విద్యార్థులతో కలిసి వీసీ భోజనం
ABN , Publish Date - Mar 15 , 2025 | 01:11 AM
ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్ క్యాంపస్‌లో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో తెలుసుకుని, వాటిని పరిష్కరించే దిశగా ముందుకు సాగుతున్నారు.

ఏయూ హాస్టళ్లలో నాణ్యత పరిశీలన
ఆకస్మిక తనిఖీలు, తరచూ వార్డెన్లతో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం
విశాఖపట్నం, మార్చి 14 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్ క్యాంపస్‌లో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో తెలుసుకుని, వాటిని పరిష్కరించే దిశగా ముందుకు సాగుతున్నారు. వర్సిటీలో ఉన్న ఇరవైకి పైగా హాస్టళ్లలో వందలాది మంది విద్యార్థులు ఉంటున్నారు. వారికి నాణ్యమైన భోజనం అందించడం అధికారుల బాధ్యత. అయితే, అనేక హాస్టళ్లలో భోజనం బాగుండడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. దీనిపై వీసీ ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్ ప్రత్యేకంగా దృష్టిసారించారు. ప్రస్తుతం గెస్ట్ హౌస్‌లో ఉంటున్న ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు హాస్టల్ నుంచే భోజనం వెళుతోంది. విద్యార్థులకు వడ్డించే ఆహారాన్నే తనకు పంపించాలని ఆదేశాలు ఇచ్చిన ఆయన...సరిగా లేకపోతే మార్పులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇందుకయ్యే ఖర్చును ఆయా హాస్టళ్లకు ఆయన చెల్లించనున్నారు. గడిచిన కొద్దిరోజుల నుంచి ఆయన ఒక్కో హాస్టల్ నుంచి భోజనం తెప్పించుకుంటున్నారు. ఇప్పటివరకూ ఇంజనీరింగ్, రీసెర్చ్ స్కాలర్స్, ఆర్ట్స్ కాలేజీలకు చెందిన హాస్టళ్ల నుంచి వచ్చిన భోజనాన్ని రుచిచేశారు. అయితే భోజనం బాగాలేదంటూ కొద్దిరోజుల కిందట విద్యార్థులు ఆందోళన చేయడంతో ఎప్పటికప్పుడు హాస్టళ్లను తనిఖీ చేసేందుకు ఆయన నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఇందులో భాగంగానే ఆయన గడిచిన రెండు రోజులుగా వివిధ హాస్టళ్లకు వెళ్లి విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్నారు. ఇబ్బందులను విద్యార్థులను అడిగి తెలుసుకుంటున్నారు. ఇబ్బందులు ఉన్నచోట విద్యార్థులతో మెస్ కమిటీలు వేయడంతోపాటు భోజనం ఎలా ఉందన్న సమాచారాన్ని తెప్పించునేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే, ఆయా హాస్టల్ వార్డెన్లతో ఎప్పటికప్పుడు సమావేశాలు పెట్టాలని నిర్ణయించినట్టు చెబుతున్నారు. మరో వారం రోజుల్లో హాస్టళ్ల నిర్వహణను గాడిలో పెట్టాలని యోచిస్తున్నారు.
నేడు స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర
పరిశుభ్రత, మొక్కలు నాటే కార్యక్రమాల నిర్వహణ
విశాఖపట్నం, మార్చి 14 (ఆంధ్రజ్యోతి):
‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’లో భాగంగా శనివారం ఉమ్మడి జిల్లాల్లో పలుచోట్ల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ కాలుష్యనియంత్రణ మండలి పర్యావరణ ఇంజనీర్ పి. ముకుందరావు తెలిపారు. శనివారం ఉదయం ఆర్కే బీచ్‌లో సైకిల్ ర్యాలీ, బీచ్ క్లీనింగ్ నిర్వహిస్తామన్నారు. అలాగే దివీస్ లేబొరేటరీస్ ఆధ్వర్యంలో చిననాగమయ్యపాలెంలో ప్లాస్లిక్ చెత్త తొలగింపు, శ్రీహరిపురంలో కోరమాండల్‌లో పరిసరాల పరిశుభ్రత, పరవాడ ఫార్మాసిటీలోని విశాఖ ఫార్మా కంపెనీలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించనున్నట్టు చెప్పారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని పరిశ్రమల్లో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమం అమలు చేయాలని ఆయా కంపెనీల ప్రతినిధులకు సూచనలు చేశామన్నారు.