ఆ పోలీసుల రికార్డు తీస్తా
ABN , First Publish Date - 2021-03-10T11:33:27+05:30 IST
రాష్ట్రానికి పట్టిన శని గ్రహం సీఎం జగన్ అని టీడీపీ అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. భూములపై హక్కు కల్పించాలని కోరితే రైతులపై దాడులు చేస్తారా అని

వారందరిపై చర్యలు తప్పవు.. చరిత్రలో నిలిచిన మహిళల పోరు
వారికి అండగా ఉంటా: చంద్రబాబు.. పార్లమెంటులో ప్రస్తావిస్తా: జయదేవ్
గుంటూరు, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి పట్టిన శని గ్రహం సీఎం జగన్ అని టీడీపీ అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. భూములపై హక్కు కల్పించాలని కోరితే రైతులపై దాడులు చేస్తారా అని ఆగ్రహించారు. మహిళా దినోత్సవంనాడు విజయవాడ దుర్గమ్మ, మేరీమాత దర్శనాలకుబయల్దేరిన మహిళా రైతులను పోలీసులు నిర్బంధించే క్రమంలో కొందరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చంద్రబాబు తుళ్లూరులో మంగళవారం పరామర్శించారు. ‘‘చట్టం, రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన పోలీసులు..బాధ్యత మరచి ప్రవర్తించారు. అమరావతిలో డ్యూటీ చేసిన ప్రతి పోలీసు రికార్డు తీసి విశ్లేషిస్తాం. వారిపై చర్యలు తప్పవు. ఇప్పటికైనా పోలీసులు తమ తీరు మార్చుకోవాలి. రాజధాని మహిళల పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది. వారికి పూర్తి అండగా నిలుస్తాం’’ అని చంద్రబాబు ధైర్యం చెప్పారు.
రాజధాని కోసం రేయింబవళ్లు కష్టపడ్డానని, ఆ కష్టమంతా బూడిద పాలు చేశారని అవేదన వ్యక్తం చేశారు. ‘‘అమరావతి భూముల్లో అనేక అక్రమాలు జరిగాయని ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులవుతున్నా ఎందుకు రుజువు చేయలేకపోయారు? ఇక్కడ ఒకే కులం ఉందని దుష్ప్రచారం చేశారు. లేని భూకంపాన్ని సృష్టించారు. జగన్ మాటలకు నాడు అందరూ మంచులా కరిగిపోయారు. ఆఖరికి అమరావతిలోనూ వైసీపీనే గెలిపించారు. న్యాయం, ధర్మం అమరావతి పక్షానే ఉన్నాయి. అమరావతిని ఎవరు కదల్చలేరు’’ అని స్పష్టం చేశారు. నిజానికి జగన్ అంత పిరికివాడు మరొకరు లేరనీ, ఇంటి నుంచి సచివాలయానికి రావడానికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, స్పెషల్ ఫోర్స్, అడ్డంగా పరదాలు కావాలా అని ఎద్దేవా చేశారు. ‘‘చిత్తూరులో అన్యాయం జరుగుతోందని నిరసన తెలపటానికి వెళ్తుంటే ఎయిర్ పోర్టులో నన్ను 9 గంటలు నిర్బంధించారు. నేను కన్నెర చేస్తే మీరు నాడు తిరగగలిగేవారా? అసెంబ్లీలో నా సంగతి తెలుస్తామని ఓ మంత్రి అంటున్నారు. నా సంగతి తేల్చడం వాళ్ల జేజమ్మల వల్ల కూడా కాదు. ప్రజల పక్షాన పోరాడుతున్న నన్ను ధైౖర్యముంటే ఎదుర్కోండి. శక్తి ఉంటే సమస్యలను పరిష్కరించి చూపండి’’ అని సవాల్ విసిరారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజలకు భయపడేవారనీ, ఆయన కుమారుడు జగన్ మాత్రం రౌడీలనే నమ్ముకున్నారని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో ఎక్కడా ప్రశాంతత లేదని.... విశాఖను నాశనం చేశారని తెలిపారు. అక్కడ మరో శనిగ్రహం విజయసాయిరెడ్డి రూపంలో తయారయ్యిందన్నారు. ‘‘ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కును అమ్మేయాలని కుట్రల చేస్తున్నారు. పోస్కో తెలియదని ఒకసారి, మళ్లీ కృష్ణపట్నం, కడపకు వచ్చారని మరోసారి కథలు చెప్పారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి తెచ్చారని మండిపడ్డారు. కాగా, అమరావతి గురించి మళ్లీ, మళ్లీ పార్లమెంట్‌లో చర్చిస్తానని ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. భయపడకుండా మహిళలు చేస్తున్న పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని కొనియాడారు.
విశాఖలో మరింతగా విధ్వంసం : రామకృష్ణ
మహిళలు గుళ్లకు, గోపురాలకు వెళ్లడం కూడా వైసీపీ ప్రభుత్వంలో తప్పుగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. మహిళా దినోత్సవం నాడు పోలీసులతో దాడులు చేయించిన ముఖ్యమంత్రి రాష్ట్రంలోని మహిళలకు అందరికీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసుల దాడిలో గాయపడిన మహిళలను ఆయన పరామర్శించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా అమరావతిని మార్చడం ఎవరి తరం కాదని రామకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. విశాఖలో అమరావతికి మించిన విధ్వంసం జరుగుతోందన్నారు. విశాఖను విజయసాయి, కర్నూలును బుగ్గన..పంచుకు తింటున్నారని విమర్శించారు.