గురువునంటారు కానీ.. మంచి చెడ్డలు చూసినవారే లేరు

ABN , First Publish Date - 2020-02-07T21:26:08+05:30 IST

వంగపండు ప్రసాదరావు అంటేనే ‘ఏం పిల్లడో ఎల్దుమొస్తవ’ గుర్తొస్తుంది. ఈ భావావేశం ఎలా వచ్చింది? శ్రీకాకుళ పోరాటం ఆగిన సందర్భమది. అప్పుడు విశాఖ షిప్‌యార్డ్‌లో పనిచేస్తున్నా. చదువురాని వారికి సైతం అర్థమయ్యేలా సాహిత్యం ఉండాలని శ్రీశ్రీ వంటి వారు ఆలోచించేవారు.

గురువునంటారు కానీ.. మంచి చెడ్డలు చూసినవారే లేరు

నలభై ఏళ్ల కిందటి పేదరికంలోనే ఇప్పుడూ

నక్సల్బరీ నుంచి హజారే దాకా రాస్తూనే ఉన్నా

గద్దర్‌ బావతో కలిసేది లేదు

వైఎస్‌పై రాసినందుకు క్షమాపణ చెప్పా

24-10-2011న ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కేలో వంగపండు


ఏం పిల్లడో ఎల్దుమొస్తవ.. అనే పాట వినపడగానే.. వంగపండు ప్రసాదరావు పేరే గుర్తుకు వస్తుంది.. 300కు పైగా జానపద పాటలు రచించిన వంగపండు.. విప్లవ కవిగా పేరు ప్రఖ్యాతులు పొందారు. ‘నేను కవుల కవిని.. ఇదిగో ప్రజాకవి’.. అంటూ శ్రీశ్రీయే ఓ సభలో వంగపండునుద్దేశించి పరిచయం చేశారు. బావ గద్దర్ తెలంగాణ అంటే.. తాను సమైక్యాంధ్ర కోసం పోరాటం చేశానని చెప్పుకొచ్చారు.. విప్లవ పాటల కోసం ఉద్యోగాన్నే వదిలేసిన ఆయన.. రైతులు, మహిళల బాధలపైనే పాటలు రాశారు... 


గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వంగపండు.. మంగళవారం (04-08-2020) కన్నుమూశారు. 1972లో జ‌న‌నాట్య మండ‌లిని స్థాపించిన వంగ‌పండు త‌న గేయాల‌తో బ‌డుగుబ‌ల‌హీన వ‌ర్గాల‌ను, గిరిజ‌నుల‌ను చైత‌న్య ప‌రిచారు. 2017లో క‌ళార‌త్న పుర‌స్కారాన్ని అందుకున్నారు. 24-10-2011న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ నిర్వహించే  ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కేలో కార్యక్రమంలో వంగపండు పాల్గొన్నారు. తన జీవితంలోని విశేషాలను పంచుకున్నారు. ఆ కార్యక్రమ పూర్తి వివరాలు...


వంగపండు ప్రసాదరావు అంటేనే ‘ఏం పిల్లడో ఎల్దుమొస్తవ’ గుర్తొస్తుంది. ఈ భావావేశం ఎలా వచ్చింది?

శ్రీకాకుళ పోరాటం ఆగిన సందర్భమది. అప్పుడు విశాఖ షిప్‌యార్డ్‌లో పనిచేస్తున్నా. చదువురాని వారికి సైతం అర్థమయ్యేలా సాహిత్యం ఉండాలని శ్రీశ్రీ వంటి వారు ఆలోచించేవారు. అప్పటికే నాకు రాసే అలవాటున్నా ఆడవాళ్ల మీద రాస్తేనే మంచి పేరొస్తుందనే భ్రమలో ఉండేవాడిని. 7వ తరగతి వరకు పొలం పనులకు వెళ్లేవాణ్ని. ఆ సమయంలో జానపద గీతాలు ఆకర్షించాయి. అయితే.. సినిమా పాటలు, దేవుని పాటల బాణీలు వాడుకోరాదని విప్లవ రచయితలు ఆంక్ష పెట్టారు. ఓసారి మా అత్తవారి ఊరెళ్లాను. అక్కడ జాలరి బాగోతం జరుగుతుండేది. దాన్ని వింటూ బాణీని, పాటలోని మెలికలను పట్టుకున్నాను. అలా నా మొదటి పాట ‘కూడూ గుడ్డాలేని కూలీ నాలోళ్లు/కొట్టాలి కొడవలికి కక్కులు’ పుట్టింది. దాన్ని అందరూ మెచ్చుకున్నారు.


