కేసీఆర్.. నాకు, హరీశ్‌రావుకు మంత్రి పదవి ఇవ్వాల్సివస్తుందనే మంత్రివర్గం ఏర్పాటు ఆలస్యం చేశారు.

ABN , First Publish Date - 2021-11-08T08:35:10+05:30 IST

విధానాల పరంగా మాత్రమే విభేదాలున్నాయి. 2014లో మొదటి ఆరు నెలలు గడిచాక.. అధికారాలన్నింటినీ తనవద్దనే పెట్టుకునే ప్రయత్నాలను కేసీఆర్‌ ప్రారంభించారు.

కేసీఆర్.. నాకు, హరీశ్‌రావుకు మంత్రి పదవి ఇవ్వాల్సివస్తుందనే మంత్రివర్గం ఏర్పాటు ఆలస్యం చేశారు.

కేసీఆర్‌కు, మీకు ఎక్కడ చెడింది? 

విధానాల పరంగా మాత్రమే విభేదాలున్నాయి. 2014లో మొదటి ఆరు నెలలు గడిచాక.. అధికారాలన్నింటినీ తనవద్దనే పెట్టుకునే ప్రయత్నాలను కేసీఆర్‌ ప్రారంభించారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి నాతోపాటు మంత్రులు కడియం శ్రీహరి, హరీశ్‌రావు, తుమ్మలతో కలిసి కమిటీ వేశారు. కానీ, మేం అధ్యయనం చేస్తుండగానే, నివేదిక ఇవ్వకముందే పథకాన్ని ప్రకటించారు. ఎవరి సొంత స్థలంలో వారు ఇల్లు కట్టుకునే అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పగా.. మా సూచనలను సీఎం పట్టించుకోలేదు. కేంద్రం నుంచి మంజూరైన లక్షల ఇళ్లు కూడా కట్టుకోలేకపోయాం. కాళేశ్వరం ప్రాజెక్టు వంటివాటిని కొందరు బడా కాంట్రాక్టులు దక్కించుకువారు మాత్రం కొన్ని ఇళ్లు కట్టారు. నేను కొందరిని బతిమిలాడి 2వేల ఇళ్లు కట్టించాను. మూడెకరాల భూమి పంపిణీ కూడా సాధ్యం కాదని చెప్పాం. ఆధిపత్య పోరు అనేది వట్టి బక్వాస్‌. కనీసం ఒక మంత్రికి తన శాఖలోని అంశాలపై చర్చించే అధికారం గానీ, నిర్ణయం తీసుకునే అధికారం గానీ లేవు. ముఖ్యమంత్రే అధికారులను పిలవడం, ఏం చేయాలో సూచించడం జరిగేవి. ఆయనకు ఎవరిమీదా నమ్మకం ఉండదు. ఎవరికీ తెలివి ఉన్నట్లుగా అంగీకరించరు. అన్నీ ఆయనకే తెలుసంటారు. ముఖ్యమంత్రిగా ఇచ్చేవాణ్ని నేను.. పుచ్చుకునేవారు ప్రజలు.. మధ్యలో మీరెవరు? అన్న ధోరణితో ఉంటారు. 


అది ప్రజల సొమ్ము కదా? వారికి బాధ్యతగా ఇస్తున్నామా? లేదా? అన్నది ఆలోచించాలి కదా?

