ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

YCP VS TDP: రణరంగం!

ABN, First Publish Date - 2023-08-05T02:52:44+05:30

సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి’ పేరుతో తెలుగుదేశం (Telugu Desham) అధ్యక్షుడు చంద్రబాబు(Chandrababu) చేపట్టిన యాత్ర నిజంగానే యుద్ధాన్ని తలపించింది.

చంద్రబాబు పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత

రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు.. తిరగబడిన టీడీపీ శ్రేణులు

అంగళ్లు, పుంగనూరులో యుద్ధ వాతావరణం

13 మంది పోలీసులు, 50 మంది కార్యకర్తలకు గాయాలు

అంగళ్లు‌లో వైసీపీ కార్యకర్తల విధ్వంసం

చంద్రబాబుపై రాళ్లతో దాడి... ఎన్‌ఎస్‌జీ రక్షణ

టీడీపీ కార్యకర్తలపై దాడులు, వాహనాల ధ్వంసం

పుంగనూరు బైపాస్‌లో మరోసారి హైటెన్షన్‌

బాబును అడ్డుకుంటామంటూ రెచ్చగొట్టిన వైసీపీ

రోడ్‌షో చేసి తీరతామంటూ టీడీపీ కార్యకర్తల పట్టు

అడ్డుకున్న పోలీసులు... ప్రతిఘటించిన కార్యకర్తలు

లాఠీచార్జి, బాష్పవాయు ప్రయోగంతో భగ్గు

రాళ్ల దాడి, రెండు పోలీసు వాహనాలకు నిప్పు

అటు అన్నమయ్య జిల్లా అంగళ్లు... ఇటు చిత్తూరు జిల్లా పుంగనూరు రణరంగంగా మారాయి. చంద్రబాబు యాత్రను అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు అరాచకానికి దిగాయి. అంగళ్లులో చంద్రబాబు రాకముందే దాడులు మొదలుపెట్టారు. ఆయనపైనా రాళ్లు విసిరారు. చంద్రబాబు అక్కడి నుంచి వెళ్లిన తర్వాత మరోసారి టీడీపీ నాయకుల వాహనాలను ధ్వంసం చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికి పుంగనూరు శివార్లలో మరోసారి సమరం జరిగింది. నిజానికి చంద్రబాబు పర్యటన షెడ్యూలులో పుంగనూరు పట్టణం లేదు. అయినా... వైసీపీ నేతలు రెచ్చగొట్టేలా వ్యవహరించారు. ‘చంద్రబాబును అడ్డుకుంటాం’ అంటూ నిరసన ప్రదర్శన చేశారు. దీంతో... చంద్రబాబును పుంగనూరు పట్టణంలోకి తీసుకొస్తామంటూ టీడీపీ కార్యకర్తలు పట్టుపట్టారు. అడ్డుకున్న పోలీసులు... తిరగబడిన తెలుగు తమ్ముళ్లతో పట్టణ శివార్లు రణరంగాన్ని తలపించాయి. లాఠీచార్జిలో పలువురు టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. అంగళ్లులో దాడులు... ఆ తర్వాత పుంగనూరులో అడ్డగింతలు, లాఠీచార్జి, బాష్పవాయు ప్రయోగంతో రగిలిన టీడీపీ కార్యకర్తల్లో కొందరు దాడులకు దిగారు. పోలీసు వాహనాలనూ ధ్వంసం చేశారు. రాళ్లు తగలడంతో పలువురు పోలీసులూ గాయపడ్డారు.