మీ పాటలకు శ్రీశ్రీ ప్రతిస్పందన ఏమిటి?

ఓ మీటింగ్‌లో శ్రీశ్రీ ‘నేను కవుల కవిని. ఇదిగో ప్రజాకవి ప్రసాదరావు’ అంటూ నన్ను సభకు పరిచయం చేశారు. ఎంతవరకు చదువుకున్నావు? అని ఆయన అడిగితే ‘పది పోయింది’ అన్నాను. ‘‘ఇక ఎక్కువ చదవొద్దు’’ అని సలహా ఇచ్చారు. (చదవేస్తే ఉన్నమతి పోతుందనా?) అంతే సార్‌. కాస్త అక్షర జ్ఞానం, సమాజాన్ని పరిశీలించే జ్ఞానం ఉంటే చాలు.


గద్దర్‌, మీరు బావా.. బావా అనుకుంటారు కదా? ఇపుడు ఎదురు పడితే మాట్లాడుకుంటున్నారా?

బావ దగ్గరే ఉన్నా. మాట్లాడుకుంటాం. కాకపోతే, ఆయన తెలంగాణ అంటున్నాడు. నేను సమైక్యాంధ్ర అంటున్నాను. ఆయన అటు, నేను ఇటే ఉండాలి. కలిసే ప్రసక్తే ఉండదు. జన నాట్యమండలి (జేఎన్‌ఎమ్‌) స్థాపన నుంచీ ఇద్దరం కలిసే పనిచేశాం. (జేఎన్‌ఎమ్‌లో తొలిపాట?) దేశంలోనే తొలి గిరిజన పాట ‘అంబా తకాడే తుంగలి కట్టాం/ఆజమన్నారే అంబలి జుర్రాం’ రాశాను.


రాయడం మొదలుపెట్టి 40 ఏళ్లు దాటిందా? మీలా తక్కువ చదివి ఎక్కువ పాటలు రాసినవారు ఉన్నారా?

47 ఏళ్లయింది. ఇక నాలాగా రాస్తున్నవారు లేరు. నా పాటలు పట్టుకుని, నన్ను దాటి లేదా ధిక్కరించి వెళ్లిపోయినా చాలా సంతోషించేవాణ్ని. నావరకు నేను ఇంతవరకు నా పాటలే తప్ప ఎవరి పాటా పాడలేదు.


మీ తరం అలా ఉంటే.. ఇప్పుడు ఏ భావాలు, స్పందనలు లేనివారే కనిపిస్తున్నారు. ఈ పరిస్థితికి కారణం?

నేను రాసిన పాటల్లాంటి పాటలు రాస్తే అరెస్టులు తప్పవనే భయం పట్టేసింది. దీంతో ఉద్యమ స్ఫూర్తిని తగ్గించి ఎవరి ప్రాంతం గురించి వాళ్లు, ఎవరి జాతి గురించి వాళ్లు రాయడం మొదలుపెట్టారు. (విప్లవ భావాల అవసరం ఇప్పటికీ ఉందా?) తప్పక ఉంది. అందరినీ కలిపి ఉంచేదే విప్లవం. అందుకే సమైక్యాంధ్రకోరుతున్నా.


విప్లవ పాటల్లోకి వచ్చేశాక ఉద్యోగం వదిలేశారా?

అవును. షిప్‌యార్డ్‌లో లేబర్‌గా మొదలై ఫిట్టర్‌గా బయటకొచ్చాను. అయితే, తోటి కార్మికులపై పాట రాయలేదు. నా దృష్టంతా గిరిజనులు, రైతులు, మహిళల బాధలపైనే ఉండేది. నా తోటి కార్మికులు పదేపదే అడగడంతో ‘‘యంత్రమెట్టా నడుస్తూ ఉందంటే’’ రాశాను. దానికి మూలం జంగాలు పాడే జానపద పాట.


