇది మానవాళిఉనికికి కూడా ప్రమాదకరం. హెచ్‌సీయూలోని 400 ఎకరాల్లో చెట్లను నరకడం చాలా బాధగా ఉంది. జంతువులను, పక్షులను కాపాడాలి’’ అని పేర్కొన్నారు.

రాహుల్‌ దిష్టిబొమ్మ దహనం

హెచ్‌సీయూలో విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జిని నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో బీఆర్‌ఎ్‌సవీ నాయకులు ఆందోళన చేపట్టారు. వర్సిటీ అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌ వద్ద కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ దిష్టి బొమ్మను దహనం చేశారు. హెచ్‌సీయూ విద్యార్థులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని బీఆర్‌ఎ్‌సవీ రాష్ట్ర కార్యదర్శి జంగయ్య డిమాండ్‌ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎస్ఆర్‌హెచ్‌ వివాదంపై స్పందించిన హెచ్‌సీఏ

నా కుమారుడు ఎవరినీ మోసం చేయలేదు

For More AP News and Telugu News

Updated Date - Apr 03 , 2025 | 04:53 AM