రాయచోటి/చిత్తూరు, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి’ పేరుతో తెలుగుదేశం(Telugu Desham) అధ్యక్షుడు చంద్రబాబు(Chandrababu) చేపట్టిన యాత్ర నిజంగానే యుద్ధాన్ని తలపించింది. శుక్రవారం వైసీపీ(YCP) నేతలు, కార్యకర్తల దాడులు, కవ్వింపులతో రెచ్చిపోయారు. సహనం నశించిన టీడీపీ కార్యకర్తలు ప్రతిదాడులకు దిగారు. దీంతో... అటు అన్నమయ్య జిల్లా(Annamaya District) అంగళ్లు, ఇటు చిత్తూరు జిల్లా(Chittoor District) పుంగనూరు(Punganuru) శివారులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శుక్రవారం చంద్రబాబు చేపట్టిన యాత్ర ములకలచెరువు, బి.కొత్తకోట మండలాల్లో పూర్తి చేసుకుని... కురబలకోట మండలం అంగళ్లు మీదుగా చిత్తూరు జిల్లాలో ప్రవేశించాల్సి ఉంది. అంగళ్లులో ఉదయం నుంచే వైసీపీ అల్లరి మూకలు చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు యత్నించాయి. సుమారు 200 మంది వైసీపీ కార్యకర్తలు జెండాలు చేతపట్టుకుని.. బస్టాండు సర్కిల్‌లో బైఠాయించారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నల్ల బెలూన్లు, జెండాలు పట్టుకుని ఆందోళన నిర్వహించారు. వీళ్లను పోలీసులు అడ్డుకోలేదు. పైగా... రోడ్డుపైన ఒక పక్కగా కూర్చోబెట్టి పోలీసులే రక్షణగా నిలబడ్డారు. దీంతో వైసీపీ అల్లరి మూకలు మరింత రెచ్చిపోయారు. తెలుగుదేశం జెండాతో వెళ్తున్న ఒక ద్విచక్ర వాహనదారుడిని దారుణంగా కొట్టారు. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో చంద్రబాబు కాన్వాయ్‌ అక్కడికి సమీపించింది. ఇక వైసీపీ కార్యకర్తలు మరింత చెలరేగిపోయారు. కాన్వాయ్‌ కంటే ముందు వెళ్తున్న టీడీపీ వర్గీయులపై రాళ్లు, కర్రలు, చెప్పులతో దాడికి దిగి విధ్వంసం సృష్టించారు. టీడీపీ కార్యకర్తలు వారిపైకి తిరగబడ్డారు. పోలీసులు రంగంలోకి దిగి... తెలుగుదేశం శ్రేణులపై లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. ఇంతలో చంద్రబాబు కాన్వాయ్‌ అక్కడికి చేరుకుంది. వైసీపీ మూకల రాళ్ల దాడి విషయం తెలిసి.. తాను ప్రయాణిస్తున్న ఓపెన్‌ టాప్‌ కారు నుంచి చంద్రబాబు కిందకు దిగి బస్టాండు సర్కిల్‌లోకి వచ్చారు. ఎలక్ట్రాని‌నిక్‌ మీడియా కోసం ఏర్పాటు చేసిన వాహనంలోకి ఎక్కి మాట్లాడారు. చంద్రబాబు మాట్లాడుతున్న సమయంలోనూ వైసీపీ అల్లరి మూకలు రాళ్ల దాడిని ఆపలేదు. పోలీసులు వాళ్లను అడ్డుకునే ప్రయత్నమూ చేయలేదు. ఎన్‌ఎస్‌జీ కమెండోలు ఆయనకు రక్షణగా నిలిచారు. సుమారు అరగంట పాటు వైసీపీ నాయకులు ఈ దాడికి పాల్పడ్డారు. రాళ్ల దాడిలో పలువురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, పోలీసులు గాయపడ్డారు. పోలీసుల సంపూర్ణ సహకారంతో వైసీపీ నాయకులకు రెచ్చిపోయారు. ఈ దశలో చంద్రబాబు సహనం కోల్పోయి... ‘తరిమి కొట్టండి’ అని సూచించారు. దీంతో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తిరగబడి రాళ్లదాడిని ఎదురుకొన్నారు. వైసీపీ అల్లరి మూకలను తరిమేశారు.

మళ్లీ రెచ్చిపోయిన మూకలు..

చంద్రబాబు అక్కడి నుంచి వెళ్లాక వైసీపీ అల్లరిమూకలు మళ్లీ రెచ్చిపోయాయి. కాన్వాయ్‌లో వెనుక వస్తున్న టీడీపీ నాయకుల వాహనాలను ధ్వంసం చేశారు. రైల్వేకోడూరు టీడీపీ ఇన్‌చార్జి కస్తూరి విశ్వనాథ్‌ నాయుడు వాహనం, మహిళా శక్తి వాహనంతోపాటు మొత్తం ఆరు వాహనాలు ధ్వంసమయ్యాయి. వైసీపీ అల్లరి మూకలు యథేచ్ఛగా రోడ్డుపై విధ్వంసం సృష్టిస్తున్నా.. పోలీసులు కనీసం అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. పలుమార్లు టీడీపీ శ్రేణులపైనే లాఠీచార్జి చేశారు.

