ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

PV Narasimha Rao: అయోధ్యలో రామాలయాన్ని కట్టేందుకు అప్పట్లోనే పీవీ సన్నాహాలు.. తెరవెనుక ఏం జరిగిందంటే..!

ABN, First Publish Date - 2022-12-23T15:13:53+05:30

అయోధ్యలో రామమందిరం కట్టాలని ప్రధానిగా ఉన్నప్పుడు పీవీ నరసింహారావు భావించారా? అవును! శ్రీరాముడు కాషాయిపార్టీల గుత్తసొత్తు కాడని, అయోధ్యలో రామ మందిర నిర్మాణం తన హయంలో జరగాలని ఆయన ఆశించారట.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

(ఈ రోజు పీవీ వర్ధంతి)

అయోధ్యలో రామమందిరం కట్టాలని ప్రధానిగా ఉన్నప్పుడు పీవీ నరసింహారావు భావించారా? అవును! శ్రీరాముడు కాషాయిపార్టీల గుత్తసొత్తు కాడని, అయోధ్యలో రామ మందిర నిర్మాణం తన హయంలో జరగాలని ఆయన ఆశించారట. పీవీకి అత్యంత సన్నిహితులైన ఐయ్యేఎస్ అధికారి, అప్పటి మీడియా సలహాదారు, ప్రధాని అదనపు కార్యదర్శి పత్రి వేంకట రామకృష్ణ ప్రసాద్ (పీవీఆర్కె ప్రసాద్) రచించిన పుస్తకం 'అసలేం జరిగిందంటే...(ఇంగ్లీషులో 'Wheels Behind the Veil - Pms, Cms and Beyond')'లో ఈ వివరాలు ఉన్నాయి.

'అయోధ్యలో రామాలయం కట్టాలని వాళ్లు (కాషాయం పార్టీ) చిందులు తొక్కుతున్నారు. రాముడేమైనా వాళ్ల గుత్తసొత్తా?' అని ప్రధాని (పీవీ) వాపోయినప్పుడు తాను కూడా ఆయనతో పాటు ఆందోళన పడ్డానని పీవీఆర్కే రాసుకొచ్చారు ఆ పుస్తకంలో.

'మనమే రామాలయం కడదాం...’

'మనమే రామాలయం కడదాం. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి మనం వ్యతిరేకం అని కదా వాళ్లు చేస్తున్న దుష్ప్రచారం. దాన్ని తిప్పికొడుతూ మనమే రామాలయం నిర్మిద్దాం..." అన్నారట పీవీ. కానీ, ఆ నిర్మాణంలో తన, లేదా ఏ ఇతర రాజకీయ నాయకుల ప్రత్యక్ష ప్రమేయం లేకుండా వేరే మార్గాంతరం చూద్దామని సూచించిన పీవీ దార్శనిక యుక్తికి ఎంతో పొంగిపోయానని ఆయన తన పుస్తకంలో స్పష్టంగా రాశారు. ఆ పుస్తకంలో వివరాల ప్రకారం, రాజకీయాలతో సంబంధం లేని ఒక ట్రస్టు ఆధ్వర్యంలో అయోధ్యలో రామమందిర నిర్మాణం జరగాలని పీవీ ఒక నిర్దిష్టమైన ప్రణాళిక సిద్ధం చేశారు. శ్రీ భారతీతీర్థస్వామి వారు చైర్మన్ గా ఆ ట్రస్టు ఉంటుంది కాబట్టి దేశంలోని సర్వ హిందూ మత విభాగాల సమ్మతి దానికి లభిస్తుందన్నది ఆ ప్రణాళికలో కీలకాంశం.

1992 ప్రారంభంలో జరిగిన ఓ సంభాషణలో భాగంగా - 'అసలేం జరిగింది...' లో వివరించారు పీవీఆర్కే: "ప్రధాని పీవీ స్వగతంగా మాట్లాడుకుంటున్నట్టు అనిపించింది. నా ఉనికిని గమనించారా లేదా అని గుర్తించడానికి గొంతు సవరించుకున్నాను."

దేశంలోని ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత పీఠాలు, శంకరమఠాలు, ఆంధ్రాతమిళ జీయర్లు... జియ్యంగార్లు... అందరినీ ఆ ట్రస్టులో భాగం చేయాలని పీవీ పథకం. అయితే, ఆ ట్రస్టులో చేరవద్దని ఆయా పీఠాధిపతుల మీద బీజేపీ, వీహెచ్పీ కచ్చితంగా ఒత్తిడి తెస్తాయోమోనని తాను సందేహపడ్డానని చెప్పారు పీఆర్కే. పీవీ కూడా తన అనుమానాన్ని బలపరుస్తూ, మొత్తం తెర వెనక జరగాలనీ, ప్రతి పీఠాధిపతితో విడివిడిగా మాట్లాడి, ఈ రామమందిర నిర్మాణానికి వారంతట వారే పూనుకున్నట్టు అభిప్రాయం కలిగేలా పథకం సిద్ధం చేద్దామని అన్నారట.

