Telangana PSC Controversy: గ్రూప్-1 ఫలితాలపై ఆరోపణలన్నీ అబద్ధాలే
ABN , Publish Date - Apr 16 , 2025 | 05:13 AM
గ్రూప్-1 ఫలితాలపై వచ్చిన ఆరోపణలు రాజకీయ దురుద్దేశంతో చేసినవేనని టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసింది. కోఠి కాలేజీలో 25 శాతం మంది మహిళలు మెయిన్స్ రాసారని, ఉర్దూ మీడియం అభ్యర్థుల్లో ఒక్కరికే పిలుపు వచ్చిందని వివరించింది.

రాజకీయ దురుద్దేశంతో వేసిన నిందలే
25 శాతం మంది మహిళలు మెయిన్స్ రాసింది కోఠి కాలేజీలోనే
ఉర్దూ మీడియంలో రాసిన 563 మందిలో ఒక్కరికే పిలుపు:టీజీపీఎస్సీ
హైదరాబాద్, ఏప్రిల్ 15(ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ నేత, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఇతర నేతలు గ్రూప్-1 ఫలితాలపై చేసిన ఆరోపణలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఖండించింది. అన్నీ రాజకీయ దురుద్దేశంతో చేసిన ఆరోపణలేనని తేల్చిచెప్పింది. ఈ మేరకు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ ఓ ప్రకటన విడుదల చేశారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలన్న ఉద్దేశంతోనే ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు వేర్వేరు హాల్ టికెట్లు ఇచ్చామని తెలిపారు. మెయిన్స్ పరీక్షలను జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నిర్వహించినందున అభ్యర్థుల సౌకర్యార్థం వేర్వేరుగా హాల్ టికెట్లు ఇచ్చామని వివరించారు. కోఠి మహిళా కళాశాలలో రాసిన వారికే ఉద్యోగాలు వచ్చాయన్న ఆరోపణలపై స్పందిస్తూ.. అక్కడ మహిళలకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు ఉండటంతో ఎక్కువ మందికి కోఠి కళాశాలనే పరీక్ష కేంద్రంగా కేటాయించామని చెప్పారు.
మొత్తం గ్రూప్-1 మెయిన్స్ మహిళా అభ్యర్థుల్లో 25శాతం మంది కోఠి కాలేజీలోనే పరీక్షలు రాశారని వివరించారు. ఉర్దూ మీడియంలో 9మంది పరీక్ష రాస్తే ఏడుగురికి ఉద్యోగాలు వచ్చాయన్న ఆరోపణలూ అవాస్తవమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 563 మంది ఉర్దూ మీడియంలో పరీక్ష రాయగా అందులో 10 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారని చెప్పారు. వారిలో ఒక్కరినే ధృవపత్రాల పరిశీలనకు పిలిచామని కమిషన్ కార్యదర్శి స్పష్టం చేశారు. అభ్యర్థులకు ఏమైనా అనుమానాలుంటే 99667 00339 నెంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని నవీన్ సూచించారు.
For AndhraPradesh News And Telugu News