పుంగనూరు రాకముందే...

చంద్రబాబు పుంగనూరు, పలమనేరు మీదుగా చిత్తూరు వచ్చి... పూతలపట్టులో జరిగే బహిరంగ సభలో పాల్గొనాల్సి ఉంది. కానీ... పుంగనూరులో చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామని రెండు రోజుల కిందట మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి ద్వారకానాథ రెడ్డి హెచ్చరించారు. మంత్రి పెద్దిరెడ్డి మెప్పు కోసం పుంగనూరు పట్టణంలో చంద్రబాబు పర్యటనకు చిత్తూరు జిల్లా పోలీసులు అనుమతులు ఇవ్వలేదు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి చల్లా రామచంద్రారెడ్డి పలమనేరు డీఎస్పీ కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం దక్కలేదు. దీంతో... పుంగనూరు పట్టణంలోకి రాకుండా బైపాస్‌ మీదుగానే చంద్రబాబు కాన్వాయ్‌ వెళ్లేలా షెడ్యూలు నిర్ణయించారు. కానీ... శుక్రవారం ఉదయమే సుమారు 500 మంది వైసీపీ కార్యకర్తలు నల్ల దుస్తులు, నల్ల జెండాలతో పుంగనూరులో నిరసన తెలిపారు. ‘చంద్రబాబు గోబ్యాక్‌, డౌన్‌ డౌన్‌’ అని నినదించారు. ఆయన వస్తే అడ్డుకుంటామని హెచ్చరిస్తూ టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టారు. దీంతో... ఏదిఏమైనా చంద్రబాబుతో పట్టణంలో రోడ్‌షో నిర్వహించాలని టీడీపీ నాయకులు మరింత పట్టుపట్టారు.


గొడవ ఎలా మొదలైంది...

చంద్రబాబు పుంగనూరు సమీపానికి వచ్చే గంట ముందు అసలు గొడవ ప్రారంభమైంది. చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు పుంగనూరు బైపాస్‌లో వేల సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు గుమికూడారు. ఆ సమయంలోనే వందల మంది పోలీసులు మోహరించి... పట్టణంలోకి ఎవరూ రాకుండా బైపాస్‌ వద్ద బారికేడ్లను ఏర్పాటు చేశారు. పట్టణంలో రోడ్‌షో చేయాలని, బారికేడ్లు తీయాలని టీడీపీ శ్రేణులు కోరగా పోలీసులు అంగీకరించలేదు. ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. టీడీపీ శ్రేణులు అక్కడి బారికేడ్లను తోసేశారు. పోలీసులు వెంటనే లాఠీచార్జి చేశారు. అప్పటికే అంగల్లులో చంద్రబాబు పర్యటనను వైసీపీ వాళ్లు అడ్డుకోవడం, దాడి చేయడం, ఈలోపు పుంగనూరులోనూ పోలీసులు లాఠీచార్జికి దిగడంతో టీడీపీ కార్యకర్తలు తీవ్రంగా ప్రతిఘటించారు. లాఠీచార్జితోపాటు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించడంతో కార్యకర్తలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. లాఠీ దెబ్బలు తగలడంతో పలువురు టీడీపీ కార్యకర్తల తలలు పగిలాయి. మరికొందరు కళ్లు తిరిగి కింద పడిపోయారు. దీంతో టీడీపీ శ్రేణులు సహనం కోల్పోయారు. పోలీసులపైకి తిరగబడి రాళ్ల దాడికి దిగారు. పోలీసులూ రాళ్లు విసిరారు. తమవైపు వచ్చిన కార్యకర్తలను వెంటపడి కొట్టారు. ఒకానొక సందర్భంలో రాళ్ల దాడి నుంచి తప్పించుకోవడానికి ఏఎస్పీ, డీఎస్పీ, సీఐ వంటి అధికారులు ప్రొటెక్షన్‌ గార్డ్‌ పట్టుకుని పరిగెత్తాల్సి వచ్చింది. బాష్పవాయు గోళాలను ప్రయోగించే వజ్ర వాహనంతో పాటు కానిస్టేబుళ్లను బందోబస్తుకు తరలించిన వ్యానును పల్టీ కొట్టించి... టపాసులు పెట్టి కాల్చేశారు.

