YCP : వైసీపీ శ్రేణుల అరాచకం
ABN , First Publish Date - 2023-11-14T03:04:41+05:30 IST
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. వైసీపీ వర్గీయులు మహిళ చీరను లాగి, అసభ్యంగా ప్రవర్తించి దారుణంగా అవమానించారు.

ఓ కుటుంబ స్థలం క బ్జాకు యత్నం
అడ్డుకోబోయిన మహిళ చీరలాగి, అసభ్యంగా ప్రవర్తించి దాష్టీకం
తీవ్ర అవమానంతో బాధితురాలి రోదన
పోలీసులు స్పందించకపోవడంపై ఆవేదన
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఘటన
పిడుగురాళ్లలో ప్రైవేటు వెంచర్‌లో సీసీ రోడ్డు ధ్వంసం
ఎమ్మిగనూరు, పిడుగురాళ్ల, నవంబరు 13: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. వైసీపీ వర్గీయులు మహిళ చీరను లాగి, అసభ్యంగా ప్రవర్తించి దారుణంగా అవమానించారు. ఆమె స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నంలో భాగంగా ఇంతటి దాష్టీకానికి తెగబడ్డారు. బాధితురాలి కథనం మేరకు.. పార్లపల్లి గ్రామానికి చెందిన సరోజమ్మకు 2003లో సర్వే నంబర్ 261లో మూడు సెంట్ల స్థలాన్ని (పట్టా నంబర్ 241)ప్రభుత్వం కేటాయించింది. సరోజమ్మ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ఆ స్థలాన్ని అదే గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, పద్మ అనే దంపతులకు దాదాపు 15 ఏళ్ల క్రితం విక్రయించింది. అప్పటి నుండి వెంకటేశ్వర్లు కుటుంబం ఆ స్థలంలో ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైసీపీ వర్గీయుడు టోపి నరసింహులు.. గ్రామ వైసీపీ నాయకుడు చంద్రశేఖర్‌రెడ్డి అండతో.. 241 పట్టా భూమిలో తమకు అధికారులు సెంటున్నర స్థలాన్ని ఇచ్చారని రుబాబు చేస్తున్నారు. వెంకటేశ్వర్లు భార్య పద్మ స్వాధీనంలో ఉన్న సెంటున్నర స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. దీంతో స్థలాన్ని విక్రయించిన సరోజమ్మ కోర్టుకు వెళ్లి స్టే ఆర్డర్‌ను తెచ్చుకుంది. కోర్టు స్టే ఆర్డర్ ఇవ్వడంతో స్థలాన్ని కొన్న వెంకటేశ్వర్లు దంపతులు ఆ స్థలంలో బండలు పాతారు. విషయం తెలుసుకున్న వైసీపీ వర్గీయులు ‘మా స్థలంలో బండలు ఎలా పాతుతారు..’ అంటూ దౌర్జన్యానికి దిగారు. పద్మ అడ్డుకోగా టోపి నరసింహులు, అతని కుమారుడు, మనవడు ఆమెను అడ్డుకొని పక్కకు లాగేశారు. తన చేతిని పట్టుకొని చీరలాగి అసభ్యంగా ప్రవర్తించారని బాధితురాలు ఆరోపిస్తోంది. తమకు జరిగిన అన్యాయంపై ఎమ్మిగనూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోగా, తిరిగి తమపైనే కేసు నమోదు చేస్తామని బెదిరిస్తున్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని బాధితురాలు పద్మ, ఆమె భర్త వెంకటేశ్వర్లు బోరుమన్నారు. ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేశామని ఎమ్మిగనూరు రూరల్ ఎస్‌ఐ నిరంజన్ తెలిపారు.