వంద కోట్ల స్థలం ప్రభుత్వానిదే
ABN , First Publish Date - 2022-04-20T16:17:33+05:30 IST
బంజారాహిల్స్‌లోని వంద కోట్ల స్థలం కబ్జా వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. ఈ స్థలం ముమ్మాటికీ ప్రభుత్వానికి చెందినదే

ప్రైవేట్ వ్యక్తులకు సంబంధంలేదు
ఆర్డీవో, తహసీల్దార్ వెల్లడి
హైదరాబాద్/బంజారాహిల్స్: బంజారాహిల్స్‌లోని వంద కోట్ల స్థలం కబ్జా వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. ఈ స్థలం ముమ్మాటికీ ప్రభుత్వానికి చెందినదే అని, ప్రైవేటు వ్యక్తులకు ఎటువంటి సంబంధం లేదని రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 10 సర్వే నెంబరు 403లోని వంద కోట్ల స్థలం కబ్జా వ్యవహారం వెలుగులోకి రావడంతో సికింద్రాబాద్ ఆర్డీవో వసంతకుమారి, షేక్‌పేట తహసీల్దార్ శ్రీనివా్‌సరెడ్డి మంగళవారం స్థలాన్ని సందర్శించారు. ఏపీ జెమ్స్ అండ్ జువెలరీ పార్కు నిమిత్తం జరిగిన నిర్మాణాలను పరిశీలించారు. అక్కడే ఉన్న వివాదాస్పద స్థలాన్ని కూడా పరిశీలించారు. ఆ స్థలం ప్రభుత్వానిదేనని నిర్ధారించారు. పూర్తి స్థాయి నివేదికను సిద్ధం చేసి కలెక్టర్‌కు పంపిస్తామని అధికారులు తెలిపారు.
2005లో ఏపీ జెమ్స్‌కు అప్పగింత..
బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 10 సర్వే నెంబరు 403లో 2.05 గుంటల ప్రభుత్వ స్థలాన్ని అప్పటి సర్కార్ ఏపీ జెమ్స్ అండ్ జువెలరీ పార్కు నిమిత్తం కేటాయించింది. అప్పటి ఏపీ ట్రేడింగ్ కార్పొరేషన్, ఐఓఐిసీ ప్రాజెక్ట్ సంయుక్తంగా ఇక్కడ బంగారు అభరణాల విక్రయ కేంద్రాలను నెలకొల్పడానికి వీలుగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించేలా ఒప్పందం కుదిరింది. ఈ రెండు సంస్థలు కలిసి స్థలం కేటాయించిన రెండేళ్లలోనే బహుళ అంతస్తుల నిర్మాణాలను చేపట్టాయి. అయితే, నిధుల కొరతతో నిర్మాణం మధ్యలో ఆగిపోయింది. నిర్మాణం పోను మరో అర ఎకరం స్థలం ఖాళీగానే ఉంది. ఈ స్థలంలో వినియోగదారులు సేద తీరేందుకు పార్కు లేదా మరేదైన ఏర్పాట్లు చేయాలని నిర్మాణదారుల ఆలోచన. తీసుకున్న రుణాలు చెల్లించలేక ఐఓఐసీ నిర్మాణాలను మధ్యలోనే ఆపేసింది. వ్యవహారం ట్రైబ్యునల్‌కు వెళ్లింది. ఏస్ అర్బన్ డెవలపర్స్ సంస్థ స్థలం తీసుకుని నిర్మాణాలు పూర్తి చేసి రుణాలు తీరుస్తామని ట్రైబ్యునల్‌కు తెలిపింది. ప్రస్తుతం ఏస్ అర్బన్ సంస్థ పనులు మొదలు పెట్టింది. ఇదిలా ఉండగా ఖాళీగా ఉన్న స్థలం తమదేనని వీవీఎస్ శర్మ వాదిస్తున్నారు. ఈ మేరకు కొన్ని దస్తావేజులు చూపిస్తున్నాడు. శర్మ నుంచి అభివృద్ధి నిమిత్తం టీజే విశ్వప్రసాద్ తీసుకున్నాడు. కాగా కోర్టు కూడా తమకే అనుకూలంగా తీర్పును ఇచ్చిందని విశ్వప్రసాద్ చెబుతున్నాడు. అయితే రెవెన్యూ అధికారులు మాత్రం స్థలం ప్రభుత్వానిదేనని దానిపై వివాదాలు ఉన్నట్టు కూడా తమకు తెలియదని స్పష్టం చేశారు. కోర్టులో కూడా ఎటువంటి కేసు లేదని తెలిపారు. ఇలాంటి సమయంలో విశ్వప్రసాద్ చెబుతున్న వాదన పూర్తిగా నిరాధారణమైనదని రెవెన్యూ అధికారులు అంటున్నారు.
పరారీలో ఉన్న వారి కోసం గాలింపు..
కబ్జా, దాడిలో అసలు సూత్రధారులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఏ-1 విశ్వప్రసాద్ అమెరికాలో ఉన్నట్టు సోషల్ మీడియాలో ఆయన పెట్టిన వీడియోల ద్వారా తెలుస్తోంది. ఇక వీవీఎస్ శర్మ, పోలీసు కస్టడీ నుంచి తప్పించుకున్న నిర్మాత సుభాష్, న్యాయవాది మిధున్‌ల గురించి రెండు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. వారి సెల్‌ఫోన్ సిగ్నల్స్‌పై విచారణాధికారులు దృష్టి పెట్టారు. మనుషులను సమకూర్చుకొని స్థలం మీదకు పంపించిన ఏపీలోని కర్నూల్ జిల్లా ఆదోనికి చెందిన జనసేన నేత మల్లప్ప అలియాస్ మల్లికార్జున్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.