తెలుగు వర్సిటీ రంగస్థల యువ పురస్కారాల ప్రదానం
ABN , First Publish Date - 2021-08-06T07:05:06+05:30 IST
బళ్లారి రాఘవ జయంతి

రవీంద్రభారతి, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): బళ్లారి రాఘవ జయంతి సందర్భంగా పొట్టి శ్రీరాములు తెలు గు విశ్వవిద్యాలయం రంగస్థల శాఖ ఆధ్వర్యంలో జె.ఎల్.నరసింహారావు స్మారక రంగస్థల యువ పురస్కారాలను 2020సంవత్సరానికి గాను యువ నటుడు, రచయిత షేక్ జానబషీర్కు, 2021సంవత్సరానికి గాను యువ నటుడు ఎం.అజయ్‌కు ప్రదానం చేశారు. గురువారం తెలుగు వర్సిటీలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి అతిథిగా హాజరై పురస్కారాలను ప్రదానం చేసి అభినందించారు. ఈ సందర్భంగా రంగస్థల కళలు మరింత రాణించాలంటే నటనలో శిక్షణ పొందిన కళాకారులకు ప్రభుత్వం తోడ్పాటునందించాల్సిన అవసరముందని ఆయన అన్నారు. నాటక పరిషత్తులు కూడా వారికి గొప్ప అవకాశాలు కల్పించాలని అభిప్రాయపడ్డారు. ప్రతి ఏటా విశ్వవిద్యాలయం రూ.5,116 నగదు పురస్కారాన్ని యువ కళాకారులకు అందిస్తోందని, దానిని మరింత పెంచాల్సిన అవసరముందని, అందుకు తన వంతు సహకారం అందిస్తానని అన్నారు. సభకు అధ్యక్షత వహించిన వర్సిటీ వీసీ టి.కిషనరావు మాట్లాడుతూ తనకు నాటకమంటే ఇష్టమని, తెలుగు వర్సిటీ రంగస్థల శాఖ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టడానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో డాక్టర్ కోట్ల హనుమంతరావు, డాక్టర్ పద్మప్రియ పాల్గొన్నారు.