Google Doodle: మీరు వీడియో గేమ్స్ ఆడతారా..? మరి ఈ చరిత్ర గురించి తెలిస్తే..
ABN , First Publish Date - 2022-12-01T19:14:08+05:30 IST
గేమింగ్ కన్సోల్ రూపకర్త జెర్రీ లాసన్‌కు ఓ డూడుల్‌తో నివాళులు అర్పించిన గూగుల్
ఇంటర్నెట్ డెస్క్: వీడియో గేమ్స్ అంటే ఇప్పటివారికి ముందుగా గుర్తొచ్చేది మొబైల్ వీడియో గేమ్స్! కానీ.. ఓ మూడు నాలుగు దశాబ్దాల క్రితం వీడియో గేమ్స్ సెటప్ అంటే.. టీవీకి అనుసంధానించేందుకు ఓ గేమింగ్ కన్సోల్.. అందులో అమర్చేందుకు ఆడియో క్యాసెట్ ఆకారంలో ఉండే ఓ గేమింగ్ క్యాట్రిడ్జ్(Gaming Catridge)! మారియో వంటి వీడియో గేమ్స్ ఆడినవారికి ఇది గుర్తుండే ఉంటుంది. ఆయితే గేమింగ్ రంగం తొలినాళ్లల్లో.. క్యాట్రిడ్జ్‌లను కనిపెట్టి వీడియో గేమ్స్ ఇంటింటికీ చేరేలా చేసిన ఘనత మాత్రం అమెరికాకు చెందిన ఎలక్ట్రానిక్ ఇంజినీర్ ‘జెర్రీ’ లాసన్‌కు(జెరాల్డ్ ఏ లాసన్- Gerald A Lawson) మాత్రమే దక్కుతుంది. డిసెంబర్ 1న ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని గూగుల్ ఓ డూడుల్(Google Doodle) రూపొందించింది. మారియో గేమ్‌ను తలపించేలా జెర్రీ జీవిత విశేషాలతో రూపొందించిన డూడుల్ ప్రస్తుతం ఎందరికో తమ బాల్యాన్ని గుర్తుకు తెస్తోంది. శ్వేతజాతీయుల ఆధిపత్యం ఉన్న ఈ రంగంలో ఓ నల్లజాతీయుడైన లాసన్.. ఓ కొత్త యుగానికి నాంది పలికారు.
న్యూయార్క్‌లోని బ్రూక్లిన్ నగరంలో 1940 డిసెంబర్ 1న జన్మించిన జెర్రీ లాసన్‌కు చిన్నతనం నుంచే ఎలక్ట్రానిక్ వస్తువుల పట్ల ఆసక్తి ఉండేది. బాల్యంలోనే ఆయన..సమీప మార్కెట్లో దొరికిన సెకెండ్ హ్యాండ్ విడిభాగాలతో ఓ రేడియోను రూపొందించారు. ఇక డిగ్రీ విద్య పూర్తైన అనంతరం ఆయన 1970లో కాలిఫోర్నియాకు(California) మకాం మార్చారు. ఫెయిర్‌చైల్డ్ సెమీకండక్టర్(Fair child Semiconductor) అనే సంస్థలో అప్లికేషన్స్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్‌గా చేరారు. 1980లో జెర్రీ వీడియోసాఫ్ట్(Videosoft) పేరిట ఓ సంస్థను నెలకొల్పారు. అప్పట్లో విపరీతంగా పాపులర్ అయిన వీడియో గేమ్ కన్సోల్ ‘అటారీ 2600’కి(Atari 2600) కావాల్సిన సాఫ్ట్‌వేర్‌ను వీడియోసాఫ్ట్ సంస్థ రూపొందించింది. అంతేకాకుండా.. జెర్రీ తన బృందంతో కలిసి తయారు చేసిన క్యాట్రిడ్జ్‌లు అటారీ కారణంగా విస్తృత ప్రాచుర్యం పొందాయి. క్యాట్రిడ్జ్ ద్వారా వీడియో గేమ్స్ ఆడటం సులభం కావడంతో.. వీడియో గేమ్స్ ప్రాచుర్యం బాగా పెరిగిపోయింది. దీంతో.. ఈ రంగంలో నిష్ణాతుడిగా లాసస్ పేరు ప్రఖ్యాతులు మారుమోగిపోయాయి. ఆ తరువాతి కాలంలో లాసన్ అనేక వీడియో గేమ్స్ సంస్థలకు కన్సల్టెంట్‌గా వ్యవహరించారు.
వీడియో గేమ్స్ రంగం అభివృద్ధికి పాటుపడ్డ లాసన్ ఈ రంగానికే ఓ మార్గదర్శి అని ఇంటర్నేషనల్ గేమ్ డెవలపర్స్ అసోసియేషన్ 2011లో ఆయన్ను కొనియాడింది. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా.. జెర్రీ లాసన్ పేరిట ఓ నిధిని కూడా ఏర్పాటు చేసింది. కంప్యూటర్ ఇంజినీరింగ్, గేమ్ డిజైన్ రంగాల్లో అల్పసంఖ్యాక వర్గాల ప్రాతినిథ్యం పెంచేలా విద్యార్థులకు ఈ ఫండ్ ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నారు. న్యూయార్క్ రాష్ట్రంలోని రోచెస్టర్ నగరంలోగల వరల్డ్ వీడియో గేమ్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో జెర్రీ లాసన్ సాధించిన విజయాలను ప్రదర్శనకు ఉంచారు.