అధికారం లేనినాడు ప్రజాస్వామ్యం అనేవారు. అధికారంలోకి వచ్చాక.. అన్నీ నేనే అంటున్నారు. హుజూరాబాద్‌లో టీఆర్‌ఎ్‌సకు ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలను కత్తిరిస్తామని బెదిరించారు. దళితులు ఈటల రాజేందర్‌కు డప్పుకొడితే దళితబంధు రాదని బెదిరించారు. ప్రజలు పన్నుల రూపంలో చెల్లించే డబ్బుకు కాపలాదారుగా ఉండాల్సిన కేసీఆర్‌ యజమాని ఎలా అయ్యారు? 20 ఏళ్లు ప్రజాస్వామ్యంలో ఉన్నాను. అంతకుముందు కూడా ఉద్యమాల్లో ఉన్నాను. కానీ, ఎక్కడా ఇలాంటి నీచపు సంస్కృతిని చూడలేదు. కొందరు యువకులు ముందుకొచ్చి తమకు దళితబంధు రాకపోయినా ఫర్వాలేదు.. రాజేందరన్నను మాత్రం వదిలేయం అని చెప్పారు. ఇప్పుడు ఏయే కుటుంబాలు నాకు ఓట్లు వేశాయో తెలుసుకొని వారికి పథకాలు రాకుండా చేస్తామని భయపెడుతున్నారు. 


కేసీఆర్‌ విషయంలో చంద్రబాబు చేసిన తప్పు.. ఇప్పుడు మీ విషయంలో కేసీఆర్‌ చేశారని భావించవచ్చా?

ఆ విషయం తెలియదు. కానీ, నాలుగు కాలాలపాటు ప్రభుత్వం కొనసాగాలంటే, కేసీఆర్‌ టెన్షన్‌ లేకుండా జీవించాలంటే పది మంది సమర్థులైనవారు ఉండాలి కదా!


అలాంటప్పుడు 2018లో టికెట్‌ ఎలా ఇచ్చారు? 

ఇవ్వొద్దనే అనుకున్నారు. ఓ విద్యార్థి నాయకుడిని నా నియోజకవర్గానికి తీసుకొచ్చారు. కానీ, ఏదైనా తేడా కొడుతుందేమోనన్న భయంతో నాకు టికెట్‌ ఇచ్చారు. కాంగ్రెస్‌ అభ్యర్థికి డబ్బులిచ్చి నన్ను ఓడించాలని చూశారు. ఒకవేళ కాంగ్రెస్‌ అభ్యర్థి గెలిస్తే.. టీఆర్‌ఎస్‌లోకి వచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. ఇలా రాష్ట్రంలో దాదాపు 15 చోట్ల కాంగ్రెస్‌ అభ్యర్థులకు డబ్బులిచ్చారు. చివరికి 90సీట్లు వచ్చినా కూడా కేబినెట్‌ విస్తరించకుండా ఉన్నారు. అంతర్గత ప్రజాస్వామ్యం గురించి ఎవరో ప్రశ్నిస్తే.. అదే ఇస్తే తనను కోఠి చౌరస్తాలో అమ్మేస్తారని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. నాకు, హరీశ్‌రావుకు మంత్రి పదవి ఇవ్వాల్సివస్తుందనే మంత్రివర్గం ఏర్పాటు ఆలస్యం చేశారు. కేటీఆర్‌కు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవి అప్పగించి ఎలివేట్‌ చేసి.. మమ్మల్నందరినీ భూస్థాపితం చేయాలనే ఎజెండా పెట్టుకున్నారు. చివరికి హరీశ్‌రావు, నేను ఏకమవుతామేమోనని మంత్రి పదవి ఇచ్చారు. కానీ, వెంటనే తీసేయాలని చూశారు. కరోనా సమయంలో పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉండడం వల్ల బతికిపోయాను. 


మీ గెలుపుతో కేసీఆర్‌ ఓడినట్లేనా?

వందశాతం ఓడినట్లే. గతంలో నాకు లక్షా 4వేల ఓట్లు వస్తే.. ఈసారి కేసీఆర్‌ ఉక్కుపాదాల కింద నలిగి సాధించిన ఓట్లు లక్షా 7వేలు. ఇప్పటిదాకా తాను తయారు చేస్తేనే నాయకుడవుతాడని, తాను నిలబెట్టిన వారే గెలుస్తారని, చెప్పును నిలబెట్టినా గెలుస్తుందని కేసీఆర్‌ అన్నారు. ముఖ్యమంత్రి పదవి తనకు చెప్పుతో సమానమని కూడా అన్నారు. దీనిపై హుజూరాబాద్‌ ప్రజలు సరైనవిధంగా ప్రతిస్పందించారు. ఇన్ని రకాలుగా అవమానపరుస్తున్నా.. ఇంకా కొంతమంది బానిస మనస్తత్త్వంతో ఉండడం బాధ కలిగిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో నేను నిలదొక్కుకోవడానికి, ప్రజలు ఆశించిన విధంగా పనిచేయడానికి సరైన వేదిక అవసరం. ఆ వేదిక బీజేపీయే అనిపించింది. అందుకే చేరాను. 


