నేడే బుల్లి రాకెట్ ప్రయోగం
ABN , First Publish Date - 2023-02-10T03:22:10+05:30 IST
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) రెండో బుల్లి రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ అంతరిక్ష కేంద్రం(షార్) నుంచి శుక్రవారం ఉదయం 9.18 గంటలకు...

తెల్లవారుజామున 2.48 గంటలకు కౌంట్‌డౌన్
ఉదయం 9.18కు నింగిలోకి ఎస్‌ఎ్‌సఎల్వీ-డీ2
మూడు ఉపగ్రహాలతో దూసుకెళ్లనున్న రాకెట్
తిరుమల ఆలయంలో ఇస్రో ప్రత్యేక పూజలు
సూళ్లూరుపేట, ఫిబ్రవరి 9: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) రెండో బుల్లి రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ అంతరిక్ష కేంద్రం(షార్) నుంచి శుక్రవారం ఉదయం 9.18 గంటలకు ఎస్‌ఎ్‌సఎల్వీ-డీ2 రాకెట్ మూడు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి మోసుకు వెళ్లనుంది. మొబైల్ సర్వీసు టవర్ నుంచి రాకెట్‌ను ముందుకు తీసుకెళ్లి, మళ్లీ వెనక్కి తీసుకొచ్చే ప్రక్రియను శాస్త్రవేత్తలు గురువారం పరిశీలించారు. బ్రహ్మప్రకాశ్ హాలులో నిర్వహించిన మిషన్ రెడీనెస్ రివ్యూ సమావేశం(ఎంఆర్‌ఆర్)లో సంతృప్తి ప్రకటించారు. అనంతరం షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ అధ్యక్షతన సమావేశమైన లాంచ్ ఆథరైజేషన్ బోర్డు... 6.30గంటల పాటు కౌంట్‌డౌన్ నిర్వహించాలని నిర్ణయించింది. శుక్రవారం తెల్లవారు జామున 2.48 గంటలకు కౌంట్‌డౌన్ మొదలవుతుంది. ఇప్పటికే శ్రీహరికోటలోని ప్రథమ ప్రయోగ వేదిక మీద సిద్ధంగా ఉన్న రాకెట్ ద్వారా ఇస్రో రూపొందించిన 156.3 కిలోల బరువైన భూ పరిశీలన ఉపగ్రహం ఈవోఎస్-07, స్పేస్ కిడ్జ్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో మన దేశ విద్యార్థినులు రూపొందించిన 8.7కిలోల బరువైన ఆజాదీ శాట్-02 ఉపగ్రహం, అమెరికాలోని అంటారిస్ సంస్థకు చెందిన 11.5 కిలోల బరువున్న జానూస్-01 ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపనున్నారు. అంతకు మునుపు రాకెట్ విజయాన్ని ఆకాంక్షిస్తూ ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ సూళ్లూరుపేట చెంగాళమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఎస్‌ఎ్‌సఎల్వీ-డీ2 నమూనాకు గురువారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలో ఇస్రో అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా, గతేడాది ఆగస్టు 7న ప్రయోగించిన ఎస్‌ఎ్‌సఎల్వీ తొలి రాకెట్ చివరి నిమిషంలో ఉపగ్రహాల నుంచి సంకేతాలు అందకపోవడంతో విఫలమైంది. ఆ తర్వాత శాస్త్రవేత్తలు మరో చిన్న రాకెట్‌ను అభివృద్ధి చేసి పలు కీలక పరీక్షలు నిర్వహించి ఎస్‌ఎ్‌సఎల్వీ-డీ2ను సిద్ధం చేశారు. ఈ ప్రయోగం విజయవంతమైతే అతి తక్కువ ఖర్చుతో అంతరిక్షంలోకి ఉపగ్రహాలను పంపిన ఘనత ఇస్రోకు దక్కనుంది. ఈ పరిణామం ప్రపంచ అంతరిక్ష వాణిజ్య రంగాన్ని ఆకర్షించనుంది.