Roja : బాలకృష్ణ తన తప్పును ఎప్పటికీ సరిదిద్దుకోడు
ABN, First Publish Date - 2023-01-25T12:06:29+05:30
జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణలపై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.
Roja : జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణలపై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కౌన్సిలర్‌కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అయిన లోకేష్ పాదయాత్రకు తాము ఎందుకు అనుమతి ఇవ్వాలని ప్రశ్నించారు. లోకేష్ పాదయాత్రతో ఏదేదో జరిగిపోతుందని భ్రమలో ఉన్నారన్నారు. పాదయాత్రలో మొదటి రోజే వాళ్ళకి అంతలేదు అని అర్థం అయిపోతుందని రోజా విమర్శించారు. లోకేష్ తెలుగుదేశం పార్టీలోకి వచ్చినప్పటి నుంచి పార్టీ అన్ని విధాలుగా దెబ్బతిన్నదని ఎద్దేవా చేశారు. తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందనడం శుభపరిణామమన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తులపై రోజుకు ఒక మాట మాట్లాడి కన్ఫ్యూజ్ రాజకీయాలు చేస్తున్నాడన్నారు. 26 జిల్లాల్లో జనసేన పార్టీకి అధ్యక్షులే లేరని... వారికి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు లేరని రోజా విమర్శించారు. అది జనసేన కాదు చంద్రసేన అని విమర్శించారు. ఆ పార్టీని చూసి వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కనీసం కార్యకర్తలు కూడా భయపడే పరిస్థితి లేదన్నారు. బాలకృష్ణ అక్కినేనిని అవమానించడం తప్పన్నారు. ఎన్టీఆర్‌ని అవమానిస్తే వీళ్ళు ఎంత బాధ పడతారో, అదే విధంగా అక్కినేని అభిమానులు కూడా బాధపడతారన్నారు. ఆ విషయంపై ఇప్పటి వరకూ బాలకృష్ణ తప్పును సరిదిద్దుకోలేదన్నారు. ఆయన ఎప్పుడు సరిదిద్దుకోడన్నారు.
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు వివేకానంద రెడ్డి హత్య జరిగిందని.. అప్పటి ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వైఫల్యం హత్యలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎఫ్ఐఆర్‌లో అవినాష్ రెడ్డి పేరు చేర్చలేదన్నారు. ఇప్పుడు సీబీఐని తప్పుదారి పట్టిస్తూ హంగామా చేయటం తగదన్నారు. తిరుపతి జిల్లాలో సినీ పరిశ్రమకు తమిళ సినీ పెద్దలు భూమి కోరినట్లు తెలిసిందని.. అవసరమైతే సీఎం జగన్‌తో మాట్లాడి వాళ్లకి భూమి ఇప్పిస్తానని రోజా తెలిపారు.
Updated Date - 2023-01-25T12:33:42+05:30 IST