ఈ రెండింటిలో రజనీకాంత్ పార్టీ చిహ్నం ఏదో..!?
ABN , First Publish Date - 2020-12-08T17:27:20+05:30 IST
తమిళ సూపర్‌స్టార్ జనవరిలో ప్రారంభించనున్న రాజకీయ పార్టీకి..

- అన్నామలై సైకిలా..?
- బాబా ముద్రా !?
- రజనీ పార్టీ చిహ్నంపై ఆసక్తికర చర్చలు
చెన్నై : తమిళ సూపర్‌స్టార్ జనవరిలో ప్రారంభించనున్న రాజకీయ పార్టీకి అధికార చిహ్నంగా ఏ గుర్తును ఎంపిక చేస్తారనే విషయంపై రజనీ మక్కల్ మండ్రం నేతల మధ్య ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. ఈ నెల 31న రజనీ పార్టీ ప్రారంభం గురించి, పార్టీ ఆశయాలు గురించి అధికారకింగా ప్రకటన చేయనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రజనీ ప్రారంభించనున్న పార్టీకి ఏ చిహ్నం ఎంచుకుంటారనే విషయం మండ్రం నేతల నడుమ వివాదం సాగుతోంది. రజనీ బాబా భక్తుడైనందుకు బాబా చిహ్నాన్ని పార్టీ గుర్తుగా ఎంపికచేస్తారని మెజారిటీ మండ్రం నేతలు భావిస్తున్నారు. ఇటీవల పోయెస్‌గార్డెన్‌లో మీడియా ప్రతినిధుల సమావేశం ముగిసిన తర్వాత రజనీ బాబా ముద్రను చూపెట్టారు.
ఆ బాబా ముద్రను పార్టీ చిహ్నంగా రజనీ ప్రకటిస్తారని అభిమానులంతా అనుకుంటున్నారు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం అభ్యర్థులకు కేటాయించే గుర్తుల జాబితాలో బాబా ముద్రను పోలిన ఏ గుర్తులు లేవు. కనుక బాబా ముద్రను ఎన్నికల సంఘం కేటాయించదని తెలుస్తోంది. అలాంటి పరిస్థితుల్లో రజనీ నటించిన సూపర్‌హిట్ చిత్రం అణ్ణామలై చిత్రంలో పాలవాడిగా సైకిలుపై తిరుగుతూ పాడిన ‘రెక్క గట్టి పరక్కుదయ్యా అణ్ణామలై సైకిల్’ అనే పాట గుర్తుకు వచ్చిన మండ్రం నేతలు రజనీ పార్టీ చిహ్నంగా ఎంపిక చేస్తే గెలుపు తథ్యమని వాదిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు విజయ చిహ్నం సైకిలేనని చెబుతున్నారు. అంతే కాకుండా రాష్ట్రంలో గతంలో జీకే మూపనార్ నాయకత్వంలో ఏర్పాటైన తమిళ మానిల కాంగ్రెస్ విజయానికి కూడా సైకిల్ చిహ్నమే దోహదపడిందని మండ్రం నేతలు తెలిపారు. బాబా ముద్ర గుర్తుగా లభించకపోతే రజనీ సైకిల్ గుర్తును పార్టీ చిహ్నం ఎంపిక చేస్తారని చెబుతున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం అభ్యర్థుల జాబితాలో సైకిల్ గుర్తు కూడా ఉండటంతో ఆ చిహ్నం పొందటానికి ఎలాంటి ఇబ్బంది ఉండవని మండ్రం నేతలు తెలిపారు. ఏది ఏమైనప్పటికీ రజనీ పార్టీని ప్రారంభించకమునుపే ఆ పార్టీకి ఏ చిహ్నన్ని ఎంపిక చేస్తారనే విషయం మండ్రం నేతల నడుమ ప్రత్యేక చర్చనీయాంశంగా మారింది. రజనీ పార్టీ చిహ్నం గురించి అధికారంగా తెలుసుకోవడానికి వచ్చే జనవరి వరకూ వేచి చూడాల్సిందే!
