Breaking News: ఆజంఖాన్‌పై అనర్హత వేటు

ABN , First Publish Date - 2022-10-28T20:12:37+05:30 IST

లక్నో: సమాజ్‌వాదీ పార్టీ దిగ్గజ నేత అజాం ఖాన్‌పై అనర్హత వేటు పడింది.

Breaking News: ఆజంఖాన్‌పై అనర్హత వేటు
Azam Khan

లక్నో: సమాజ్‌వాదీ పార్టీ దిగ్గజ నేత అజాం ఖాన్‌పై అనర్హత వేటు పడింది. ఎమ్మెల్యే పదవి నుంచి ఆయన్ను అనర్హుడిని చేస్తూ యూపీ అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. 2019 విద్వేష ప్రసంగం కేసులో ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష పడింది. రెండేళ్లకు మించి జైలు శిక్ష పడటంతో ఆయన ఎమ్మెల్యే హోదాను కోల్పోయారు.

ఒక ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ క్రిమినల్ కేసులో దోషిగా తేలి, కనిష్టంగా రెండేళ్లు జైలు శిక్ష పడితే, తక్షణం అమె లేదా అతడు సభా సభ్యత్వాన్ని కోల్పోతారని 2013లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆ ప్రకారం మూడేళ్ల జైలుశిక్ష ఆధారంగా అజాంఖాన్‌పై తాజా వేటు పడింది.

2019 లోక్‌సభ ఎన్నికల్లో రాంపూర్ నుంచి అజాంఖాన్ గెలిచారు. అయితే 2022 మార్చిలో యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తన సీటును ఆయన వదులుకున్నారు. సీతాపూర్ జైలులో ఉంటూనే ఆయన 2022 అసెంబ్లీ ఎన్నికల్లో రాంపూర్ నుంచి గెలిచారు.

మరోవైపు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు వ్యతిరేకంగా విద్వేష ప్రసంగం చేశారనే కారణంగా అజాంఖాన్, మరో ఇద్దరికి మూడేళ్ల చొప్పున కోర్టు జైలుశిక్ష, రూ.2000 జరిమానా విధించింది. అయితే, ఆయనకు బెయిల్ మంజూరు చేసి, తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు వారం రోజులు సమయం ఇచ్చింది. ఇంతకుముందు, మోసం కేసులో తాత్కాలిక బెయిల్ మంజూరు చేయడంతో సీతాపూర్ జిల్లా జైలు నుంచి ఆయన విడుదలయ్యారు.

Updated Date - 2022-10-28T20:12:40+05:30 IST