టీఆర్‌ఎస్‌కు నేను కూడా ఓనర్‌ని అన్నారు కదా.. అందుకే కోపం వచ్చిందేమో?

తెలంగాణ ప్రజలంతా అండగా లేకపోతే, కార్యకర్తలు ఎవరికి వారు ఈ జెండా నాది అని భావించకపోతే టీఆర్‌ఎస్‌ విజయం సాధించేదా? తిరుగుబాటు చేసేవాణ్నయితే కష్టకాలంలో ఎలా ఉన్నాను? పద్దెనిమిదిన్నరేళ్లు ఎలా కొనసాగాను?


రూ.10 లక్షలు పంచుతానని సీఎం అనడం ప్రజాస్వామ్యమా?

ఇచ్చేది ముఖ్యమంత్రి కాదు.. మన సొమ్ము మనకు వస్తుందని చెప్పాను. రూ.10 లక్షల మీద బ్యాంకుల పెత్తనం, కలెక్టర్ల నియంత్రణ ఉండొద్దని అన్నాను. లబ్ధిదారులకే స్వేచ్ఛ ఇచ్చి, వారు చేసుకునే పనులకు సహకరించాలని సూచించాను. కేసీఆర్‌ను దళిత బాంధవుడని, అంబేద్కర్‌ అని కొందరు దళిత మేధావులు పొగిడారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక వచ్చేదాకా సీఎంవోలో ఒక్క దళిత అధికారి అయినా ఉన్నారా? ఏనాడైనా అంబేద్కర్‌ విగ్రహానికి, జగ్జీవన్‌రామ్‌ విగ్రహానికి దండ వేశారా? కేసీఆర్‌ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నా.. ఆయనను పొగిడారు. 


ఎన్నో స్కీములు ప్రవేశపెట్టినా ఓట్లు ఎందుకు వేయడంలేదు?

తెలంగాణ సమాజం ఆకలినైనా భరిస్తుంది. కానీ, ఆత్మగౌరవం విషయంలో మాత్రం రాజీ పడదు. కోపం వస్తే బరిగీసి కొట్లాడుతరు. నచ్చితే నెత్తిన పెట్టుకొని ఊరేగుతరు. నమ్మిన సిద్ధాంతం కోసం రక్తతర్పణం చేసిన గడ్డ. ఇలాంటి ప్రజల ద్వారా అధికారంలోకి వచ్చి.. వారినే బానిసలుగా మార్చుకునే ప్రయత్నం చేశారు. 


మిగిలిన కులాలు మాకెందుకు బంధు ఇవ్వడంలేదని అడగడం లేదా?

పేదరికంలో ఉన్నవారికి, భర్తను కోల్పోయిన మహిళలకు, ఆశ్రిత కులాలకు, సంచారజాతులవారికి కూడా ఇవ్వాలి. దళితబంధు ఎప్పటినుంచో తన మదిలో ఉందని చెప్పిన ముఖ్యమంత్రి.. మార్చిలో బడ్జెట్‌లోనే ఎందుకు ప్రకటించలేదు? ఇది పచ్చి అబద్ధం. తెలంగాణ మొత్తం ఎలా అమలు చేస్తారు? ప్రతి బడ్జెట్‌లో రూ.5 వేల కోట్లు నికరంగా ఖర్చు చేయలేరు. రూ.2 లక్షల కోట్లు ఎలా ఖర్చు పెడతారు? ఎమ్మెల్యేలు ఏ ముఖం పెట్టుకొని నియోజకవర్గాలకు వెళతారు? హుజూరాబాద్‌కు వెళ్లి బిల్లులు ఇప్పించారని, పథకాలు ఇప్పించారని.. ఇప్పుడు మాకెందుకు ఇవ్వరని అక్కడి ప్రజలు ప్రశ్నించరా? ధనికరాష్ట్రం అంటున్నారు.. 20వ తేదీ దాకా కూడా జీతాలు ఇవ్వలేకపోతున్నారు. ఏటా అప్పులకే రూ.56 వేల కోట్లు అసలు, వడ్డీ కట్టాలి.


