Year Ender 2022: 2022లో ఎన్నో ఒడిదుడుకులు.. ప్రపంచంపై పెను ప్రభావం చూపిన ఘటనలు ఇవే..
ABN, First Publish Date - 2022-12-26T21:14:19+05:30
మరి కొద్ది రోజుల్లో 2022 కాలగర్భంలో కలిసిపోనుంది. మరి ఈ ఏడాది ప్రపంచాన్ని అత్యధికంగా ప్రభావితం చేసిన ముఖ్యాశాలు ఏవో ఓమారు తెలుసుకుందాం.
2022కు గుడ్‌బై చెప్పే సమయం వచ్చేసింది. మరికొద్ది రోజుల్లో కొత్త సంవత్సరంలోకి(New Year 2023) కాలుపెట్టబోతున్నాం. ఎన్నో ఆశలు, ఆశయాలతో కొత్త ఏడాదిని ఆహ్వానించే తరుణంలో 2022లోని జ్ఞాపకాలు గుర్తుకురాక మానవు. గతేడాది యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ఘటనల్లో(Key International Events-2022) ముందుగా చెప్పుకోవాల్సింది ఉక్రెయిన్-రష్యా యుద్ధం (Russia Ukraine War). శ్రీలంక సంక్షోభం (Srilanka Crisis).. బ్రిటన్ ప్రభుత్వ తప్పిదాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు పెద్దదే. మరి గతేడాది ప్రపంచాన్ని అమితంగా ప్రభావితం చేసిన ఘటనలు ఏవో ఓమారు రివైండ్ (Rewind 2022) చేస్తే..
ఉక్రెయిన్-రష్యా యుద్ధం..(Russia Ukraine War)
రష్యా ఉక్రెయిన్ (Russia vs Ukraine) మధ్య గత కొన్ని నెలలుగా సాగుతున్న యుద్ధంలో ఎందరో ప్రాణాలు కోల్పోయారు. యుద్ధం మాటున సైనికులు జరుపుతున్న అకృత్యాలు చూసి ప్రపంచం నివ్వెరపోయింది. యుద్ధంతో ప్రపంచ వాణిజ్యంపై (International Trade) తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. ఫలితంగా ప్రపంచంపై మాద్యం (Recession) ఛాయలు కమ్ముకున్నాయి. భవిష్యత్తులో ఆర్థిక మాంద్యం తప్పదన్న అంచనాలతో పలు అంతర్జాతీయ సంస్థలు ఉద్యోగులను తొలగించడం (Lay offs) ప్రారంభించాయి. ఈ నిర్ణయం అనేక మంది ఉద్యోగుల జీవితాలను తలకిందులు చేసింది. అమెరికా (America) సారథ్యంలోని పాశ్చాత్య దేశాలు ఎన్ని రకాల ఆంక్షలు విధించినా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను (Putin) కట్టడి చేయలేకపోయాయి. యుద్ధాలతో వినాశనం తప్ప సాధించేదేమీ లేదంటూ ప్రపంచయుద్ధాలు నేర్పిన పాఠాలను మానవాళి అప్పుడే మరిచిపోయినట్టుంది. మరి పరిస్థితులు ఎప్పటికి చక్కబడతాయి.. ఈ యుద్ధానికి ఎప్పటికి ముగింపు.. కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్న ప్రపంచాన్ని ప్రస్తుతం వేధిస్తున్న ప్రశ్నలు ఇవే..
