Vikarabad: రూ.9కే చీర.. దొరక్క కన్నెర్ర!

ABN, Publish Date - Apr 05 , 2025 | 04:05 AM

చీరలు అయిపోవడంతో వచ్చిన మహిళలు నోటికి పనిచెప్పారు. వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో శుక్రవారం ప్రారంభించిన జేఎల్‌ఎం షాపింగ్‌ మాల్‌ వద్ద ఇలా తీవ్ర గందరగోళం నెలకొంది.

Vikarabad: రూ.9కే చీర.. దొరక్క కన్నెర్ర!
  • మాల్‌ నిర్వాహకుల అత్యుత్సాహం తెచ్చిన తంటా

  • చీర కోసం వేలసంఖ్యలో ఎగబడ్డ మహిళలు

  • క్షణాల్లో సరుకంతా ఖాళీ.. నారీమణుల ఆగ్రహం

వికారాబాద్‌, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): అగ్గువకు చీర.. ధర కేవలం తొమ్మిది రూపాయలే! ఇలా చెబితే ఎవరికి మాత్రం కొనాలని ఉండదు? మహిళలు కదా.. మరింతగా పోటెత్తారు! అయితే ఆఫర్‌ను ప్రారంభించిన కొద్దిసేపటికే చీరలన్నీ అయిపోవడం.. మహిళలు ఇంకా పెద్ద సంఖ్యలో దూసుకురావడంతో నిర్వాహకులు ఉక్కిరిబిక్కిరయ్యారు. చీరలు అయిపోవడంతో వచ్చిన మహిళలు నోటికి పనిచెప్పారు. వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో శుక్రవారం ప్రారంభించిన జేఎల్‌ఎం షాపింగ్‌ మాల్‌ వద్ద ఇలా తీవ్ర గందరగోళం నెలకొంది.


రూ.9కే చీర ఇస్తామని నిర్వాహకులు వారం రోజుల ముందే ప్రకటించడంతో శుక్రవారం ఉదయం 8గంటలకే వికారాబాద్‌, దాని చుట్టుపక్కల ఊర్ల నుంచి మహిళలు వేల సంఖ్యలో షాపింగ్‌మాల్‌ ముందు పోగయ్యారు. ఆఫర్‌కు అందుబాటులో ఉంచిన 5వేల చీరలు కొద్దిసేపటికే అయిపోయాయి. ఇదే విషయాన్ని నిర్వాహకులు ప్రకటించడంతో అప్పటిదాకా వేచి ఉన్న మహిళలు అగ్గిమీదగుగ్గిలం అయ్యారు. గంటల కొద్దీ వేచి ఉన్నా చీర ఇవ్వరా? అంటూ మండిపడ్డారు. ఇంకొందరు చీర ఇచ్చేదాకా వెళ్లే ప్రసక్తే లేదంటూ అక్కడే కూర్చున్నారు.

Updated Date - Apr 05 , 2025 | 04:05 AM