ప్రతిభకు తగిన గుర్తింపు లభించిందా?

ఉద్యమంకోసమే పాడాను. ప్రజల కోసమే ఆడాను. (సమాజం నుంచి అదేస్థాయిలో పొందారా?) 47 ఏళ్ల కిందటి పేదరికంలోనే ఇప్పటికీ ఉన్నాను. షిప్‌యార్డ్‌లో పని చేసినంత కాలం, ఆ కొద్ది జీతంతోనే కుటుంబాన్ని పోషించా. అది పోయాక వ్యవసాయం చేశాను. ఇప్పుడు ఆ భూమి కూడా లేదు. సభలకు పిలిచినప్పుడు, బస్సు చార్జీ మాత్రమే ఇచ్చేవాళ్లు. చివరకు నాకు పాట తప్ప మరేమీ మిగల్లేదు. (మీ తోటివారు రాజీపడి బాగుపడ్డారుగా?) కొందరు కార్లు కొన్నారు. మేడలు కట్టారు. వారంతా నాకు గురువుగా గౌరవమైతే ఇస్తారు గానీ, ‘‘అన్నం తిన్నావా?’’ అని ఏనాడూ అడగలేదు. (మీకూ కనువిప్పు కలిగిందంటారు?) ఉద్యమ పాటల విషయంలో రాజీ పడింది లేదు. (వైఎస్‌పై పాట విషయం?) ఆయన మరణించినప్పుడు స్పందించి రాశా. ఆ తర్వాత క్షమాపణ చెప్పాను. (డబ్బులు ఇచ్చారా?) పైసా ఇవ్వలేదు. నేనూ ఆశించలేదు. (ప్రతిష్ఠ పడిపోయిందిగా?) నిజమేనండీ. ఏదో తెలియక అలా అయిపోయింది.


టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు వార్తలొచ్చాయి. టీడీపీలో చేరారని కూడా అన్నారు?

టీఆర్‌ఎస్‌లో చేరతాననేది వాస్తవం కాదు. ఇక టీడీపీలో చేరలేదు గానీ, ఆ పార్టీ కార్యకర్తలకు సాంస్కృతిక శిక్షణ ఇచ్చాను. (మీ అమ్మాయి జగన్‌ పార్టీలో చేరింది?) ఉష, ఆమె భర్తకు సంబంధించిన నిర్ణయం అది. నాకు సంబంధం లేదు. (మీ వారసురాలేగా?). అది నిజమే. కానీ, పెళ్లయిపోయాక, ఆమె, ఆమె భర్త నిర్ణయమే ముఖ్యం.


మీరు సినిమాలకు రాసిన వాటిలో ఇష్టమైన పాట?

‘అర్ధరాత్రి స్వతంత్రం’లో ‘‘మీ అమ్మి చచ్చినా దమ్మిడొగ్గను’’ పాట నాకిష్టం. (పారితోషకం?) ఒక్కోపాటకు వెయ్యి నుంచి 1,500 దాకా ఇచ్చేవారు.


మీ గమ్యం ఏమిటి?

జీవిత చరమాంకం వరకూ ఉద్యమంతో సాగాలని ఉంది. నాటి నక్సల్బరీ నుంచి నేటి హజారే ఉద్యమం దాకా పాటలు రాస్తూనే ఉన్నా. అన్నాపై ‘‘రండిరో రండన్న హజారన్నను బలపరుద్దాం, అవినీతిని పడగొడదాం’’ అని రాశా. ఆ పాట వీధుల్లో పాడుతుంటే యువకులు బాగా స్పందిస్తున్నారు. ఈ 40 ఏళ్లలో రోడ్లపైనే తిని అక్కడే పాడిన సందర్భాలు ఎన్నో. ఇక ముందూ రోడ్డుపైనే ఉంటాను.

Updated Date - 2020-02-07T21:26:08+05:30 IST