అఫ్ఘానిస్తాన్ తాలిబన్ హస్తగతం(Taliban Rule In Afghanistan)
2022 ఆగస్టు 15న అప్ఘానిస్థాన్‌లో మళ్లీ తాలిబన్ల రాజ్యం (Taliban Rule) మొదలైంది. దాదాపు 20 ఏళ్ల అనంతరం అమెరికా సేనలు అప్ఘానిస్థాన్‌ను వీడాక ఆ దేశం మరోమారు తాలిబన్ల హస్తగతమైంది. తాలిబన్ల రాకతో అప్ఘానిస్థాన్ ప్రజలు బీదరికంలో పూర్తిగా మునిగిపోయారు. అంతర్జాతీయ సహాయంతో అంతంత మాత్రంగా ఉన్న ఆర్థికవ్యవస్థ తాలిబన్లు అడుగుపెట్టాక పాతాళానికి పడిపోయింది. తాము ఎంతో మారిపోయామంటూ మొదట నమ్మబలికిన తాలిబన్లు క్రమక్రమంగా తమ అసలు రంగును బయటపెట్టారు. షరియా చట్టం పేరిట మహిళల స్వేచ్ఛకు సంకెళ్లు వేశారు. వారి భవిష్యత్తును అంధకార మయం చేశారు. ఇతర దేశాల్లో మహిళలు పురుషులకంటే మిన్నగా తమ కెరీర్‌లు నిర్మించుకుంటుంటే.. తాలిబన్ల రాజ్యంలో మహిళలు మధ్యయుగాలను తలపించే దీనస్థితిలో కూరుకుపోయారు.
శ్రీలంక సంక్షోభం(Economic Crisis in Srilanka)
శ్రీలంక చరిత్రలో 2022 (Srilanka Crisis 2022) సంవత్సరం అత్యంత క్లిష్టమైన దశగా నిలిచిపోయింది. ప్రభుత్వ విధానాలతో తలెత్తిన ఆర్థిక సంక్షోభం దేశాన్ని ఒక్కసారిగా తలకిందులు చేసింది. ప్రజలు తిండిగింజల కోసం అలమటించిపోయారు. ఆకాశాన్నంటిన ధరలు సామాన్యుల నడ్డి విరిచాయి. దేశం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. అన్నిటికీ కారణం .. రాజపక్స సోదరుల నేతృత్వంలో ప్రభుత్వం తీసుకున్న అపరిపక్వ ఆర్థిక నిర్ణయాలు. ప్రభుత్వం తీరుతో విసిగిపోయిన ప్రజలు చివరకు తిరుగుబాటు చేశారు. ప్రజాగ్రహాన్ని తట్టుకోలేక ప్రభుత్వ పెద్ద గొటాబయా రాజపక్స (Gotabaya Rajapaksa) దేశం నుంచి పారిపోయారు. శ్రీలంక సంక్షోభం ప్రపంచానికి ఎన్నో గుణపాఠాలు నేర్పింది. ప్రభుత్వాల అనాలోచిత నిర్ణయాలు ప్రజల జీవితాలను ఎలా అతలాకుతలం చేస్తాయో శ్రీలంక సంక్షోభంతో స్పష్టంగా తెలిసొచ్చింది.
ఇరాన్ మహిళల గర్జన(Anti Hijab Protests in Iran)
ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఘటనల్లో ముఖ్యమైనది ఇరాన్ మహిళల ఉద్యమం (Iran Anti Hijab Protests) . బహిరంగ ప్రదేశాల్లో మహిళలకు హిజాబ్ ధారణ తప్పనిసరి చేసిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు మునుపెన్నడూ చూడని స్థాయిలో కదనుతొక్కారు. హిజాబ్ ధరించని కారణంగా జైలు పాలైన ఓ యువతి కటకటాల మధ్యే అనూహ్యంగా మరణించడంతో ఇరాన్‌లో అగ్గిరాజుకుంది. దేశవ్యాప్తంగా మహిళల నిరసనలతో ఇరాన్ అట్టుడికిపోయింది. మహిళల ఆగ్రహం ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. నిరసనకారులను కట్టడి చేసేందుకు వారిపై పోలీసులు కాల్పులకు తెగబడటంతో ఇరాన్ ప్రభుత్వం ప్రపంచం ముందు దోషిగా నిలబడింది. సంప్రదాయాలు, కట్టుబాట్ల పేరిట మహిళలను అణగదొక్కడం ఇకపై ఎంతమాత్రం సాధ్యం కాదని చాటిచెప్పిన ఉదంతం ఇది.
