Jammu and Kashmir : హిందువులకు రక్షణ లేదు : కశ్మీరీ పండిట్లు

ABN , First Publish Date - 2022-10-16T21:36:34+05:30 IST

జమ్మూ-కశ్మీరులో హిందువులకు రక్షణ లేదని కశ్మీరీ పండిట్లు

Jammu and Kashmir : హిందువులకు రక్షణ లేదు : కశ్మీరీ పండిట్లు

జమ్మూ : జమ్మూ-కశ్మీరులో హిందువులకు రక్షణ లేదని కశ్మీరీ పండిట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇరుగు పొరుగున ఉండే ముస్లింలు సైతం తమకు రక్షణ కల్పించలేమని చెప్తున్నారని ఆందోళన చెందుతున్నారు. ఉగ్రవాదులు హిందువులను లక్ష్యంగా చేసుకుని చంపుతుండటం హేయమని చెప్తున్నారు. పురాణ్ కృషన్ భట్‌ను ఉగ్రవాదులు హత్య చేయడంతో హిందువులు మరింత భయాందోళనలకు గురవుతున్నారు. 


పురాణ్ కృషన్ భట్ (56)ను ఉగ్రవాదులు షోపియాన్ జిల్లాలో హత్య చేశారు. ఈ హత్యకు తమదే బాధ్యత అని కశ్మీర్ ఫ్రీడం ఫైటర్స్ అనే ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. భవిష్యత్తులో మరిన్ని హత్యలు జరుగుతాయని హెచ్చరించింది. భట్ అంత్యక్రియలు శనివారం జమ్మూలో జరిగాయి. ఆయనకు భార్య, ఓ కుమార్తె, ఓ కుమారుడు ఉన్నారు. కుమార్తె ఐదో తరగతి, కుమారుడు ఏడో తరగతి చదువుతున్నారు. ఆయన షోపియాన్‌లోని తన పూర్వీకుల భూమిలో ఆపిల్ తోటను పెంచుతున్నారు. ఆపిల్ పండ్ల అమ్మకం ద్వారా వచ్చే సొమ్ముతో తన పిల్లలను చదివించుకోవాలని ఆయన చెప్తూ ఉండేవారు. 


భట్ అంత్యక్రియల సందర్భంగా హిందువులు పెద్ద ఎత్తున పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కశ్మీరులో మైనారిటీలుగా ఉన్న హిందువులను లక్ష్యంగా చేసుకుని చంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


భట్ సోదరి నీలం మీడియాతో మాట్లాడుతూ, కశ్మీరు లోయలో హిందువులకు రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ పాఠశాలలో ముగ్గురు హిందూ టీచర్లు పని చేస్తున్నట్లు తెలుసుకుని ఉగ్రవాదులు ఇటీవల ఆ పాఠశాలకు వెళ్ళారని, ఆ హిందూ టీచర్ల కోసం వెతికారని చెప్పారు. అదృష్టవశాత్తూ ఆ టీచర్లు ఆ రోజు పాఠశాలలో లేరని చెప్పారు. కశ్మీరు లోయ నుంచి హిందువులంతా వెళ్ళిపోవాలని తాను సలహా ఇస్తున్నానని తెలిపారు. ఉగ్రవాదులు కశ్మీరీ పండిట్లందరినీ చంపేస్తారన్నారు. 


కశ్మీరులో ఉన్న తన సోదరుడు భట్‌తో తాను శుక్రవారం మాట్లాడానని, ఆయన తీవ్ర ఆందోళనతో, అభద్రతా భావంతో ఉన్నారని తెలిపారు. లోయ నుంచి వచ్చేయాలని తాను చెప్పానని, ఆయన అంగీకరించలేదని చెప్పారు. ఆపిల్ పండ్లను అమ్మి, పిల్లల చదువు కోసం డబ్బు సమకూర్చుకుంటానని చెప్పారని తెలిపారు. హిందువులను చంపడానికి అవకాశం కోసం ఉగ్రవాదులు చూస్తున్నారన్నారు. కశ్మీరీ పండిట్లకు రక్షణ కల్పించాలని, భట్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. 


పురాణ్ కృషన్ భట్‌ శనివారం చౌదరి గుండ్ ప్రాంతంలో ఉన్న ఆపిల్ తోటకు వెళ్తుండగా ఆయనపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆయనను వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. 


Updated Date - 2022-10-16T21:36:34+05:30 IST