YS Sharmila : మోసం చేయడం కేసీఆర్ నైజం
ABN , First Publish Date - 2022-11-23T03:53:05+05:30 IST
మోసం చేయడం సీఎం కేసీఆర్ నైజమని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు.

పోడు పట్టాలు ఇచ్చేందుకు కుర్చీ దొరకలేదా?: షర్మిల
కృష్ణకాలనీ (భూపాలపల్లి), నవంబరు 22: మోసం చేయడం సీఎం కేసీఆర్ నైజమని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఆయన ద్వారా మోసపోని సామాజిక వర్గంటూ ఏదీ లేదన్నారు. ప్రజా ప్రస్థానం పాదయాత్ర జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రెండో రోజు మంగళవారం కూడా కొనసాగింది. ఈ సందర్భంగా షర్మిల విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భూపాలపల్లి జిల్లాలో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయని, అయినా పరిశ్రమలు నెలకొల్పేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందని ప్రశ్నించారు. తెలంగాణ సిద్ధించినా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య సమసిపోలేదన్నారు. కళ్లముందు రెండు లక్షల ఉద్యోగాలు కనిపిస్తున్నా వాటిని ప్రభుత్వం భర్తీ చేయడం లేదని మండిపడ్డారు. ఒకప్పుడు స్కూటరుపై తిరిగిన కేసీఆర్ ఇప్పుడు జాతీయస్థాయి పార్టీ పెట్టే స్థాయికి ఎలా ఎదిగారని, ఆ పార్టీకి రూ.860 కోట్లు ఎక్కడివని ప్రశ్నించారు. తెలంగాణ సాధనతో ఒక్క కేసీఆర్ కుటుంబమే లాభపడిందన్నారు.
కుర్చీ వేసుకొని పోడు రైతులకు పట్టాలు ఇస్తామని ప్రగల్బాలు పలికిన ఆయన ఎందుకు తాత్సారం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆయనకు కుర్చీ దొరకడం లేదా? అని వ్యాఖ్యానించారు. ఈ జిల్లాలో ఒక్క ఎకరాకు కూడా నీరివ్వలేదన్నారు. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి భూపాలపల్లిలో వేల ఎకరాలకు పట్టాలు ఇచ్చారని గుర్తుచేశారు. ఈ జిల్లాలోని గణపురం మండలం చెల్పూరులో 1100 మెగావాట్ల కేటీపీపీ ప్లాంటు ఏర్పాటు చేసిన ఘనత వైఎస్సార్‌దేనన్నారు. రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కేసీఆర్ అమలు చేయడం లేదన్నారు. నిరుద్యోగులకు భృతి, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ లేదని, రైతులకు రుణమాఫీ కాలేదన్నారు.