హరీశ్‌కు, మీకే తెలివిగా పంచాయితీ పెట్టారు కదా?

అది తెలివి కాదు.. హరీశ్‌ను ఖతం పట్టించారు. నన్నూ ఖైమా కొట్టించాలనుకున్నా.. ప్రజలు బతికించారు. హరీశ్‌కు ఎంత మామ అయినా.. ఆయన వద్ద బానిసలా ఉండాల్సిందే. నేను అలా ఉండలేను. ఆత్మగౌరవాన్ని మించినదేదీ ఉండదు. ఆస్తులు, పదవులు గౌరవాన్ని పెంచాలి. అది లేకుండా హరీశ్‌ బతుకుతున్నారు. ఉద్యమకారుడినైన నా మీద హరీశ్‌ అబద్ధాలు ప్రచారం చేశారు. కుట్రలను అమలు చేశారు. 


ఉప ఎన్నికలో గెలిచాక మీకు హరీశ్‌రావు ఫోన్‌ చేశారా?

లేదు. నేను అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు పట్టుకునే రకాన్ని కాదు. ఒకసారి బాధ కలిగాక.. నిర్ధారించుకున్నాక, అవతలి వ్యక్తి ద్వారా నాకు గెలుపు వస్తుందనుకున్నా మాట్లాడను. 


బీజేపీలో ఎంతకాలం ఇమడగలనని అనుకుంటున్నారు?

నేను లాబీయింగ్‌ చేసేవాణ్ని కాదు. పదే పదే పార్టీలు మారేవాణ్ని కాదు. టీఆర్‌ఎ్‌సలోనూ అలాగే పని చేశాను. కేసీఆర్‌ ప్రస్తుతం చేస్తున్న పనుల వల్ల ఉద్యమంలో ఆయన చేసిందంతా గంగలో కలిసిపోయింది. 


అసెంబ్లీలో మిమ్మల్ని చూసి కేసీఆర్‌ తట్టుకోగలరా?

కేసీఆర్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ పదవిలో ఉండొద్దు.


మళ్లీ పార్టీలోకి రమ్మంటే వెళతారా?

వెళ్లను. చావనైనా చస్తా కానీ.. ఆ పని చేయను. నేను పదవి కోసం ఆరాటపడేవాణ్ని కాదు.


ఎన్నికల తరువాత మీరు కాంగ్రెస్‌లో చేరతారని కేటీఆర్‌ అన్నారు? రేవంత్‌తో కలిశారని కూడా అన్నారు?

రాజకీయ నాయకుడు అందరినీ కలుపుకొని వెళ్లగలగాలి. అందరితో సత్సంబంధాలు కలిగి ఉండాలి. సంకుచిత స్వభావంతో ఉండకూడదు. ఉద్యమ సమయంలో ఎంతో ఆవేశంగా మాట్లాడి కూడా అప్పటి రాజశేఖర్‌రెడ్డి వద్దకు వెళ్లి పనులు చేయించుకునేవాళ్లం. ఇప్పుడు ఆ వాతావరణం ఉందా? ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను తన వద్దకు రానివ్వని సంకుచిత ధోరణితో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యానికే విచారకరం. ఆయనకు అవమానకరం.


