Chanchalguda Jail: చంచల్‌గూడ జైలు ఆస్పత్రిలో పరిస్థితి ఇదీ..
ABN , First Publish Date - 2022-11-18T11:13:02+05:30 IST
ఖైదీల రక్షణ, ఆరోగ్య భద్రత సమకూర్చాల్సిన బాధ్యత జైళ్ల Chanchalguda Jail:
చంచల్‌గూడ జైలు ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది కరువు
కొన్నేళ్లుగా భర్తీకానీ పోస్టులు
అందని మెరుగైన వైద్యం
1,600 ఖైదీలకు ఒకే డాక్టర్
హైదరాబాద్/సైదాబాద్: ఖైదీల రక్షణ, ఆరోగ్య భద్రత సమకూర్చాల్సిన బాధ్యత జైళ్ల శాఖదే. శిక్ష పూర్తయి లేదా బెయిల్‌పై బయటికి వచ్చే నాటికి ఖైదీలు శారీరక, మానసిక ఆరోగ్యంతో ఉండేలా చూడాల్సిన బాధ్యత సిబ్బందిదే. అంటే ప్రభుత్వానిదే. కానీ చంచల్‌గూడ జైలు ఆస్పత్రిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. వైద్యులు, సిబ్బంది కొరతతో ఖైదీలు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. జైలులో ఉన్న సుమారు 1,600 మంది ఖైదీలకు వైద్య సేవలు అందించేందుకు వైద్యులు కరువయ్యారు. మోడల్ ప్రిజన్స్ రూల్స్ ప్రకారం 300 మందికి ఒక మెడికల్ ఆఫీసర్ ఉండాలి, కానీ 1,600 పైగా ఖైదీలున్న చంచల్‌గూడ జైలులో కేవలం ఒక వైద్యుడు ఉన్నాడు. ఇద్దరు పారా మెడికల్ సిబ్బందితోనే వైద్య సేవలు అందిస్తున్నారు. దీంతో ఖైదీలకు రౌండ్ ది క్లాక్ వైద్యసేవలు అందించాల్సిన వైద్యులు, సిబ్బంది అందించలేకపోతున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
ముఖ్యంగా జైలులో సాధారణ ఖైదీలతోపాటు ఏసీబీ, సీబీఐ, ఐఎ్‌సఐ ఉగ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైదీలు ఉన్నారు. అందులో అధిక శాతం షుగర్, బీపీ, గుండె వ్యాధులతో బాధపడుతున్నట్లు తెలిసింది. ముఖ్యంగా రాత్రి వేళలో ఖైదీలకు తీవ్రమైన ఆరోగ్య సమస్య తలెత్తితే వైద్యం సరైన సమయంలో అందించే ఆవకాశం లేకుండా పోతోంది. ముఖ్యంగా చలికాలంలో వ్యాధులు ప్రబలే ఆవకాశాలున్నాయి. ఇటువంటి క్లిష్టసమయంలో జైలులో వైద్యులు, సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఖైదీలు, వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు. అంతేగాకుండా సాధారణంగా జైలుకు వచ్చే ప్రతి ఖైదీని క్షుణ్ణంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇలా ఆదనంగా రోజూ 50నుంచి 100మంది జైలు అడ్మిషన్ ఖైదీలకు వైద్య పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఒక్కడే డాక్టర్, ఇద్దరు సిబ్బందికి ఇది తలకు మించిన భారంగా మారడంతో ఖైదీలకు సరైన వైద్యసేవలు అందడం లేదని విమర్శలు ఉన్నాయి.
జైలులో రోగుల అవస్థలు
ఖైదీల ఆరోగ్యం విషమించిందంటే ఉస్మానియా, నిమ్స్, గాంధీ ఆస్పత్రులకు తీసుకెళ్లాల్సిందే. జైలు నుంచి బయటకు తెచ్చి ఆస్పత్రికి తరలించాలంటే నిబంధనలు పాటించాల్సిందే. జైలు సిబ్బంది కాకుండా ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీసులు ఎస్కార్ట్‌తో ఆస్పత్రికి తీసుకెళ్లాలి. ఈ తతంగం పూర్తయ్యే సరికి కాలయాపన జరుగుతుంది. దీంతో రోగి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది.
ఫార్మసిస్ట్ లేకుండానే మందుల పంపిణీ..
జైలు ఆస్పత్రిలో ఫార్మసిస్ట్ లేకుండానే కిందిస్థాయి సిబ్బంది ఖైదీలకు మందులు పంపిణీ చేస్తున్నట్లు తెలిసింది. ఈ ఆస్పత్రిలో కేవలం ఒక డాక్టర్, ఇద్దరు పారా మెడికల్ సిబ్బంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఆస్పత్రిలో జైలు వార్డన్‌లను వైద్య సేవలను వినియోగించుకుంటున్నారని తెలిసింది. జైలులో వైద్యులు, సిబ్బంది కొరత రెండేళ్లుగా కొనసాగుతుందని జైలువర్గాలు తెలిపాయి. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.