పవర్‌స్టార్ పునీత్‌కు మరణానంతరం డాక్టరేట్
ABN , First Publish Date - 2022-03-23T19:18:26+05:30 IST
పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌కు మరణానంతరం లభించిన గౌరవ డాక్టరేట్‌ను ఆయన సతీమణి అశ్విని మంగళవారం అందుకున్నారు. మైసూరు విశ్వవిద్యాలయ 112వ

- స్వీకరించిన సతీమణి అశ్విని
బెంగళూరు: పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌కు మరణానంతరం లభించిన గౌరవ డాక్టరేట్‌ను ఆయన సతీమణి అశ్విని మంగళవారం అందుకున్నారు. మైసూరు విశ్వవిద్యాలయ 112వ స్నాతకోత్సవంలో భాగంగా ముగ్గురు సాధకులకు గౌరవ డాక్టరేట్లను గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ప్రదానం చేశారు. డాక్టరేట్ స్వీకరించిన అనంతరం అశ్విని తన భర్త పునీత్‌ను స్మరించుకుని కన్నీటి పర్యంతమయ్యారు. 1976లో కన్నడ కంఠీరవుడు డాక్టర్ రాజ్‌కుమార్‌కు మైసూరు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను అందచేసి గౌరవించింది. అనంతరం ఇప్పుడు ఆయన కుమారుడు పునీత్‌కు కూడా గౌరవ డాక్టరేట్‌ను మరణానంతరం ప్రకటించింది. స్నాతకోత్సవానికి రాజ్‌కుమార్ కుటుంబసభ్యులంతా హాజరయ్యారు. కాగా పునీత్‌రాజ్‌కుమార్, పార్వతమ్మ రాజ్‌కుమార్‌ల పేరిట రెండు బంగారు పతకాలను ఇవ్వాలని పవర్‌స్టార్ పునీత్ సతీమణి అశ్విని మైసూరు విశ్వవిద్యాలయానికి సూచించారు. ఇందుకయ్యే ఖర్చును తాము అందచేస్తామన్నారు. పునీత్ పేరిట ఆర్ట్స్‌లోనూ, పార్వతమ్మ రాజ్‌కుమార్ పేరిట బిజినెస్ మేనేజ్‌మెంట్‌లోనూ అత్యధిక మార్కులు సాధించినవారికి బంగారు పతకాలు ఇవ్వనున్నారు.