ఘనంగా లోకేశ్ జన్మదినోత్సవం
ABN , First Publish Date - 2023-01-24T03:58:38+05:30 IST
టీడీపీ యువ నేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జన్మదినోత్సవ కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా వేడుకగా జరిగాయి.

విజయవాడలో 108 జంటలతో 11 రకాల హోమాలు
వెయ్యి కిలోల కేక్ కోసి యువనేతకు శుభాకాంక్షలు
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
టీడీపీ యువ నేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జన్మదినోత్సవ కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా వేడుకగా జరిగాయి. ఆయన త్వరలో ప్రారంభించబోయే పాదయాత్ర(యువగళం)ను పురస్కరించుకొని ఆ పార్టీ శ్రేణులు ఈసారి పుట్టినరోజు కార్యక్రమాలను సోమవారం కోలాహలంగా జరిపాయి. విజయవాడలోని పున్నమిఘాట్‌లో తెలుగు వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండీ రాకేశ్, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు, టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల రఘురామరాజు, సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నరసింహ ప్రసాద్, కార్యకర్తల సంక్షేమ నిధి కో-ఆర్డినేటర్ శిష్టా లోహిత్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 108 జంటలతో 11 రకాల హోమాలు, శివపార్వతుల కల్యాణం, అన్నదాన కార్యక్రమాలు జరిపారు. వెయ్యి కేజీల భారీ కేకును కట్ చేసి లోకేశ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, మాజీ మంత్రులు దేవినేని ఉమా, కేఎస్ జవహర్, పీతల సుజాత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, పార్టీ నేతలు జయమంగళ వెంకటరమణ, కొమ్మారెడ్డి పట్టాభిరామ్, నాగుల్‌మీరా, కేశినేని చిన్ని, ఎం.వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ు అచ్చెన్నాయుడు కేక్ కట్ చేశారు.
యువగళం పాదయాత్ర లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ లోకేశ్ పాదయాత్ర అంటే వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయని, ఆ పార్టీ నాయకుల ప్యాంట్లు తడుస్తున్నాయని తెలిపారు. పాదయాత్రను అడ్డుకునేందుకు జగన్‌రెడ్డి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పాదయాత్ర చేసుకోవచ్చునని నీ తల్లి విజయమ్మ చెప్పిన విషయం గుర్తుకు రాలేదా పిచ్చి ముఖ్యమంత్రి జగన్‌రెడ్డీ? డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డి ఐపీఎస్ చదివాడా? దొంగ సర్టిఫికెట్‌తో ఉద్యోగంలోకి వచ్చాడా అన్న అనుమానం కలుగుతోంది’ అన్నారు. ఎంపీ రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ యువత కష్టాలు తెలుసుకునేందుకు, వారిలో భరోసా నింపడానికి లోకేశ్ పాదయాత్ర చేస్తున్నారని చెప్పారు. వైసీపీ నేతలు ఆపితే ఆగడానికి లోకేశ్ ఆర్టీసీ బస్సు కాదని, బుల్లెట్ ట్రైన్ అని టీడీపీ నేతలు హెచ్చరించారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆయన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారీ కేక్‌ను కట్ చేశారు. కార్యాలయ మహిళా సిబ్బందికి టీఎన్‌టీయూసీ నేతలు చీరలు పంపణీ చేశారు. మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు మాట్లాడుతూ లోకేశ్ పాదయాత్రతో వైసీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందన్నారు. విశాఖలో తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు అనిత మాట్లాడుతూ లోకేశ్ పాదయాత్ర చేపట్టనుండడంతో వైసీపీ నేతల్లో వణుకు మొదలైందని ఎద్దేవా చేశారు.