Share News

అమరావతికి అప్పు ఇవ్వలేం

ABN , First Publish Date - 2023-10-27T04:55:28+05:30 IST

అమరావతి రాజధానిలో సీఆర్‌డీఏ అభివృద్ధి పనులకు అవసరమైన రూ.3,500 కోట్ల రుణం ఇచ్చేందుకు బ్యాంకులు నిరాకరించాయి. అమరావతి ప్రధాన రాజధానిగా ఉంటుందన్న హామీ ఇస్తే తప్ప రుణాలను ఇవ్వలేమని తేల్చేశాయి.

అమరావతికి అప్పు ఇవ్వలేం

సీఆర్‌డీఏకు తేల్చి చెప్పిన బ్యాంకర్లు

నో చెప్పినా.. మళ్లీమళ్లీ రుణ ప్రయత్నాలు

హైకోర్టులో కేసు విచారణకు రానుండటంతో డ్రామా?

విజయవాడ, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): అమరావతి రాజధానిలో సీఆర్‌డీఏ అభివృద్ధి పనులకు అవసరమైన రూ.3,500 కోట్ల రుణం ఇచ్చేందుకు బ్యాంకులు నిరాకరించాయి. అమరావతి ప్రధాన రాజధానిగా ఉంటుందన్న హామీ ఇస్తే తప్ప రుణాలను ఇవ్వలేమని తేల్చేశాయి. గతంలోనే బ్యాంకర్లు ఈ విషయాన్ని చెప్పినపుడు సీఆర్‌డీఏ అధికారులు రుణ ప్రయత్నాలను విరమించుకున్నారు. త్వరలో హైకోర్టులో ఈ కేసు విచారణకు రాబోతుండటంతో కోర్టుకు చెప్పుకోవటానికి రుణాల డ్రామాకు తెర తీశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజధాని అభివృద్ధికి సంబంధించి అప్పట్లో ప్రాధాన్యతా పనులంటూ రూ.4,500 కోట్లకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దశల వారీగా చేపట్టే పనులని కోర్టుకు తెలిపారు. పనులు చేపడుతున్నామంటూ పలుచోట్ల కొబ్బరికాయలు కొట్టారు. కానీ, పనులు మాత్రం చేయటం లేదు. ఈ పనులకు రూ.3,500 కోట్లు అప్పు తీసుకోవాలనుకుంటే బ్యాంకర్లు ఇవ్వలేదు. వీజీటీఎం-ఉడాగా ఉన్నపుడు అభివ ృద్ధి చేసిన పలు టౌన్‌షి్‌పలలోని ప్లాట్ల వేలం ద్వారా రూ.1000 కోట్ల వరకు ఆర్జించి వీటిని రాజధాని అభివృద్ధికి ఖర్చు చేస్తామని గతంలో సీఆర్‌డీఏ ఉన్నతాధికారులు ప్రకటించారు. ఆ ప్లాట్లు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు కానీ, రాజధానిలో పనులు చేపట్టడం లేదు. మరోవైపు రాజధాని భూములనూ 48 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాల కోసం కేటాయించింది. వీటిని గమనిస్తున్న బ్యాంకులన్నీ కూడా అమరావతి అభివృద్ధి పనుల పేరుతో ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదని ఫైనల్‌గా తమ అభిప్రాయాన్ని చెప్పేయడంతో.. ఇదే విషయాన్ని హైకోర్టుకు చెప్పి.. నెపాన్ని బ్యాంకర్ల మీదకు తోసి తప్పించుకునేందుకు సీఆర్‌డీఏ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2023-10-27T04:55:28+05:30 IST