వివాహమైనా ఎక్కువగా పుట్టింట్లోనే ఉన్న భార్య.. ఓ రోజు రాత్రి భర్త ఇంటికి వచ్చి చూడగా..
ABN , First Publish Date - 2022-11-09T21:44:21+05:30 IST
విడిగా ఉండలేక వీడిపోలేక ఓ ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడింది. యువతికి పెళ్లి జరిగినా ప్రియుడితో ఉన్న ప్రేమ చంపుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డారు.
యాదగిరిగుట్ట: విడిగా ఉండలేక వీడిపోలేక ఓ ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడింది. యువతికి పెళ్లి జరిగినా ప్రియుడితో ఉన్న ప్రేమ చంపుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి (Bhuvanagiri) మండలం బస్వాపురం గ్రామానికి చెందిన తోట నలందకు(23)కు, యాదగిరిగుట్ట దేవస్థానం ఉద్యోగి అయిన యాదగిరితో మూడేళ్ల క్రితం వివాహమైంది. వివాహానికి ముందే నలంద, బస్వాపురం గ్రామానికే చెందిన ఉడుత గణేష్(25) ప్రేమించుకున్నారు. అయితే వీరిద్దరి గోత్రాలు ఒక్కటే కావడంతో తల్లిదండ్రులు వారి పెళ్లికి నిరాకరించారు. నలందకు యాదగిరిగుట్టకు చెందిన యాదగిరితో వివాహమైనా, అమ్మగారి ఇంటివద్దనే ఎక్కువ సమయం ఉండేది. అప్పుడప్పుడు అత్తవారి ఇంటికి వెళుతుండేది. దీంతో అత్తింటివారు ఈ నెల 8వ తేదీన నలందను తమ ఇంటికి తీసుకెళ్లారు.
భర్త యాదగిరి రోజు మాదిరిగానే మంగళవారం ఉదయం యాదగిరిగుట్ట దేవస్థానానికి విధులకు వెళ్లి రాత్రి 11గంటలకు ఇంటికి వచ్చాడు. ఇంట్లో భార్య కనిపించకపోవటం, చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లేకపోవటంతో భార్య అదృశ్యమైందని అదే రోజు రాత్రి యాదగిరి స్థానిక పోలీస్స్టేషన్ (Police Station)లో ఫిర్యాదు చేశాడు. బుధవారం ఉదయం మండలంలోని బాహుపేట సమీపంలోని ఆలేరు-వంగపల్లి రైల్వేస్టేషన్ పట్టాలపై మృతదేహాలను గుర్తించిన స్థానికులు విషయాన్ని పోలీసులకు సమాచారమిచ్చారు. రాత్రి రెండుగంటల సమయంలో గుర్తు తెలియని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు బుధవారం ఉదయం స్థలానికి చేరుకొని గణేష్, నలంద మృతదేహాలుగా గుర్తించారు. అక్కడ పడిఉన్న సెల్ఫోన్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.