కేసీఆర్‌కు అవసరమైతే పిలిపించుకుంటారు కదా? దళితబంధు కోసం భట్టిని పిలిపించుకున్నారు కదా?

తనకు అవసరముంటే డ్రైవర్‌ను, గన్‌మెన్‌నూ దగ్గరికి తీసుకుంటారు. ఆయన మాత్రం ప్రధానికి కూడా దొరకరు. 


మీరు మాత్రం పార్టీ మారరు!

నేను ఇప్పుడు కూడా పార్టీ మారలేదు. చనిపోయేదాకా అదే జెండా కింద ఉండాలనుకున్నా. కానీ, కేసీఆర్‌ మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేసిన తరువాత.. పరువులేని చోట ఉండొద్దనే రాజీనామా చేశాను. నా రాజీనామాను స్పీకర్‌ స్వయంగా తీసుకోకుండా.. సెక్రటరీ  ద్వారా తీసుకున్నారు. చాలాకాలం ఎన్నిక పెట్టకుండా నన్ను బలహీనపరచాలనుకున్నారు. కానీ,  హుజూరాబాద్‌ ప్రజలకు నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా తక్కువే. ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఉంటే ఇంట్లో కూర్చున్నా గెలిపించేవాళ్లమని ప్రజలు చెప్పారు. కేసీఆర్‌, హరీశ్‌ అబద్ధాలకోరులని, ఎవరినైనా చంపడానికి వెనుకాడరని జనాలకు అర్థమైంది. 


స్పీకర్‌ స్వయంగా రాజీనామా లేఖను తీసుకోకపోయినా.. ఇప్పుడు ఎమ్మెల్యేగా ప్రమాణం చేయించాలి కదా?

ఇక్కడ అంబేడ్కర్‌ రాజ్యాంగం ఉండదు. కేసీఆర్‌ రాజ్యాంగం ఉంటుంది. మరి ఏం చేస్తారో చూడాలి.


మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పర్యటిస్తానన్నారు?

ఎమ్మెల్యేలే కాదు.. కేసీఆర్‌, హరీశ్‌ నియోజకవర్గాలు, రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ పర్యటిస్తా. కేసీఆర్‌ సౌధాలు ఇక ఉండవు. బీజేపీ నాయకత్వం నిర్ణయాలకు అనుగుణంగా నడుచుకుంటా. ఈ ప్రభుత్వం కొనసాగడం అరిష్టం కాబట్టి, ఈ అప్రజాస్వామిక ప్రభుత్వాన్ని కొనసాగనివ్వొద్దు. నా సంస్థలు మొత్తం అమ్ముకోవాల్సి వచ్చినా వెనక్కి తగ్గను. 


కాంగ్రెస్‌, బీజేపీ కుమ్మక్కవడం వల్లే ఈటల గెలిచారా?

అది అసాధ్యం. రెండు పార్టీలు ఉత్తర-దక్షిణ ధ్రువాలు. 


కేసీఆర్‌ ప్రభుత్వాన్ని రెండేళ్లు కుదురుగా ఉండనిస్తారా?

అలాంటి ప్లాన్లు వేయం. కానీ, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అనే తేడా లేకుండా అందరిపైనా నిఘా పెట్టారు. వారంతా ఆ భయం నీడలో బతుకుతున్నారు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కావాలన్నా ఆయనకు విశ్వాసపాత్రునిగా ఉండాల్సిన పరిస్థితులున్నాయి. ఎమ్మెల్యే గెలిచి కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్ని కల్పించారు. ఈటల గెలిస్తే ఏమవుతుందన్నారు.. తెలంగాణ ఆత్మగౌరవం పెరుగుతుంది. కేసీఆర్‌ నిరంకుశత్వం పోతుంది. ప్రగతిభవన్‌ నుంచి, ఫామ్‌హౌస్‌ నుంచి బయటికొస్తారు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు గౌరవం పెరుగుతుంది. 







Updated Date - 2021-11-08T08:35:10+05:30 IST