SP Parameswara Reddy: శ్రీవారి బ్రహ్మోత్సలకు మూడు అంచెల భద్రత ఏర్పాట్లు
ABN, First Publish Date - 2023-10-17T19:14:45+05:30
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సలకు మూడు అంచెల భద్రత ఏర్పాట్లు చేసినట్లు తిరుపతి ఎస్పీ పరమేశ్వరరెడ్డి (Tirupati SP Parameswara Reddy) తెలిపారు.
తిరుపతి: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సలకు మూడు అంచెల భద్రత ఏర్పాట్లు చేసినట్లు తిరుపతి ఎస్పీ పరమేశ్వరరెడ్డి (Tirupati SP Parameswara Reddy) తెలిపారు. మంగళవారం నాడు బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపై మీడియాకు వివరాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ..‘‘ బ్రహ్మోత్సవాలల్లో 1800 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. గరుడ సేవ రోజు 1253 మంది పోలీసులు అదనంగా బందోబస్తు నిర్వహిస్తారు. ఈనెల 19వ తేదీన గరుడ వాహనసేవకు పటిష్ట మైన బందోబస్తు చేపడతాం. గరుడ సేవ రోజు మూడు లక్షలు మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాం. అలిపిరి వద్ద ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నాం. బయట ప్రాంతాల నుంచి వాహనాల్లో వచ్చే భక్తులకు ప్రత్యేక పార్కింగ్ సౌకర్యం ఉంటుంది. 19 తేదీ ఉదయం 6 గంటలు నుంచి 20వ తేదీ ఉదయం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాలకు అనుమతి లేదు.
గరుడ వాహన సేవ రోజు ట్రాఫిక్ ఆంక్షలు
తిరుమలలో 32 పార్కింగ్ ప్రాంతాలల్లో 15 వేల వాహనాలు పట్టే విధంగా పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నాం. తిరుమల మాఢవీధి గ్యాలరీలో లక్ష 20 వేల మందికి మాత్రమే సామర్థ్యం ఉంటుంది. గరుడ వాహనం సమయంలో మాఢవీధుల్లోకి వెళ్లే విధంగా ఐదు క్యూలైన్ పాయింట్లు ఏర్పాటు చేశాం. బ్రహ్మోత్సవాలల్లో భక్తులు సంయమనం పాటించాలి. చిన్న పిల్లలకు జియో ట్యాగింగ్ విధానం అందుబాటులో ఉంటుంది. దిగువ ఘాట్‌రోడ్‌లో నిబంధనలు పాటిస్తూ వాహనాలు వెళ్లాలి. తిరుపతి నగరంలో గరుడ వాహన సేవ రోజు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. వాహనాలు మళ్లింపు, నిర్దేశించిన పార్కింగ్‌లోనే వాహనాలు నిలపాలి. నడక మార్గంలో వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నాం’’ అని ఎస్పీ పరమేశ్వరరెడ్డి పేర్కొన్నారు.
Updated Date - 2023-10-17T19:14:45+05:30 IST