గాయాలపాలైన పోలీసులు, కార్యకర్తలు

లాఠీచార్జి, బాష్పవాయు ప్రయోగం, రాళ్ల దాడితో సుమారు 45 నిమిషాలపాటు పుంగనూరు బైపాస్‌ రణరంగాన్ని తలపించింది. ఈ ఘటనలో 13 మంది పోలీసులు, సుమారు 50 మంది టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. దిశ డీఎస్పీ బాబు ప్రసాద్‌, సీఐలు భాస్కర్‌, రాజశేఖర్‌, ఆర్‌ఐ నీలకంఠేశ్వరెడ్డికి రక్త గాయాలయ్యాయి. కానిస్టేబుల్‌ లోకేశ్‌కు భుజం ఎముక విరిగిపోయింది. మరో కానిస్టేబుల్‌కు ఎడమ కన్నుకు తీవ్రంగా గాయమైంది. ఏఆర్‌ ఏఎస్పీ నాగేశ్వరరావు, డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, సీఐ వాసంతి మీద రాళ్లు పడ్డాయి. పోలీసుల లాఠీచార్జిలో కొందరు టీడీపీ కార్యకర్తల తలలకు బలమైన గాయాలయ్యాయి. మరికొందరు కింద పడిపోయారు. గాయపడ్డ పోలీసుల్ని, టీడీపీ కార్యర్తల్ని వేర్వేరు ఆస్పత్రులకు తరలించారు.

పట్టణంలోకి రావాలని పట్టు...

పుంగనూరు పట్టణంలోకి రావాల్సిందే అంటూ చంద్రబాబును ఆ పార్టీ కార్యకర్తలు డిమాండ్‌ చేశారు. ఓ దశలో చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకుని మరీ పట్టణంలోకి రావాల్సిందేనని పట్టుపట్టారు. ‘మీ నుంచి కారిన ప్రతి రక్తపు చుక్కా నాదిలా భావిస్తా, మీ మీద పడిన దెబ్బను నా మీద పడినట్లు భావిస్తా. పూతలపట్టు సభకు వెళ్లాల్సి ఉంది. ఇప్పుడు పుంగనూరు నా షెడ్యూలులో లేదు. ఒకరోజంతా పుంగనూరులోనే ఉంటా’ అని కార్యకర్తలకు సర్దిచెప్పారు.

పెద్దిరెడ్డికి హెచ్చరిక...

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై చంద్రబాబు అంగళ్లులో మండిపడ్డారు. ‘‘ఇటువంటి సంఘటనలకు భయపడేది లేదు. పుంగనూరులోనూ ఇలాగే చేస్తున్నారు. అక్కడికి వెళ్లి.. ఏంటో తేల్చుకుంటాం. దమ్ముంటే నువ్వేరా! పెద్దిరెడ్డీ.. నువ్వు కర్రతో వస్తే.. నేనూ కర్రతోనే వస్తా. నువ్వు యుద్ధం ప్రక టిస్తే.. నేనూ ప్రకటిస్తా! నీ పతనం అంగళ్లుతో ప్రారంభమైంది. మీ పెయిడ్‌ గ్యాంగు రాళ్లదాడిలో గాయపడిన ప్రతి టీడీపీ నాయకుడు, కార్యకర్తల రక్తపు బొట్టుకు బాకీ తీర్చుకుంటా’’ అని హెచ్చరించారు. ‘చంద్రబాబు గోబ్యాక్‌’ అంటూ నినాదాలు చేస్తూ.. రాళ్లు రువ్వుతున్న అల్లరి మూకలను నియంత్రించలేకపోతున్న డీఎస్పీ కేశప్పపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నీ డ్రస్‌ విప్పెయ్‌. యూనిఫామ్‌ విలువ తీయవద్దు’’ అని ఆవేశంగా అన్నారు.

Updated Date - 2023-08-05T04:39:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising