మోదీ హామీతో విస్తుపోతున్న దేశ ప్రజలు!

ABN , First Publish Date - 2021-06-08T01:23:59+05:30 IST

కొద్దిసేపటి క్రితం ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఇకపై వ్యాక్సినేషన్ బాధ్యతను కేంద్రమే తీసుకుంటుందని

మోదీ హామీతో విస్తుపోతున్న దేశ ప్రజలు!

న్యూఢిల్లీ: కొద్దిసేపటి క్రితం ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఇకపై వ్యాక్సినేషన్ బాధ్యతను కేంద్రమే తీసుకుంటుందని, రాష్ట్రాలు ఒక్క రూపాయి కూడా భరించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. టీకాలను కేంద్రమే కొనుగోలు చేసి రాష్ట్రాలకు ఇస్తుందని వివరించారు. సరిగ్గా ఇదే ఇప్పుడు తీవ్ర విమర్శలకు కారణమైంది. నిన్నమొన్నటి వరకు వ్యాక్సిన్ల కొరతకు రాష్ట్రాలే కారణమని బీజేపీ అగ్రనేతలు చిందులు తొక్కారు.


రాష్ట్రాలన్నీ తామిచ్చిన వ్యాక్సిన్లనే వేస్తున్నాయని, 25 శాతం టీకాలను కొనుగోలు చేసుకోవాలని చెప్పినా ఒక్క టీకాను కూడా కొనుగోలు చేయలేకపోయాయంటూ బీజేపీ యేతర రాష్ట్రాలపై విరుచుకుపడ్డారు. దేశంలో వ్యాక్సినేష్ కార్యక్రమం ముందుకు సాగకపోవడానికి రాష్ట్రాలే కారణమని, అవసరమైతే గ్లోబల్ టెండర్లకు వెళ్లాలన్న తమ మాటను పెడచెవిన పెట్టాయని మండిపడ్డారు.


ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను అయితే బీజేపీ నేతలు చుట్టుముట్టారు. ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం కంటే ప్రైవేటు ఆసుపత్రులే ఎక్కువ టీకాను సమీకరించుకుంటున్నాయని దుమ్మెత్తి పోశారు. ఇప్పుడేమో దాదాపు రాష్ట్రాలన్నీ వ్యాక్సిన్లను పెద్ద ఎత్తున కొనుగోలు చేసి టీకా కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్న వేళ మోదీ వచ్చి దేశ ప్రజలందరికీ టీకాలను ఉచితంగా తామే ఇస్తామని చెప్పడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.  


కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు పది కోట్లమందికిపైగా వ్యాక్సిన్లు వేశారు. వీరిలో దాదాపు సగం మంది సొంతంగా కొనుగోలు చేసుకుని టీకాలు వేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెద్ద ఎత్తున వ్యాక్సిన్లు కొనుగోలు చేశాయి. ఇలాంటి సమయంలో తాము ఉచితంగా వ్యాక్సిన్లు వేస్తామని చెప్పడం ప్రజలను ఏమార్చడమే అవుతుందని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. మరి ఇప్పటి వరకు టీకాలపై రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలు పెట్టిన ఖర్చుకు బాధ్యత ఎవరు తీసుకుంటారని ప్రశ్నిస్తున్నాయి.


ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయంలోనూ బీజేపీ ఉచిత వ్యాక్సిన్ తంత్రానికి తెరలేపింది. తొలుత బీహార్‌లో ఉచిత వ్యాక్సిన్ హామీ ఇచ్చింది. నిర్మలా సీతారామన్ విడుదల చేసిన ఈ మేనిఫెస్టోలో ‘ఓటుకు వ్యాక్సిన్’ పథకం తీవ్ర దుమారం రేపింది. ఒక్క బీహార్‌కేనా దేశం మొత్తానికి ఇవ్వరా అని ప్రతిపక్షాలు  మండిపడ్డాయి. బీజేపీని గెలిపిస్తేనే టీకాను ఉచితంగా ఇస్తామని, లేదంటే ఇవ్వబోమన్నట్టుగా చెప్పడం ఏమిటంటూ ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి.


దీనిపై నాడు స్పందించిన కేంద్రమంత్రి ప్రతాప్ సారంగి... ఎన్నికలు జరుగుతున్న బీహార్‌లోనే కాకుండా దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామన్నారు. దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందించాలని మోదీ యోచిస్తున్నారని, ఇందుకు ఒక్కో వ్యక్తికి రూ. 500 వరకు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని అన్నారు. దేశవ్యాప్తంగా ఉచిత వ్యాక్సిన్ ఇవ్వాలని మోదీ భావిస్తున్నారని సారంగి గతేడాది అక్టోబరులోనే చెప్పారు. ఆయనీ విషయం చెప్పిన ఎనిమిది నెలలకు మోదీ ఉచిత వ్యాక్సిన్ ప్రకటన చేయడం గమనార్హం.


ఈ అంశం దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపడంతో స్పందించిన బీజేపీ ఐటీ సెల్ ఇన్ ‌చార్జి అమిత్ మాలవీయ స్పందించారు. ‘‘కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు నామమాత్రపు ధరకు వ్యాక్సిన్ అందిస్తుంది. అయితే, దాన్ని రాష్ట్ర ప్రజలకు ఉచితంగా ఇవ్వడమా? లేకపోతే ఆ ధరను ప్రజల వద్దే వసూలు చేయడమా? అనేది రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించుకోవాలి. బీహార్‌లో మాత్రం బీజేపీ ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది’’ అని అమిత్ మాలవీయ చెప్పడం మరిన్ని విమర్శలకు దారి తీసింది. ఇది జరిగి ఇన్నాళ్లు గడిచాక, ఇప్పుడిప్పుడే వ్యాక్సిన్ల లభ్యత పెరుగుతున్న తరుణంలో మోదీ ఉచిత వ్యాక్సిన్ ప్రకటన చేయడం విమర్శలకు తెర లేచేలా చేసింది.

Updated Date - 2021-06-08T01:23:59+05:30 IST