ఇంకా కోర్టులో పెండింగ్ ఉన్న కేసు గురించి, ఇంకా అనేక విషయాలెన్నో మాట్లాడుకున్నాక, తమ పన్నాగం అమలు పరిచే బాధ్యత తనకే పీవీ అప్పగించడం తన అదృష్టమని అంటారు పీవీఆర్కే. తనకి దక్షిణాది పీఠాధిపతులతో మంచి పరిచయాలు ఉన్నా, ఉత్తరాది వాళ్లు తెలియదని తాను అంటే, దానికి బీహార్ కి చెందిన ఒక డీఐజీ ర్యాకు పోలీసాధికారి ఈ విషయంలో సాయపడతాడని పీవీ హామీ ఇచ్చారట. అయితే, ఈ మొత్తం వ్యవహారంలో వారి (పీవీ- పీవీఆర్కే) పాత్ర కేవలం ఉత్ర్పేరకంలా తెర వెనకకే పరిమితమౌతుందని పీవీ అన్నట్టు రాశారు పీవీఆర్కే తన పుస్తకంలో.

ముందస్తు హెచ్చరికలు పెడచెవిన పెట్టారా?

1992 డిసెంబర్ 6న జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేత దురాగతాన్ని గురించి ముందుగానే అందిన హెచ్చరికల్ని ఉద్దేశపూర్వకంగానే ప్రధాని పీవీ పెడచెవిన పెట్టారా? బాబ్రీ మసీదుని కూల్చిన నింద కాషాయం పార్టీల మీద పడాలని, అక్కడ రామమందిరం కట్టిన ఖ్యాతి తమకి దక్కాలనీ పీవీ ఆలోచించారా? బాబ్రీ దుర్ఘటనకి ముందే తాము పీవీని కలిసి అప్రమత్తం చేశామని మాజీ ప్రధానులు వీపీ సింగ్, చంద్రశేఖర్ అప్పట్లో చెప్పారు . బాబ్రీ మసీదుని కూల్చాలన్న కుట్ర జరిగినట్టు తనకి పక్కా సమాచారం ఉందని మూడునాలుగు రోజుల ముందే ఫోన్ ద్వారా పీవీని హెచ్చరించానని అప్పట్లోనే స్పష్టం చేశారు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతిబసు. బాబ్రీ మసీదు వివాదం, కరసేవకుల కరాళ హేల వంటి అంశాలపై ప్రధానిగా పీవీ నిర్లక్ష్యంగా వ్యవహారించిన తీరు, సాచివేత గురించి జర్నలిస్టు కుల్దీప్ నయ్యర్ వ్యాసాలు, kaaMgres sIniyar nAyakuDu అర్జున్ సింగ్ ల ఆరోపణలు ఒట్టి అభాండాలుగా కొట్టివేయబడొచ్చు.

అవన్నీ గిట్టని వాళ్ళు చేసిన ఆరోపణలు, వేసిన నిందలు అనుకున్నా, అప్పటి కేంద్ర హోమ్ సెక్రెటరీ మాధవ్ గాడ్బోలె కూడా ప్రధాని పీవీ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపారు. 1992 డిసెంబర్ 6న జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేత దురాగతాన్ని ముందే ఊహించి కేంద్రప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారు గాడ్బోలె. ఆగంతుక దురాగతాన్ని నివారించడానికి పకడ్బందీ contingency plan ని ప్రధాని పీవీ నరసింహరావు, హోమ్ మంత్రి చవాన్, కేబినేట్ సెక్రెటరి... ఇంకా ముఖ్యమైన బ్యూరోక్రాట్లకి పంపారాయన. ముందస్తుగా ఆయన హెచ్చరికల్ని ఉద్దేశపూర్వకంగానే పెడచెవిన పెట్టారని తేలిపోవడంతో మనస్తాపం పడతారు గాడ్బోలె. మరో ఏడాదిన్నర పదవీకాలం ఉండగానే మార్చి 1993న ఆయన సర్వీసు నుంచి తప్పుకుంటారు. ఇదంతా తన రచన - 'Unfinished Innings: Recollections and Reflections of a Civil Servant' పుస్తకంలో రికార్డు చేశారు గాడ్బోలె (దాని కొనసాగింపుగా 'The Babri Masjid -Ram Mandir Dilemma (An Acid Test for India's Constitution)' అనే మరో పుస్తకం కూడా ఆయన రాశారు 2019లో).

