Share News

Tension in YSRCP: ఆ ఫలితాలతో వైసీపీలో వణుకు మొదలైందా

ABN , Publish Date - Mar 08 , 2025 | 03:34 PM

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీలో వణుకు మొదలైందా.. కూటమి ప్రభుత్వానికి ప్రజలు మద్దతుగా ఉన్నారనే విషయం మరోసారి స్పష్టమైందా. ఎలాగైనా కూటమి అభ్యర్థులను ఓడించాలనే వైసీపీ కుట్రను యువత తిప్పికొట్టారా..

Tension in YSRCP: ఆ ఫలితాలతో వైసీపీలో వణుకు మొదలైందా
YSRCP

అధికారం చేపట్టి ఏడాది పూర్తి కాకుండానే ప్రభుత్వంపై ప్రజలు పూర్తి అసంతృప్తితో ఉన్నారంటూ వ్యాఖ్యలు చేసిన వైసీపీకి ప్రజలు గూబగుయ్యమనే సమాధానం ఇచ్చారా.. జగన్‌ను మేము ఎప్పటికీ నమ్మబోమనే సంకేతాలను పరోక్షంగా ఇచ్చారా అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. రెండు గ్రాడ్యుయేట్ స్థానాలు కాగా.. ఒకటి టీచర్స్ స్థానం.రెండు పట్టభద్రుల స్థానాల్లో పోటీచేసిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరపున అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో కూటమి తరపున అభ్యర్థిని పోటీకి పెట్టలేదు. కానీ ఏపీటీఎఫ్ బలపర్చిన అభ్యర్థికి టీడీపీ, జనసేన మద్దతు ప్రకటించగా.. బీజేపీ మాత్రం పీఆర్‌టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడికి మద్దతు ప్రకటించిది. చివరకు కూటమి పార్టీలో ఒకటైన బీజేపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థి ఇక్కడ విజయం సాధించారు.


వైసీపీ పీడీఎఫ్ అభ్యర్థికి పరోక్షంగా మద్దతు ప్రకటించగా.. ఆ అభ్యర్థి కేవలం మూడో స్థానానికి పరిమితమయ్యారు. ముఖ్యంగా తూర్పు, పశ్చిమగోదావరి పట్టభద్రుల స్థానంలోనూ, కృష్ణా గుంటూరు పట్టభద్రుల స్థానంలో ఫలితం చూసిన తర్వాత వైసీపీ నేతల్లో మరింత వణకు మొదలైందనే చర్చ జరుగుతోంది. గతంలో పట్టభద్రల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీ ఓటమితో యువత గత జగన్ ప్రభుత్వంపై అసంతప్తితో ఉన్నారనే ప్రచారం జనంలోకి బాగా వెళ్లింది. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఓడిస్తే ఏడాది తిరగకుడానే ప్రభుత్వంపై యువత అసంతృప్తితో ఉన్నారనే ప్రచారాన్ని విస్తృతం చేయాలని వైసీపీ ప్రణాళిక రచించిందని, అయితే ఫలితాలు మాత్రం వైసీపీ ఆశించినట్లు లేకపోగా.. కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించడం ద్వారా ప్రభుత్వానికి తాము మద్దతుగా నిలుస్తున్నామన సందేశాన్ని యువత ఇచ్చినట్లైంది. దీంతో రానున్న రోజుల్లో తమ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందనే ఆందోళన వైసీపీ నేతల్లో మొదలైందట.


కుట్ర ఫెయిల్..

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీ తమ అభ్యర్థులను పోటికి దించలేదు. పోటీచేసినా ఓడిపోతామనే ఉద్దేశంతో వైసీపీ ఎన్నికలకు దూరంగా ఉండి ఉండొచ్చనే ప్రచారం జరిగింది. కానీ వైసీపీ పోటీ చేయకపోవడానికి మరో అసలు కారణం ఉన్నట్లు తెలుస్తోంది. పీడీఎఫ్ అభ్యర్థులు ఎలాగూ పోటీ చేస్తారు. వైసీపీ అభ్యర్థిని పెడితే ఓట్లు చీలి టీడీపీకి ప్లస్ అవుతాయనే ఉద్దేశంతో తాము పీడీఎఫ్ అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తే కూటమి అభ్యర్థులను ఓడించవచ్చనే ప్లాన్‌తో జగన్ తమ పార్టీ అభ్యర్థులను పోటీకి పెట్టలేదనే ప్రచారం జరుగుతోంది. తీరా ఫలితాలు చూసిన తర్వాత తమ నేతల ప్లాన్ పూర్తిగా విఫలమైందని వైసీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయట. ప్రభుత్వంపై వైసీపీ ఎంత విష ప్రచారం చేసినా, ప్రజలు మాత్రం ప్రభుత్వానికి తాము మద్దతుగా ఉంటామనే బలమైన సంకేతాన్ని ఎమ్మెల్సీ ఫలిత ద్వారా ఇచ్చినట్లు తెలుస్తోంది.


వైసీపీలో వణుకు

సూపర్ సిక్స్ హామీల అమలులో కొంత ఆలస్యం జరిగినా సరే.. రాష్ట్రం అభివృద్ధి, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల దష్ట్యా తాము కూటమి ప్రభుత్వానికి అండగా ఉంటామని ఎమ్మెల్సీ ఫలితాల ద్వారా చదువుకున్న యువత స్పష్టమైన తీర్పు ఇవ్వడంతో వైసీపీ నేతల్లో వణుకు మొదలైందట. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో కూడా తమకు గడ్డు పరిస్థితులు తప్పవని, వైసీపీని నమ్ముకుంటే రాజకీయ భవిష్యత్తు ఉండదనే ఆందోళనలో కొందరు నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితం తర్వాత ప్రభుత్వంపై ఉపాధ్యాయులు అసంతృప్తితో ఉన్నారంటూ వైసీపీ తమ అనుకూల మీడియాతో పాటు సోషల్ మీడయాలో ప్రచార ఊదరగొట్టింది. ఇదే సమయంలో వైసీపీ పరోక్షంగా సహకరించిన పీడీఎఫ్ అభ్యర్థ మూడో స్థానానికి పరిమితమయ్యారనే సత్యాన్ని వైసీపీ మర్చిపోయింది. కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ మద్దతు తెలిపిన అభ్యర్థి విజయం సాధించిన విషయాన్ని వైసీపీ దాచిపెట్టింది. మరుసటి రోజు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాలు వెల్లడైన తర్వాత వైసీపీ నేతలంతా సైలెంట్ అయిపోయారనే చర్చ జరుగుతోంది.

ఇవి కూడా చదవండి

తుర్లపాటి రాజేశ్వరికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం

హైదరాబాద్‌లో చిన్నారిపై వీధి కుక్కల దాడి

ఎకరా టార్గెట్‌ 100 కోట్లు!

ఖమ్మం జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం..

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Telugu News Click Here

Updated Date - Mar 08 , 2025 | 03:34 PM