గోడ కడితే సహించేది లేదు
ABN , First Publish Date - 2021-03-25T05:01:25+05:30 IST
గ్రేటర్ విశాఖ 40వ వార్డు ఏకేసీ కాలనీకి ఆనుకుని ఉన్న పాత గోడపై మరో ఆరు అడుగుల ఎత్తున గోడ కట్టేందుకు పోర్టు యజమాన్యం సిద్ధమయింది. దీంతో కాలనీ వాసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

పోర్టు అధికారులతో ఏకేసీ కాలనీ వాసుల వాగ్వాదం
మల్కాపురం, మార్చి 24: గ్రేటర్ విశాఖ 40వ వార్డు ఏకేసీ కాలనీకి ఆనుకుని ఉన్న పాత గోడపై మరో ఆరు అడుగుల ఎత్తున గోడ కట్టేందుకు పోర్టు యజమాన్యం సిద్ధమయింది. దీంతో కాలనీ వాసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అదే సమయంలో అక్కడికి చేరుకున్న వార్డు కార్పొరేటర్ గుండపు నాగేశ్వరరావు గోడ నిర్మాణ పనులు నిలిపివేయాలని కోరారు. ఇప్పటికే వివిధ కంపెనీలు గోడలను కట్టేశాయని, ప్రస్తుతం ఉన్న ఈ గోడ ఎత్తు పెంచితే కాలనీకి గాలి, వెలుతురు రావన్నారు. గోడ నిర్మాణంతో ఇరుకు గదిలో ఉన్నట్టు ఉంటుందని, తద్వారా కాలనీవాసులు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను ఇప్పటికే ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ దృష్టికి తీసుకువెళ్లామని, పోర్టు అధికారులతో వారు చర్చిస్తామని హామీ ఇచ్చారన్నారు. దీంతో నిర్మాణ పనులు నిలిపివేసి, వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించుకోవాలని కార్పొరేటర్‌కు సూచించి అక్కడి నుంచి పోర్టు అధికారులు వెళ్లిపోయారు.