"కూల్చబడిన బాబ్రీమసీదు వివాదాస్పద స్థలాన్ని స్వాధీనం చేసుకోవడానికి, అక్కడ రామ్ లల్లా ఆలయంలో దర్శనానికి అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో శాంతిభద్రతల పరిస్థితులు సమీక్షించడానికీ 29 డిసెంబర్, 1992న అయోధ్య వెళ్లాను. ఢిల్లీ నుంచి వచ్చిన సందర్శకులు సహజంగా ఆ ఆలయంలో పూజలు చేసి, ప్రసాదాలు స్వీకరిస్తారు. కానీ, నేను అప్పుడైతే ఏ పూజా చేయలేదు, ప్రసాదం తీసుకోలేదు. నేను రామభక్తుడ్నే అయినా, మతం అనేది ఎవరికైనా వ్యక్తిగతమైన వ్యవహారం అనే నమ్ముతాను బలంగా. ఏ కోణంలో అయినా అయోధ్య మీద ఎవరికీ తీసిపోని అవగాహన నాది; అందుకే మోసం, దగా, అడ్డూఆపులేని హింస పునాదిగా లేచిన గుడిలో ఏ దేవుడూ ఉండడని మాత్రం కచ్చితంగా నమ్ముతాను."

- అది ఆయన 'Unfinished Innings' లో ఒక పేరా.

బాబ్రీ శిధిలాలే స్వప్రయోజన భవన పునాదులా?

బాబ్రీ మసీదుని కూల్చిన నేరం బీజేపీ తదితర కాషాయం మూక మీదకి పోతే, అక్కడ తన పథకం ప్రకారం ట్రస్టు ద్వారా రామాలయం కట్టిస్తే వచ్చే రాజకీయప్రయోజనం నెరవేరడంతో పాటు, తన రామభక్తి కూడా నిలుస్తుందనే దూరాలోచన (దురాలోచన?)తోనే బాబ్రీ మసీదుకి డిసెంబర్ 6- 1992 న ముఖం తిప్పుకొని పీవీ ఏమరుపాటు అభినయించారని అభియోగాల సారాంశం.

మాధవ్ గాడ్బోలె - పీవీ మధ్య వ్యత్యాసం గురించి మాట్లాడాల్సివస్తే- గాడ్బోలె కేవలం ఒక సీనియర్ ఐయ్యేఎస్ అధికారి; కానీ, పీవీ నరసింహారావు బహుభాషాకోవిదులు, బహుముఖప్రజ్ఞాశాలి, స్వయానా రచయిత, అనువాదకుడు, పాత్రికేయుడు కూడా. ఒక చారిత్రక కట్టడం ఉనికికి చేటు వచ్చినప్పుడు, ఒక ప్రభుత్వాధికారి తన వ్యక్తిగత విశ్వాసాలకి అతీతంగా దాన్ని రక్షించాలని తాపత్రయపడితే, ఒక జాతినాయకుడు, సాంస్కృతిక ప్రతినిధి, సాహితీవేత్త ఆ చారిత్రక కట్టడం శిధిలాల మీద తన స్వప్రయోజనాల భవంతి నిర్మించుకోవాలని అనుకున్నారు; అది కదా మహావిషాదం - అని విశ్లేషకులు వ్యాఖ్యనించారు.

కానీ, ఈ ఆరోపణల్ని పీవీఆర్కే ప్రసాద్ తన పుస్తకంలో, ఇంకా పలు సందర్భాల్లో కూడా ఖండించారు. బాబ్రీని పరిరక్షిస్తామని లిఖితపూర్వకంగా హామీ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సుప్రీం కోర్టుకు అందిందనీ, అలా సుప్రీం కోర్టుకు హామీ ఇచ్చినప్పటికీ కేంద్రప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించిందన్న అపవాదును ఎదుర్కొవడం ఇష్టం లేక, రాజ్యాంగానికి కట్టుబడి పీవీ వెనకడుగు వేశారని అంటారు పీవీఆర్కే.

బాబ్రీ వివాదం మీద 'అయోధ్య: 6 డిసెంబర్ 1992' ('Ayodhya: 6 Decmber 1992') పేరిట పీవీ రాసిన పుస్తకంలో ఆయన తన నిర్దోషిత్వాన్ని వాదించుకున్నారు. అయితే, 'అయోధ్య' పుస్తకాన్ని దాని ప్రచురణ విషయంలో పీవీ పెట్టిన నిబంధన మేరకు ఆయన చనిపోయిన (23 డిసెంబర్, 2004) తర్వాతనే (ఆగస్టు 2006లో) పెంగ్విన్ పబ్లిషర్స్ ప్రచురించింది.

Updated Date - 2022-12-23T15:15:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising