హరితహారానికి ‘హరిత నిధి’
ABN , First Publish Date - 2021-12-17T08:16:40+05:30 IST
రాష్ట్రంలో పచ్చదనం పెంచేందుకు ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమాన్ని చేపట్టిన ప్రభుత్వం.

- వివిధ వర్గాల నుంచి నిధుల సేకరణ
- రాష్ట్రంలో పచ్చదనం పెంపునకు వినియోగం
- హరితనిధి నిర్వహణకు రాష్ట్ర స్థాయి కమిటీ
- అటవీశాఖ మంత్రి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు
- నిధి విధివిధానాలు ఖరారు చేసిన ప్రభుత్వం
‘హరితహారం’ను విజయవంతం చేయ డంపై సర్కారు దృష్టిపెట్టింది. ఈ మేరకు ‘తెలంగాణ హరిత నిధి (గ్రీన్ ఫండ్)’ని ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసింది.
హైదరాబాద్, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పచ్చదనం పెంచేందుకు ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమాన్ని చేపట్టిన ప్రభుత్వం.. దీని అమలు కోసం ‘తెలంగాణ హరిత నిధి (గ్రీన్ ఫండ్)’ని ఏర్పాటు చేసింది. ఈ నిధిని సమర్థంగా వినియోగించేందుకు అటవీమంత్రి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి కమిటీని నియమించింది. ఈ మేరకు అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీకి అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వైస్ చైర్‌పర్సన్‌గా, పీసీసీఎఫ్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. సోషల్ ఫారెస్ట్రీ, కాంపా విభాగ పీసీసీఎ్‌ఫలు, అటవీ అభివృద్ధి సంస్థ ఎండీ, ఆర్థిక శాఖ కార్యదర్శి కమిటీ సభ్యులుగా ఉంటారు. సభ్యుల సంఖ్యను పెంచుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. హరితహారం అమలుకు ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర వర్గాల నుంచి విరాళాలు సేకరించి.. తెలంగాణ హరిత నిధిని ఏర్పాటు చేస్తామని ఈ ఏడాది అక్టోబరులో సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వం హరిత నిధి ఏర్పాటుతోపాటు దాని నిర్వహణకు విధివిధానాలు ఖరారు చేసింది. తెలంగాణ హరిత నిధి పేరుతో పీసీసీఎఫ్ బ్యాంక్ ఖాతాను తెరవాలని సూచించింది. ప్రజాప్రతినిధులు, ఇతర వర్గాల నుంచి నిధుల సేకరణకు సంబంధించి ఆర్థిక శాఖ త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తుందని తెలిపింది.
పచ్చదనం పెంచేందుకు!
రాష్ట్రంలో పచ్చదనం పెంచేందుకు హరిత నిధిని వినియోగించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. నర్సరీల ఏర్పాటు, విరివిగా మొక్కలు నాటడం, మొక్కల సంరక్షణతోపాటు హరితహారంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఆదేశించింది. వివిధ ప్రభుత్వ విభాగాల నుంచి నిధి వినియోగానికి పీసీసీఎఫ్ ప్రతిపాదనలు స్వీకరించాలని, వాటిని రాష్ట్ర స్థాయి కమిటీ ఆమోదించాలని సూచించింది. ప్రతి ఏటా ఆగస్టు నాటికి ఈ ప్రక్రియ పూర్తికావాలని పేర్కొంది. మూడు నెలలకోసారి రాష్ట్రస్థాయి కమిటీ సమావేశం కావాలని, అవసరమైన నిధులు విడుదల చేయాలని తెలిపింది. నిధుల విడుదలకు కమిటీ వైస్ చైర్‌పర్సన్, కన్వీనర్ సంతకాలు తప్పనిసరి అని స్పష్టం చేసింది. అత్యవసర పరిస్థితుల్లో పీసీసీఎ్‌ఫకు నిధులు విడుదల చేసే అధికారం ఉందని పేర్కొంది. ప్రతి ఏటా ఈ నిధిపై ఆడిట్ ఉంటుందని, అటవీశాఖ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదికలు సమర్పించాలని వివరించింది. ఇక హరిత నిధిలో 2 శాతాన్ని పరిపాలన చార్జీల కింద అటవీ శాఖ వినియోగించుకోవచ్చని తెలిపింది. సమర్థమైన పాలన, అత్యాధునిక సాంకేతికత వినియోగానికి వాటిని ఖర్చు చేయాలని సూచించింది.