అమెరికాలో స్త్రీ స్వేచ్ఛకు సంకెళ్లు..(Abortion Made Unconstitutional In USA)
వ్యక్తి స్వాతంత్ర్యానికి అమిత ప్రాధాన్యం ఇస్తామని గర్వంగా చెప్పుకునే అగ్రరాజ్యం అమెరికాలో స్త్రీ స్వేచ్ఛకు అనూహ్యంగా సంకెళ్లు పడ్డాయి. అబార్షన్‌లు (U.S. abortion fight 2022) రాజ్యాంగ విరుద్ధమంటూ అమెరికా సర్వోన్నత న్యాయస్థానం ఈ ఏడాది ఇచ్చిన తీర్పు అక్కడి మహిళల స్వేచ్ఛను హరించింది. అబార్షన్ మహిళల హక్కు అన్న 50 ఏళ్ల నాటి తీర్పును కొట్టేస్తూ సుప్రీం కోర్టు తాజాగా సంచలనం సృష్టించింది. దీంతో.. అబార్షన్‌లపై నిషేధం విధించే స్వేచ్ఛ రాష్ట్రాలకు దక్కింది. అనేక రాష్ట్రాలు ఇప్పటికే కఠిన నియంత్రణలకు తెరలేపాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో (America President Joe Biden) పాటూ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (Obama) కూడా ఈ తీర్పు పట్ల విచారం వ్యక్తం చేశారు. సుప్రీం తీర్పు అమెరికన్ల స్వేచ్ఛపై దాడిగా అభివర్ణించారు.
నాన్సీ పెలోసీ దూకుడుతో చైనాకు బ్రేకులు (Nancy Pelosi Visit to Taiwan)
విస్తరణ వాదంతో రెచ్చిపోతున్న చైనా..ఎన్నో ఏళ్లుగా తైవాన్‌ను టార్గెట్ (China vs Taiwan) చేస్తోంది. తైవాన్ తమదేనంటూ భీషణ గర్జనలు చేస్తోంది. తైవాన్ గగనతలంలోకి యుద్ధ విమానాలు పంపుతూ ఈ చిన్న దేశాన్ని హడలెత్తించేలా బలప్రదర్శనకు దిగుతోంది. కానీ..అమెరికా స్పీకర్ నాన్సీ పెలోసీ (Nancy Pelosi) ఈ ఏడాది చైనాకు గట్టిషాకే ఇచ్చారు. చైనా హెచ్చరికలను లెక్కచేయక తైవాన్‌లో పర్యటించిన ఆమె..కమ్యునిస్టు దేశాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదంటూ తైవాన్‌కు వెన్నుదన్నుగా నిలిచారు. ఢీ అంటే ఢీ అన్నట్టున్న అమెరికా చైనాల వైఖరి కారణంగా యుద్ధం తప్పదేమో అన్న సందేహాలు వ్యక్తమైన సమయమది. అమెరికా స్పీకర్ చేపట్టిన ఈ టూర్ అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది.
బ్రిటన్‌లో కీలక పరిణామాలు..(Key Events in Britain)
బ్రిటన్ చరిత్రలో 2022 కీలకమైన సంవత్సరంగా చెప్పుకోకతప్పదు. ఈ ఏడాది సెప్టెంబర్ 8న బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 (Elizabeth II Death) యావత్ దేశాన్ని శోకసంద్రంలోకి నెట్టి తిరిగిరాని లోకాలకు తరలిపోయారు. సుదీర్ఘకాలం పాటు బ్రిటన్‌కు రాణిగా సేవలందించిన క్వీన్ ఎలిజబెత్-2 బ్రిటన్ ప్రజలతో పాటూ యావత్ ప్రపంచంపై తనదైన ముద్ర వేశారు. బ్రిటన్ రాజరికవ్యవస్థ ఉనికే ప్రశ్నార్థకం కావచ్చన్న భయాల నడుమ రాణి ఎలిజబెత్-2 పెద్దదిక్కుగా నిలిచి రాజరికవ్యవస్థ పేరు ప్రఖ్యాతలను ఇనుమడింపజేశారు. ప్రజల మనసుల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్నారు.
