అభిరుచి కలిగిన నిర్మాత మురారి

ABN , First Publish Date - 2022-10-17T13:50:33+05:30 IST

తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన సీనియర్‌ నిర్మాత కాట్రగడ్డ మురారి (కె.మురారి) మృతిపై నగరానికి చెందిన పలువురు తెలుగు ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని

అభిరుచి కలిగిన నిర్మాత మురారి

తెలుగు ప్రముఖుల సంతాపం 

ముగిసిన అంత్యక్రియల

చెన్నై/అడయార్‌: తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన సీనియర్‌ నిర్మాత కాట్రగడ్డ మురారి (కె.మురారి) మృతిపై నగరానికి చెందిన పలువురు తెలుగు ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఈ సందర్భంగా మురారితో తమకున్న స్నేహ సంబంధాలు, పరిచయాన్ని వారు నెమరు వేసుకున్నారు. ముక్కుసూటి మనిషి, మంచి అభిరుచి కలిగిన నిర్మాత అంటూ వారు తమ సంతాప సందేశాల్లో పేర్కొన్నారు. శనివారం రాత్రి నీలాంగరైలోని తన నివాసంలోనే ఆయన కన్నుమూయగా, అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం బీసెంట్‌ నగర్‌ విద్యుత్‌ దహనవాటిలో ఆయన కుమారుడు కార్తీక్‌  నిర్వహించారు.  


అభిరుచి ఉన్న నిర్మాత... 

‘మంచి మనిషి. నా నిర్మాత కూడా. ఆయన నిర్మించిన ‘నారి నారి నడుమ మురారి’ చిత్రంలో నేను నటించాను. మంచి టేస్ట్‌ ఉన్న నిర్మాత. అలాంటి వ్యక్తి ఇకలేరన్న వార్త నిజంగానే షాక్‌కు గురిచేసింది. ఒక మంచి మనిషిని కోల్పోయాను’ అని సినీ నటి శారద తన సంతాపాన్ని తెలిపారు. 


చిత్ర సీమకు తీరని లోటు..

‘ఎన్నో ఉత్తమ చిత్రాలను నిర్మించిన సీనియర్‌ నిర్మాత కె.మురారి మరణం చిత్ర సీమకు తీరని లోటు’ అని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి (ఆంధ్రప్రదేశ్‌) అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌ రెడ్డి పేర్కొన్నారు. 


ముక్కుసూటి మనిషి... 

‘కె.మురారి ముక్కుసూటి మనిషి. ఏ విషయాన్నైనా నిర్భయంగా కుండబద్ధలుకొట్టినట్టుగా చెప్పే వ్యక్తి. ఈ కారణంగా చిత్ర పరిశ్రమలో అనేక మంది మిత్రులు దూరమయ్యారు. మరికొందరిని కోల్పోయారు. మంచి అభిరుచి కలిగిన నిర్మాత. ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. ఈ సంస్థ కార్యక్రమాలను ఎంతగానే ఇష్టపడేవారు’ అని అఖిల భారత తెలుగు సమాఖ్య అధ్యక్షుడు డాక్టర్‌ సీఎంకే రెడ్డి విడుదల చేసిన సంతాప సందేశంలో పేర్కొన్నారు. 


నమ్మిన విలువలకు కట్టుబడిన నిర్మాత... 

‘నిర్మాత మురారి ఇకలేరన్న వార్త నన్ను ఎంతో మనో వేదనకు గురిచేసింది. అనేక మంది అగ్రహీరోలు, అగ్ర దర్శకులతో కలిసి ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఆదర్శమంతమైన నిర్మాత. చిత్ర పరిశ్రమలో తాను నమ్మిన సిద్ధాంతాలు, విలువలు కొరవడ్డాయని కలత చెంది సినిమాలు తీయడం మానేసిన వ్యక్తి. చిత్ర పరిశ్రమ మొత్తం హైదరాబాద్‌ తరలి వెళ్ళినా తనకు కొత్త జీవితాన్ని ప్రసాదించిన చెన్నైలోనే ఆయన స్థిరపడిపోయారు. అలాంటి గొప్ప వ్యక్తి అకాల మరణానికి సంతాపం వ్యక్తం చేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’ అని ద్రావిడ దేశం అధ్యక్షుడు వి.కృష్ణారావు పేర్కొన్నారు. అలాగే, ఆస్కా అధ్యక్షుడు డాక్టర్‌ కె.సుబ్బారెడ్డి, ఆస్కా మాజీ అధ్యక్షుడు ఎం.ఆదిశేషయ్య, అన్నాడీఎంకే యువజన విభాగం సంయుక్త కార్యదర్శి డాక్టర్‌ సునీల్‌ తదితరులు తమతమ సంతాపాలను తెలుపుతూ వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశారు. 

Updated Date - 2022-10-17T13:50:33+05:30 IST