Nadendla Manohar: కావలిలో ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేసిన వైసీపీ మూకలను కఠినంగా శిక్షించాలి
ABN, First Publish Date - 2023-10-28T15:48:37+05:30
కావలిలో ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేసిన వైసీపీ మూకలను కఠినంగా శిక్షించాలని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ( Nadendla Manohar ) డిమాండ్ చేశారు.
అమరావతి: కావలిలో ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేసిన వైసీపీ మూకలను కఠినంగా శిక్షించాలని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ( Nadendla Manohar ) డిమాండ్ చేశారు. శనివారం నాడు జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘వైసీపీ అధికారంలోకి వచ్చాక అరాచకం అనే మాట తప్ప అభివృద్ధి అనే మాట ఎక్కడా వినిపించడం లేదు. అధికార దుర్వినియోగం, అందుకు తోడైన అహంకారంతో వైసీపీలో ప్రతి స్థాయి నాయకుడు ప్రజలు, ఉద్యోగుల మీదా జులుం చేస్తున్నారు. కావలి వద్ద ఆర్టీసీ డ్రైవర్‌పై చేసిన దాడి చూస్తే వైసీపీ అరాచకం ఏ విధంగా పెచ్చరిల్లుతోందో అర్థం అవుతోంది. రోడ్డుకి అడ్డంగా ఉన్న మోటార్ సైకిల్ తీయమని హారన్ మోగించడమే ఆ ఆర్టీసీ డ్రైవర్ చేసిన నేరమా? ఆ బస్సును వెంబడించి మరీ డ్రైవర్‌పై విచక్షణరహితంగా దాడి చేయడం దారుణం. ఆ అరాచకాన్ని చిత్రించినవారిని బెదిరించారంటే అలాంటి గూండాలకు బలమైన అండ ఉండటమే దాడికి కారణం అనిపిస్తోంది. విధి నిర్వహణలో ఉన్న డ్రైవర్‌పై దాడి చేసినవారిని కఠినంగా శిక్షించాలి. ఈ ఘటనకు కారకులైన వారిని అరెస్టు చేయడంలో పోలీసులు స్పందించాలి. కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం తమ గూండా నాయకులు, కార్యకర్తలకు మద్దతుగా కొత్త చట్టాలు చేస్తుందేమో అనే సందేహం ఉంది. వారికి మిగిలిన ఈ నాలుగు నెలల్లో- హారన్ కొట్టడం, సైకిల్ మీద తిరగడం, రోడ్డు మీద నడవటం కూడా నేరాలుగా పరిగణిస్తూ చట్టాలు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు’’ అని నాదెండ్ల మనోహర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - 2023-10-28T15:48:37+05:30 IST