ఇక భారత సంతతికి చెందిన రిషి సునాక్ (Rishi Sunak) అక్టోబర్‌లో బ్రిటన్ ప్రధానిగా పగ్గాలు చేపట్టి కొత్త చరిత్రను సృష్టించారు. ప్రధాని పగ్గాలు చేపట్టిన తొలి శ్వేతజాతీయేతరుడిగా, తొలి భారత సంతతి వ్యక్తిగా అరుదైన గుర్తింపు సొంతం చేసుకున్నారు. అంతకు కొద్ది నెలల మునుపే ప్రధాని పదవికి జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందిన రిషి రెండోమారు పోటీలో నెగ్గడంతో ఆయన విజయం చిరస్మరణీయమైంది. బ్రిటన్ ప్రధానిగా బోరిస్ జాన్సన్ రాజీనామా (Boris Johnson) తరువాత తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో రిషి (Rishi Sunak), లిజ్ ట్రస్ (Lizz Truss) పోటీపడగా.. లిజ్ ట్రస్ గెలుపొందారు. ప్రజాకర్షక ఆర్థికవిధానాల ఆధారంగా ఆమె విజయం సాధించారు. కానీ వాటి అమల్లో ఆమె చతికిలపడటంతో బ్రిటన్ ఆర్థికంగా తీవ్ర ఒడిదుడుకుల పాలు కావాల్సి వచ్చింది. చివరకు ఆమె రాజీనామా చేశారు. దీంతో..మరో మారు జరిగిన ఎన్నికల్లో రిషి అఖండ విజయం సాధించారు. ఆర్థికక్రమశిక్షణతో కూడిన తన విధానాలే దేశానికి శ్రేయస్కరమని బ్రిటన్ ప్రజలను ఒప్పించి ప్రధాని పీఠాన్ని అధిరోహించారు.
మళ్లీ మొదలైన కరోనా భయాలు..(Corona Outbreak In China)
దాదాపు రెండేళ్ల పాటు ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి (Corona Virus) ఈ ఏడాది కొద్దిగా శాంతించడంతో అంతర్జాతీయ వాణిజ్యం (International Trade) మళ్లీ పట్టాలెక్కింది. దీంతో.. భవిష్యత్తుకు ఢోకా లేదన్న భరోసా ప్రపంచ దేశాల్లో కనిపించింది. ఇలాంటి తరుణంలో చైనాలో మళ్లీ కరోనా (China Corona Virus Outbreak) విజృంభించడంతో ప్రపంచదేశాల్లో మళ్లీ కలవరం మొదలైంది. కరోనా తొలి దశలో మహమ్మారి కట్టడికి తోడ్పడ్డ ప్రభుత్వ విధానాలే ఈ పర్యాయం వైరస్ మళ్లీ ఊపిరిపోయడం గమనార్హం. వైరస్ కట్టడిలో చైనా రూపొందించిన కరోనా టీకాలు (Corona Vaccine) ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడం కూడా ఓ కారణమని పరిశీలకులు అంటున్నారు. అయితే.. ఇతర దేశాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం, ఇతర జాగ్రత్తల ద్వారా కరోనాకు ముకుతాడు పడింది. దీంతో.. మునుపటి వలె కరోనా ప్రపంచాన్ని వేధించబోదన్న భరోసాతో కొత్త సంవత్సరంలోకి కాలుపెడుతుండటం ఓ శుభసూచకం.
Updated Date - 2022-12-28T00:43:08+05:30 IST